బరాబర్ ఇల్లు కడతా.. నువ్వు చస్తే గోరి కడతా!
ABN , Publish Date - Feb 25 , 2025 | 04:32 AM
‘సొంత ఇల్లు లేనప్పుడు కట్టుకోవడం తప్పా..? బరాబర్ ఇల్లు కట్టుకుంటా.. నువ్వు చస్తే నీకు గోరి కూడా కట్టిస్తాను..!’ అంటూ ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ నగేశ్‌పై కాంగ్రెస్ నేత సోయం బాపురావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ఎంపీ నగేశ్‌పై సోయం బాపురావు తీవ్ర వ్యాఖ్యలు
తలమడుగు, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ‘సొంత ఇల్లు లేనప్పుడు కట్టుకోవడం తప్పా..? బరాబర్ ఇల్లు కట్టుకుంటా.. నువ్వు చస్తే నీకు గోరి కూడా కట్టిస్తాను..!’ అంటూ ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ నగేశ్‌పై కాంగ్రెస్ నేత సోయం బాపురావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సాయిలింగిలో మాజీ ఎంపీ విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో 10 ఏళ్లు బీజేపీ, రాష్ట్రంలో 10 ఏళ్లు బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ.. ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జిల్లాకు చేసిందేమీ లేదన్నారు.
ఎంపీ నగేశ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాస్‌పోర్టు విషయంలో కోర్టు నిర్దోషిగా తీర్పు ఇచ్చినప్పటికీ.. దానిపై మాట్లాడడం సమంజసం కాదన్నారు. మరోసారి ఆ విషయం ఎత్తితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంపీ నిధులతో ఇల్లు కట్టారని ఆరోపించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిధులకు ఎంపీ రికార్డులు ఉంటాయని నగేశ్‌కు తెలియదా.. అని నిలదీశారు.