Share News

Cabinet Meetings: నెలకు రెండుసార్లు క్యాబినెట్‌ భేటీ

ABN , Publish Date - Jun 07 , 2025 | 03:40 AM

పాలనలో వేగం పెంచేందుకు, విధానపరమైన నిర్ణయాల్లో జాప్యం లేకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతినెలా రెండుసార్లు మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.

Cabinet Meetings: నెలకు రెండుసార్లు క్యాబినెట్‌ భేటీ

  • మొదటి, మూడో శనివారం..

  • ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయికి చేరేలా చూసేందుకే నిర్ణయం

  • ఏర్పాట్లపై అధికారులకు ఆదేశం

హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): పాలనలో వేగం పెంచేందుకు, విధానపరమైన నిర్ణయాల్లో జాప్యం లేకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతినెలా రెండుసార్లు మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. నెలలో మొదటి శనివారం, మూడో శనివారం క్యాబినెట్‌ సమావేశమై.. క్షేత్రస్థాయిలో పభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనులపై సమీక్షించనుంది. ఈ మేరకు రెండు వారాలకు ఒకసారి క్యాబినెట్‌ సమావేశం ఉండేలా ఏర్పాట్లు చేయాలని సీఎం అఽధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు 17 మంత్రివర్గ సమావేశాలను నిర్వహించారు.


వీటిలో గురువారం (ఈ నెల 5న) నిర్వహించిన సమావేశంలో ఏకంగా 24 అంశాలపై చర్చించి, నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం మంత్రివర్గ సమావేశాల్లో అత్యధిక నిర్ణయాలు తీసుకున్నది ఈ భేటీలోనే. కాగా, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, అధికార యంత్రాంగం పనితీరు సహా పలు కారణాలతో మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు ఆశించిన స్థాయిలో క్షేత్రస్థాయికి వెళ్లడంలేదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో నెలలో రెండుసార్లు క్యాబినెట్‌ భేటీ నిర్వహించాలని, గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు ఎంతమేరకు క్షేత్ర స్థాయికి చేరాయనే అంశంపై చర్చించాలని నిర్ణయించింది. తద్వారా పలు పథకాలు, కీలక అంశాలపై తీసుకున్న నిర్ణయాలు, వాటి ఉపయోగాలు ప్రజలకు త్వరితగతిన తెలిసే అవకాశం ఉంటుందని భావిస్తోంది.

Updated Date - Jun 07 , 2025 | 03:40 AM