బడికి శ్రీవిద్య
ABN , Publish Date - Mar 07 , 2025 | 04:04 AM
శ్రీవిద్య ముఖంలో వెలుగులొచ్చాయి. అందరిలా తానూ రోజూ బడికి వెళ్లి చక్కగా చదువుకోవొచ్చునన్న ఆనందం ఆ చిన్నారిలో! అక్షరాలు దిద్దుదువుగానీ రా అంటూ బడి ఆమెను అక్కున చేర్చుకుంది.

బాలికను బడిలో చేర్పించాలంటూ సీఎం ఆదేశం
సనత్‌నగర్‌లోని శ్రీవిద్య ఇంటికి డీఈవో రోహిణి
పాఠశాలలో చేర్పించి.. పుస్తకాలు అందజేత
చిన్నారికి జనన ధ్రువీకరణ పత్రం ఇచ్చే దిశగా జీహెచ్‌ఎంసీ చర్యలు
హైదరాబాద్ సిటీ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): శ్రీవిద్య ముఖంలో వెలుగులొచ్చాయి. అందరిలా తానూ రోజూ బడికి వెళ్లి చక్కగా చదువుకోవొచ్చునన్న ఆనందం ఆ చిన్నారిలో! అక్షరాలు దిద్దుదువుగానీ రా అంటూ బడి ఆమెను అక్కున చేర్చుకుంది. నోటుబుక్కులు, పెన్సిళ్లు ఇచ్చి ముద్దుచేసింది. చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా సరైన పత్రాలు లేకపోవడంతో ఇంట్లోనే నిరాశగా గడుపుతున్న నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీవిద్య గురించి ‘ఆధార్ ఇప్పిస్తే ఈ చిన్నారి చదువుకుంటుంది’ అనే శీర్షికన గురువారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. సనత్‌నగర్ దాసారం బస్తీకి చెందిన ఎనిమిదేళ్ల మల్లెల శ్రీవిద్య బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు లేని కారణంగా బడికి వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయని అందులో వివరించింది. ఈ కథనంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆదేశాలతో డీఈవో రోహిణి వెంటనే చర్యలు తీసుకున్నారు. ఆమే స్వయంగా దాసారం బస్తీలోని శ్రీవిద్య ఉంటున్న నివాసానికి వెళ్లారు. బాలిక తల్లిదండ్రులు అశోక్, మమతతో మాట్లాడి సమస్య ఏమిటో తెలుసుకున్నారు. ఏ పాఠశాలలోనైతే శ్రీవిద్య పేరును కొట్టేశారో.. అదే పాఠశాల అయిన బీకే గూడలోని ‘శ్రీ విద్యాంజలి స్కూల్’ ప్రిన్సిపాల్‌తో రోహిణి మాట్లాడారు. బాలికను బడిలో చేర్చుకోవాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. అనంతరం తల్లి మమత తోడుగా శ్రీవిద్యను వెంటబెట్టుకొని డీఈవో స్వయంగా ఆ బడికి వెళ్లారు. అక్కడ శ్రీవిద్యను ఒకటో తరగతిలో చేర్పించి.. క్లాసులో కూర్చోబెట్టారు. అక్కడ చిన్నారికి అవసరమైన పుస్తకాలు, నోటు బుక్కులు ఇచ్చారు. ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై మాజీ మంత్రి కేటీఆర్ కూడా సామాజిక మాధ్యమం వేదికగా స్పందిచారు. శ్రీవిద్య చదువుకు సహకరిస్తామని పేర్కొన్నారు. ఇక.. రెండ్రోజుల్లో శ్రీవిద్యకు అవసరమైన పత్రాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటానని సనత్‌నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఆయన ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ అధికారులు గురువారం సాయంత్రం చిన్నారి ఇంటికి వెళ్లారు. బర్త్ సర్టిఫికెట్ కోసం తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలను నమోదు చేసుకున్నారు. సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోట నీలిమ, చిన్నారి ఇంటికి వెళ్లి సమస్యను తెలుసుకుని స్కూల్ నిర్వాహకులతో మాట్లాడారు. అంతకుముందు.. రాష్ట్ర న్యాయ సేవాధికార కార్యదర్శి పంచాక్షరి ఆదేశాల మేరకు హైదరాబాద్ జిల్లా సీనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అబ్దుల్ జావేద్, బస్తీలో శ్రీవిద్య ఉంటున్న నివాసానికి వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఈవో రోహిణితో మాట్లాడి చిన్నారిని బడిలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
శ్రీవిద్య చదువులతో రాణించాలి: రేవంత్
శ్రీవిద్య సమస్యపై సీఎం రేవంత్ ఎక్స్ వేదికగా స్పందించారు. చిన్నారి పాఠశాలకు హాజరుకాలేకపోతున్నట్లు పత్రికల ద్వారా తన దృష్టికి వచ్చిందని, దీనిపై డీఈవో రోహిణి ద్వారా విచారణ జరిపించినట్లు చెప్పారు. నివేదిక ప్రకారం.. కుటుంబ కారణాల వల్ల ఆమె పాఠశాలకు దూరమైందని, తన ఆదేశాల మేరకు అధికారులు తిరిగి శ్రీవిద్యను పాఠశాలలో చేర్పించారని పేర్కొన్నారు. శ్రీవిద్య మంచి చదువులు చదివి భవిష్యత్తులో గొప్పగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.