అంకుర సంస్థలూ సైబర్ భద్రత పాటించాలి
ABN , Publish Date - Feb 17 , 2025 | 04:36 AM
సైబర్ భద్రత అనేది పెద్ద కంపెనీలు, టెక్ దిగ్గజాలకే పరిమితం అనుకోకుండా ప్రతి స్టార్టప్ కంపెనీ దృష్టిసారించాలని, వాటి రక్షణ కోసం షీల్డ్-2025 పథకాన్ని తీసుకుని వస్తున్నామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీపీ శిఖాగోయల్ తెలిపారు.

సైబర్ ముప్పుల నుంచి రక్షణకు ‘షీల్డ్-2025’
రేపు ప్రారంభం: శిఖాగోయల్
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): సైబర్ భద్రత అనేది పెద్ద కంపెనీలు, టెక్ దిగ్గజాలకే పరిమితం అనుకోకుండా ప్రతి స్టార్టప్ కంపెనీ దృష్టిసారించాలని, వాటి రక్షణ కోసం షీల్డ్-2025 పథకాన్ని తీసుకుని వస్తున్నామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీపీ శిఖాగోయల్ తెలిపారు. ఈనెల 18 నుంచి రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో సైబర్ భద్రతా సదస్సు నిర్వహిస్తున్నామని ఆదివారం మీడియాతో చెప్పారు. స్టార్టప్ కంపెనీలు దేశానికి వెన్నెముక లాంటివని, ఇవి దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుని వెళ్లే అభివృద్ధి యంత్రాలని ఆమె కొనియాడారు.
ప్రస్తుతం దేశంలో లక్షా 40వేల స్టార్టప్ కంపెనీలున్నాయన్నారు. సైబర్ మోసాలు చిన్న పెద్దా తేడా లేకుండా అన్ని సంస్థలకు శత్రువులగా మారాయని, ప్రారంభ దశలో పెద్ద నష్టాలను స్టార్టప్ కంపెనీలు భరించలేవని అన్నారు. షీల్డ్ 2025లో ప్రతి అంకుర సంస్థ నమోదు చేసుకుని రక్షణ పొందాలని సూచించారు. హెచ్‌ఐసీసీలో మంగళవారం షీల్డ్ సైబర్ భద్రతా సదస్సును సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభిస్తారని అందులో పాల్గొని సైబర్ భద్రతా పరిజ్ఞానం పొందాలని, అలాగే తమ బృందాలకు మెలకువలు నేర్పించాలని ఆమె సూచించారు.