Seethakka: వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడండి
ABN , Publish Date - Jan 30 , 2025 | 04:02 AM
వేసవి నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చూడాలని, అందుకోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు.

మిషన్ భగీరథ నీళ్లపై నమ్మకం కలిగించండి: సీతక్క
హైదరాబాద్, జనవరి 29(ఆంధ్రజ్యోతి): వేసవి నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చూడాలని, అందుకోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. బుధవారం సచివాలయంలో సంబంధిత అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలకు మిషన్ భగీరథ నీళ్లపై నమ్మకం కలిగించాలని, అందరికీ అవగాహన కల్పించేందుకు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని చెప్పారు. తాగునీటి కారణంగా ఎవరు అనారోగ్యం పాలవ్వకూడదని, నీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సర్వీస్ నుంచి తొలగిస్తామని మంత్రి హెచ్చరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ గ్రామీణతాగునీటి సరఫరా ఇంజనీర్స్ అసోసియేషన్ డైరీని ఆమె ఆవిష్కరించారు. మరోవైపు హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం దళితబంధు, 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు రైతు బంధు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు ఇంటికి పది వేలు.. ఇలా ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునే చరిత్ర బీఆర్‌ఎ్‌సదేనని మంత్రి సీతక్క ఆరోపించారు. ఆత్మగౌరవ ఇండ్ల నిర్మాణ వ్యయాన్ని రూ.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు తగ్గించి, ఇంట్లో కూర్చుని లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసినందునే ప్రజలు మి మ్మ ల్ని ఇంట్లో కూర్చోబెట్టారని గుర్తుంచుకోవాలన్నారు. ఉచిత ఎరువులు, పంట బోనస్ హమీలను విస్మరించింది ఎవరని కేటీఆర్‌ను ఆమె ప్రశ్నించారు.