Share News

Telangana Government: బీసీ రిజర్వేషన్లకు నేడో, రేపో ప్రత్యేక జీవో

ABN , Publish Date - Sep 03 , 2025 | 03:46 AM

రాష్ట్రంలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేటాయించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా..

Telangana Government: బీసీ రిజర్వేషన్లకు నేడో, రేపో ప్రత్యేక జీవో

  • రిజర్వేషన్‌ బిల్లుపై నిర్ణయం తీసుకోని గవర్నర్‌

  • జీవోలతో 42% రిజర్వేషన్లు కల్పించి, స్థానిక ఎన్నికలకు వెళ్లే యోచనలో ప్రభుత్వం

హైదరాబాద్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేటాయించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయనుంది. అందుకు అవసరమైన కసరత్తును పూర్తిచేసినట్లు విశ్వసనీయ సమాచారం. నేడో, రేపో జీవోలను విడుదల చేయనున్నట్లు తెలిసింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేటాయించేందుకు 2018 పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 285(ఏ)ను సవరిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును శాసనసభ ఆమోదించింది. వెంటనే బిల్లును గవర్నర్‌ ఆమోదం కోసం పంపించారు. కానీ, గవర్నర్‌ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో సోమవారం కాంగ్రెస్‌ నేతృత్వంలో అఖిలపక్ష నేతలు వెళ్లి గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మను కలిసి, బిల్లును ఆమోదించాలని కోరారు. అయినా, మంగళవారం రాత్రి వరకు కూడా రాజ్‌భవన్‌ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రత్యేక జీవోలతో బీసీలకు రిజర్వేషన్లను కల్పిస్తూ స్థానిక ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. కాగా, రాష్ట్రంలో నిర్వహించిన కుల సర్వేలో తేలిన జనాభా ఆధారంగా.. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో వెనకబడిన తరగతుల వారికి కేటాయించాల్సిన రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఈ నెల 30లోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే ప్రత్యేక జీవోల జారీకి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.


ఇవి కూడా చదవండి..

దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..

ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Updated Date - Sep 03 , 2025 | 03:46 AM