Share News

Pending Bills: ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులకు 700 కోట్లు విడుదల

ABN , Publish Date - Aug 31 , 2025 | 04:38 AM

పెండింగ్‌ బిల్లుల అంశంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టు నెలకు సంబంధించిన రూ.700 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

Pending Bills: ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులకు 700 కోట్లు విడుదల

  • ఆగస్టు నెలకు సంబంధించిన నిధులిచ్చిన ప్రభుత్వం

  • ఉద్యోగుల జేఏసీ హర్షం

  • మిగిలిన డిమాండ్లను ఇలానే పరిష్కరించాలని వినతి

హైదరాబాద్‌, ఆగస్టు30(ఆంధ్రజ్యోతి): పెండింగ్‌ బిల్లుల అంశంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టు నెలకు సంబంధించిన రూ.700 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జీతాల సప్లమెంటరీ బిల్లులకు సంబంధించిన బకాయిలు రూ.392 కోట్లు, 2024 సెప్టెంబరు వరకు ఉన్న జీపీఎఫ్‌ బకాయిలు రూ.308కోట్లు కలిపి రూ.700 కోట్లు చెల్లించింది. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం నిధులు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివా్‌సరావు కూడా శనివారం ఓ ప్రకటన చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పింఛనుదారులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని డిమాండ్లను ఇదే తరహాలో పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిజానికి, ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులకు సంబంధించిన నిధులను ఒకేసారి విడుదల చేయలేమని, నెలకు రూ.700 కోట్ల చొప్పున విడుదల చేసి ఏడాదిలోపు బకాయిలు లేకుండా చేస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రభుత్వం తరఫున గతంలో హామీ ఇచ్చారు. కానీ, గత మూడు నెలల్లో పూర్తిస్థాయిలో నిధులు విడుదల కాకపోవడంతో ఉద్యోగ సంఘాలు గుర్రుగా ఉన్నాయి.


ఉద్యోగుల సమస్యలపై స్పందించని ప్రభుత్వంపై ఇక సమరమే అంటూ ఆగస్టు 19న నిర్వహించిన ఐకాస విస్త్రత స్థాయి సమావేశంలో ఉద్యమ కార్యాచరణను కూడా ప్రకటించారు. సెప్టెంబరు 8వ తేదీ నుంచి ఉమ్మడి 10 జిల్లాల్లో బస్సు యాత్ర, అక్టోబరు 12న చలో హైదరాబాద్‌ నిర్వహిస్తామని వెల్లడించారు. దీంతో ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతుందని గుర్తించిన ప్రభుత్వం అప్రమత్తమైంది. ఐకాస ప్రతినిధులతో గత వారం చర్చలు జరిపింది. అనంతరం ఉద్యోగుల సమస్యల మీద ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి చైర్మన్‌ అయిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగస్టు 22న సీఎం రేవంత్‌ రెడ్డితో సమావేశమయ్యారు. ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవ్వడానికి దారి తీసిన పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు. ఆ మరుసటి రోజే ఐకాస నేతలో మంత్రి భట్టి సమావేశమయ్యారు. అనంతరం సెప్టెంబరు 2న చర్చలకు రావాలని ఉద్యోగ ఐకాసను ప్రభుత్వం ఆహ్వానించింది. అలాగే, ఆగస్టు నెలకు సంబంధించి చెల్లించాల్సిన రూ.700 కోట్లను ఒకేసారి చెల్లిస్తామని ప్రభుత్వం సానుకూల సంకేతాలు పంపింది. అయితే, ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం గత మూడు నెలల్లో ఉద్యోగుల బకాయిలకు సంబంధించి రూ.2100 కోట్లు ఇవ్వాల్సి ఉంటే.. కేవలం రూ.1000 కోట్లు చెల్లించారని ఐకాస ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆగస్టు నెలకు సంబంధించిన రూ.700కోట్లను ప్రభుత్వం ఒకేసారి విడుదల చేయడంతో ఉద్యోగ సంఘాలు శాంతించాయి.


ఇవి కూడా చదవండి:

కాళేశ్వరం పీపీటీ ప్రజెంటేషన్‌‌పై మాటల యుద్ధం..

15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి.. కేటీఆర్ డిమాండ్

మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 31 , 2025 | 04:38 AM