Share News

High Court: సాదాబైనామాల క్రమబద్ధీకరణపై స్టేను ఎత్తేయాలి

ABN , Publish Date - Aug 21 , 2025 | 04:18 AM

సాదాబైనామాలపై 2020లో ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తేయాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

High Court: సాదాబైనామాల క్రమబద్ధీకరణపై స్టేను ఎత్తేయాలి

  • భూభారతి చట్టం ప్రకారం ప్రభుత్వం

  • క్రమబద్ధీకరణ చేయొచ్చు.. అడ్వకేట్‌ జనరల్‌

  • తదుపరి విచారణ 26కు వాయిదా

హైదరాబాద్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): సాదాబైనామాలపై 2020లో ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తేయాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన తెలంగాణ భూభారతి చట్టం ప్రకారం సాదాబైనామాలను క్రమబద్ధీకరించే అధికారం ప్రభుత్వానికి ఉందని అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు గతంలో ఉన్న స్టేను ఎత్తేయాలని పేర్కొంటూ మధ్యంతర అప్లికేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. కాగా పిటిషనర్‌ వాదన వినాల్సి ఉన్నందున విచారణను ఈనెల 26కు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. సాదాబైనామాల క్రమబద్ధీకరణ కోసం గత ప్రభుత్వం 2020 అక్టోబరు 12న జారీ చేసిన జీవో 112ను కొట్టేయాలని పేర్కొంటూ నిర్మల్‌ జిల్లాకు చెందిన షిండే దేవిదాస్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. దీనిపై అప్పట్లో విచారణ చేపట్టిన డివిజన్‌ బెంచ్‌ సాదా బైనామాల క్రమబద్ధీకరణ ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అందిన దరఖాస్తులు క్రమబద్ధీకరించరాదని ఆదేశించింది.


కొత్త చట్టం అమల్లోకి వచ్చాక పాత చట్టం ప్రకారం క్రమబద్ధీకరణ చేయడాన్ని తప్పుబట్టింది. కొత్త చట్టం (ధరణి) రాకముందు (2020 అక్టోబరు 29) వరకు 2,26,693 దరఖాస్తులు, 29 తర్వాత 6,74,201 దరఖాస్తులు వచ్చినట్టు సర్కా రు అప్పట్లో వెల్లడించింది. గడువుకు ముందు వచ్చిన దరఖాస్తులపై నిర్ణయం కూడా తామిచ్చే తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా 2020లో ఇచ్చిన స్టే ఎత్తేయాలని తాజాగా రాష్ట్ర ప్ర భుత్వం మధ్యంతర అప్లికేషన్‌ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా పిల్‌పై చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ఏజీ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. 2020లో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తేయాలని, పిల్‌ను కొట్టివేయాలని కోరారు. రాష్ట్రంలో భూభారతి చట్టం-2025 అమల్లోకి వచ్చిందని, ఇందులోని సెక్షన్‌ 6 ప్రకారం 2014 జూన్‌ 2 ముందు 12ఏళ్లు భూమి తమ ఆధీనం లో ఉన్నట్లు ఆధారాలు చూపిన చిన్న, సన్నకారు రైతులకు సాదాబైనామా క్రమబద్ధీకరణకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. కొత్తచట్టం నేపథ్యంలో 2020లో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని, స్టే ఉత్తర్వులు ఎత్తివేస్తే ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభిస్తుందని తెలిపారు. ప్రభుత్వ మధ్యంతర అప్లికేషన్లపై తమ వాదన వినిపించడానికి సమయం కావాలని పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది జే ప్రభాకర్‌ కోరారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

బతుకమ్మ కుంట అభివృద్ధి పనులపై హైడ్రా ఫోకస్

హైదరాబాద్‌పై ప్రపంచ దృష్టి.. అభివృద్ధిని అడ్డుకునే వారే శత్రువులు: సీఎం రేవంత్‌రెడ్డి

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 21 , 2025 | 04:18 AM