State Government to Move Supreme Court: రేపు సుప్రీంకు
ABN , Publish Date - Oct 12 , 2025 | 04:08 AM
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే జీవోను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది...
బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ వేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
జనరల్‌కు 50%తో ఎన్నికలు పెట్టాల్సిందేనన్న హైకోర్టు
శుక్రవారం అర్ధరాత్రి వెలువడ్డ తీర్పు ప్రతిలో వివరాలు
ముందుకు వెళ్లడం తప్ప మార్గంలేని పరిస్థితిలో ఈసీ
ఏం చేయాలో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ?
ఈ నేపథ్యంలోనే సుప్రీంకు వెళుతున్న కాంగ్రెస్ సర్కార్
అక్కడి పరిణామాలను బట్టి తర్వాతి కార్యాచరణ
బీసీ రిజర్వేషన్లే అజెండాగా 16న మంత్రివర్గ భేటీ
హైదరాబాద్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే జీవోను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీర్పు గురువారం వచ్చినప్పటికీ శుక్రవారం అర్థరాత్రి తీర్పుకాపీ అందుబాటులోకి వచ్చింది. అందులో సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం పరిమితికి మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయాలని, జీవోలో యాభై శాతానికి మించి ఇచ్చిన రిజర్వేషన్‌ను జనరల్ సీట్లుగా పరిగణిస్తూ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకు వెళ్లాలని హైకోర్టు స్పష్టం చేసింది. 50 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాల్సిందేనని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల సంఘం స్వతంత్ర వ్యవస్థ అయినప్పటికీ ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముడిపడిన అంశం కావడంతో హైకోర్టు ఆదేశంపై ఏం చేయాలో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. సోమవారం స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) లేదా అత్యవసర విచారణ కింద పిటిషన్ దాఖలు చేయనుంది. హైకోర్టు తీర్పు కాపీతో పాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తాము చేసిన కార్యాచరణ వివరాలన్నింటినీ సమగ్రంగా పిటిషన్లో భాగంగా సుప్రీంకోర్టుకు అందజేయనుంది. జీవో నంబరు 9 మీద హైకోర్టులో పిటిషన్ వేసి స్టే సంపాదించిన బుట్టెంగారి మాధవరెడ్డి తదితరులు శుక్రవారమే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేస్తే తమ వాదనలు విన్న తరువాతే ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ కేవియట్ పిటిషన్ వేశారు. రిజర్వేషన్లు యాభై శాతం మించకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో జీవో నంబర్ 9లో కల్పించిన విధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూనే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర మంత్రివర్గం, కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతున్ననేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయానికి వచ్చారు. సుప్రీంకోర్టులో పిటిషన్ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులు, అడ్వొకేట్ జనరల్‌తో పాటు పలువురు నిపుణులతో చర్చిస్తున్నారు. శుక్రవారం రాత్రి హైకోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాత 50 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి అనే అభిప్రాయం ధ్రువీకరణ కావడంతో సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించారు. శనివారం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ జూమ్ మీటింగ్‌లో సుదీర్ఘంగా మాట్లాడారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది.
16న మంత్రివర్గం
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 15, 10, 25 శాతం చొప్పున రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలు జరపాలని హైకోర్టు చెబుతున్న నేపథ్యంలో బీసీలకు 42 శాతం సాధించుకోవాల్సిందేనని పట్టుదలతో ఉన్న రాష్ట్ర మంత్రివర్గం ఈ అంశంపై చర్చించేందుకు గురువారం(16వ తేదీ) సమావేశం అవుతోంది. సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ వేస్తున్న నేపథ్యంలో సుప్రీం స్పందన తర్వాత కార్యాచరణ చర్చించాలనే ఉద్దేశంతో మంత్రివర్గ సమావేశాన్ని గురువారం నిర్వహిస్తున్నారు. అన్ని సామాజిక వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతం మించరాదని గతంలో పలు కేసుల విచారణల్లో భాగంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. బీసీలకు ఇప్పుడున్న వాటికన్నా రిజర్వేషన్లు పెంచాలన్నా అందుకు సంబంధించి సమగ్ర వివరాలు ఉండాలని (ఎంపిరికల్ డేటా) సూచించింది. 2022లో బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించిన ఒక తీర్పులో ట్రిపుల్ టెస్ట్‌ను నిర్దేశించింది. 1) స్థానికంగా ఓబీసీల సమగ్ర వివరాలను సేకరించాలి. అందుకు ప్రత్యేకంగా ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. 2) కమిషన్ అధ్యయనం తరువాత రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించాలి. 3) మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు. తెలంగాణ బీసీ రిజర్వేషన్ల విషయంలో మొదటి రెండు టెస్టులు పాసయింది. మూడో సూచనతోనే ఇప్పుడు చిక్కుముడి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే వివరాల ప్రకారం రాష్ట్రంలో 56 శాతానికి పైగా బీసీలు ఉన్నారని తేలింది. జనాభా నిష్పత్తి ప్రకారమే వారికి 42 శాతం కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కానీ, 42 శాతం కలిపితే రాష్ట్రంలో రిజర్వేషన్లు 67 శాతం అయ్యాయి. సుప్రీం తీర్పు మేరకు రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు, రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించి, అమలు చేయాలంటే అందుకు రాజ్యాంగ సవరణ అవసరం. తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్‌లో పెట్టాలి. అందుకోసమే స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు 2018 పంచాయతీరాజ్ చట్టంలో సవ రణలు చేస్తూ ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతికి పంపింది. దీనిపై కేంద్రం సమాధానం చెప్పడంలేదు. వెరసి ఇప్పుడు ఈ అంశం సుప్రీంకు చేరనుంది. ఇప్పటికే రాష్ట్రంలో గ్రామాల్లో పంచాయతీల గడువు ముగిసి ఏడాదిన్నరకు పైగా అవుతుంది. ఫలితంగా కేంద్రం నుంచి అందాల్సిన నిధులు అందడంలేదు. పాలక మండళ్లు లేకపోవడంతో గ్రామాల అభివృద్ధి విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ విషయాన్ని కూడా సుప్రీంలో ప్రస్తావించనున్నారు.
మమ్మల్ని ఏం చేయమంటారు?
స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వాటి ప్రకారం ఎన్నికలను నిర్వహించాలంటూ గత నెలలో ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. దాని ఆధారంగానే సెప్టెంబరు చివర్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్లు విడుదల చేసింది. రిజర్వేషన్లకు ప్రాతిపదిక అయిన జీవో నంబర్ 9ను హైకోర్టు కొట్టేయడంతో ఎన్నికల ప్రక్రియను ఈసీ నిలిపేసింది. ఈ మేరకు గురువారమే ప్రకటన కూడా విడుదల చేసింది. తాజాగా అందుబాటులోకి వచ్చిన తీర్పు కాపీలో రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని హైకోర్టు చెప్పడంతో, దానికి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రాతిపదికగా ప్రస్తావించడంతో ఈసీ సందిగ్దంలో పడింది. గురువారం ఎన్నికల ప్రక్రియను నిలిపేసిన ఈసీ తీర్పు కాపీ అందిన తర్వాత ఏమీ చేయకుండా కూర్చోలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో ‘మమ్మల్ని ఏం చేయమంటార’ంటూ ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మొత్తం వ్యవహారంపై ఎన్నికల కమిషన్ కూడా న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. ఎన్నికల సంఘం అడిగితే సుప్రీంకోర్టుకు వెళుతున్నట్లు చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
తీర్పులో ఏముంది?
హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎ్‌సఈసీ) మీద గురుతర బాధ్యత పడింది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముందుకు వెళ్లాలని, 50 శాతం సీట్లు ఓపెన్ క్యాటగిరీకి నోటిఫై చేసి, ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. తీర్పులో పలు కీలక విషయాలు ప్రస్తావింంచింది. చట్టబద్ధంగా అనుమతించిన కాలం కంటే ఎక్కువగా స్థానిక ఎన్నికలను ఆపడానికి వీల్లేదని, పంచాయతీల గడువు ముగియడానికి ముందే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని చట్టంలో స్పష్టంగా ఉందని హైకోర్టు గుర్తు చేసింది. గతంలో కూడా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా తీవ్ర ఆలస్యం చేయడంపై హైకోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. సెప్టెంబరు 30 లోగా అంటే మూడు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాల్సిందే అని హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. పంచాయతీల పదవీకాలం ముగిసి హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చే నాటికి పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించక 15 నెలలైంది. ప్రస్తుతం 18 నెలలుగా పంచాయతీలు కార్యవర్గం లేకుండా ఖాళీగా ఉంటున్నాయి. ప్రస్తుతం హైకోర్టు డివిజన్ బెంచ్ ఇదే విషయాన్ని నొక్కి చెప్పింది. తాము ఎన్నికల ప్రక్రియను ఆపడం లేదని పదే పదే గుర్తుచేసింది. చట్టబద్ధమైన పరిమితి(స్టాట్యుటరీ పీరియడ్) కంటే ఎక్కువకాలం స్థానిక ఎన్నికలు వాయిదా వేయడం కుదరదని చెప్పింది. ఎన్నికల ప్రక్రియపై ముందుకు వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. తాము ఎన్నికల ప్రక్రియను నిలిపేయడం లేదని, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉన్న రిజర్వేషన్ల జీవోపై మాత్రమే స్టే ఇచ్చామని గుర్తు చేసింది. రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో 50 శాతానికి మించరాదన్న సూత్రం ప్రకారం ఓపెన్ క్యాటగిరీకి 50 శాతం సీట్లను కేటాయిస్తూ నోటిఫై చేయాలని, ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముందుకు వెళ్లిపోవాలని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో 50 శాతం సీట్లు ఓపెన్ క్యాటగిరీకి కేటాయిస్తూ నోటిఫై చేసి ఎన్నికల ప్రక్రియ కొనసాగించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘం మీద పడింది. ఈ లెక్కన ఎప్పట్లాగే ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం 15, 10 శాతం పోగా బీసీలకు 25 శాతం మిగులుతాయి. ఓపెన్ క్యాటగిరీలో కచ్చితంగా 50 శాతం సీట్లు కొనసాగించాల్సి ఉంటుంది. ఏవైనా రాష్ట్రాలు ట్రిపుల్ టెస్ట్ అమలు చేయలేకపోతే ఆయా రాష్ట్రాల ఎన్నికల సంఘాలు దామాషా సీట్లను ఓపెన్ క్యాటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని హైకోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల ప్రక్రియపై ముందుకు వెళ్లడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది.