Gattu Vamanrao: కేసు సీబీఐకి వెళ్లకుండా పుట్టా మధు ప్రయత్నాలు
ABN , Publish Date - Mar 05 , 2025 | 03:40 AM
ఈ కేసు కేంద్ర దర్యాస్తు సంస్థ- సీబీఐ పరిధిలోకి వెళ్లకుండా అనుమానితుడు పుట్టా మధుకర్ ప్రయత్నిస్తున్నారని సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి ఆరోపించారు.

వామనరావు దంపతుల హత్య కేసులో న్యాయవాది వాదనలు
విచారణ వాయిదా వేసిన సుప్రీం
న్యూఢిల్లీ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాదులు గట్టు వామనరావు, నాగమణి దంపతుల హత్య కేసు మంగళవారం మరోసారి సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసు కేంద్ర దర్యాస్తు సంస్థ- సీబీఐ పరిధిలోకి వెళ్లకుండా అనుమానితుడు పుట్టా మధుకర్ ప్రయత్నిస్తున్నారని సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో 2021 ఫిబ్రవరి 17న జరిగిన గట్టు వామనరావు దంపతుల హత్య కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని కోరుతూ ఆయన తండ్రి గట్టు కిషన్ రావు అదే ఏడాది సెప్టెంబర్ 18న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత విచారణ సందర్భంగా.. కేసు విచారణను సీబీఐకి అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశిస్తే విచారణకు తాము సిద్ధమేనని సీబీఐ సైతం స్పష్టం చేసింది. ఈ క్రమంలో తన వాదనలు సైతం వినాలని పుట్టా మధుకర్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. రెండు వారాల సమయమిచ్చింది. ఆ పిటిషన్ మంగళవారం ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. మధుకర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆర్టీఐ ద్వారా సమాచారం కోరామని, అందువల్ల కౌంటర్ దాఖలుకు మరో రెండువారాల సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కిషన్ రావు తరఫున సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి అభ్యంతరం తెలిపారు. కేసు విచారణ సీబీఐ దర్యాప్తునకు వెళ్లకుండా అడ్డుకునే యత్నం చేస్తున్నారని అన్నారు. గత విచారణ సందర్భంగానే కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరారని, మళ్లీ ఇప్పుడు గడువు అడుగుతున్నారని చెప్పారు. వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం కేసు విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి
PM Modi: సింహం పిల్లలకు మోదీ ఫీడింగ్.. వీడియో వైరల్
Aurangazeb Row: ఔరంగజేబు వ్యాఖ్యల వివాదంపై అబూ అజ్మి క్షమాపణ
Bihar: అసెంబ్లీ ఎన్నికల వేళ.. మళ్లీ ఆయనకే బీజేపీ అధ్యక్ష పగ్గాలు
Bird flu: బర్డ్‌ఫ్లూపై కలెక్టర్ ఏమన్నారంటే..
Akhilesh Yadav: మనుషులా? మరబొమ్మలా?.. వారానికి 90 గంటల పనిపై అఖిలేష్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.