Share News

Warangal: బ్యాంకు ఖాతాలోని డబ్బులివ్వలేదని తల్లిపై పెట్రోల్‌ పోసి నిప్పు

ABN , Publish Date - Jun 29 , 2025 | 04:54 AM

డబ్బు మీద వ్యామోహంతో విచక్షణ మరిచిన ఓ వ్యక్తి.. తనని కన్న తల్లి పట్ల రాక్షసంగా ప్రవర్తించాడు. ఎన్నిసార్లు అడిగినా సరే బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును తనకివ్వడం లేదనే ఆక్రోశంతో..

Warangal: బ్యాంకు ఖాతాలోని డబ్బులివ్వలేదని తల్లిపై పెట్రోల్‌ పోసి నిప్పు

  • ఓ కుమారుడి ఘాతుకం

  • 90 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన బాధితురాలు

  • వరంగల్‌ జిల్లా కుంటపల్లిలో ఘటన

సంగెం, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): డబ్బు మీద వ్యామోహంతో విచక్షణ మరిచిన ఓ వ్యక్తి.. తనని కన్న తల్లి పట్ల రాక్షసంగా ప్రవర్తించాడు. ఎన్నిసార్లు అడిగినా సరే బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును తనకివ్వడం లేదనే ఆక్రోశంతో.. తల్లిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. వరంగల్‌ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ ఘటనలో వినోద(60) అనే మహిళ 90 శాతం మేర కాలిన గాయాలతో ఆస్పత్రిపాలైంది. సంగెం పోలీసులు, కుంటపల్లి గ్రామప్రజల కథనం ప్రకారం.. కుంటపల్లికి చెందిన ముత్తినేని సాంబయ్య-వినోద దంపతులకు కుమారుడు సతీష్‌, కుమార్తె ఉన్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. సతీష్‌ గ్రామంలో జులాయిగా తిరుగుతుంటాడు. టెక్స్‌టైల్‌ పార్కు కోసం చేపట్టిన భూసేకరణలో సాంబయ్య పొలాన్ని కూడా సేకరించారు. ఇందుకు సంబంధించిన పరిహారం ప్రభుత్వం చెల్లించగా..అందులో కొత్త మొత్తంతో ఖానాపురం మండలం ధర్మారావుపేటలో కొంత సాగు భూమి కొనుగోలు చేశారు.


మరో రూ.5 లక్షలను సంగెంలోని ఓ బ్యాంకులో జమ చేసుకుని వృద్ధ దంపతులు జీవనం సాగిస్తున్నారు. బ్యాంకులో ఉన్న ఆ సొమ్ము కోసం సతీష్‌ తన తల్లిదండ్రులతో పలుమార్లు గొడవపడటమే కాక దాడులు కూడా చేశాడు. దీంతో తల్లిదండ్రులకు దూరంగా ఉండాలని గ్రామ పెద్దలు చెప్పడంతో.. సతీష్‌ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఏప్రిల్‌ నుంచి గీసుగొండ మండలం గంగదేవిపల్లిలో నివాసముంటున్నాడు. కానీ, బ్యాంకు ఖాతాలోని సొమ్ముపై అతనిలో మార్పు రాలేదు. ఎన్నిసార్లు అడిగినా తల్లిదండ్రులు ఆ డబ్బు ఇవ్వకపోవడంతో కక్ష పెంచుకున్న సతీష్‌ పెట్రోల్‌ సీసాతో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కుంటపల్లి చేరుకున్నాడు. ఇంటి వద్ద ఆరుబయట నిద్రిస్తున్న తల్లిపై పెట్రోల్‌ పోసి ఆమె మేల్కోనేలోపే నిప్పు అంటించాడు. దాంతో వినోద పెట్టిన కేకలకు సాంబయ్య నిద్ర లేచేసరికి సతీష్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు మంటలను అదుపు చేయగా.. విషయం తెలిసి ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వినోదకు 90 శాతం మేర కాలిన గాయాలు అయ్యాయని తెలిపిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Updated Date - Jun 29 , 2025 | 04:54 AM