Share News

Pregnant Woman Swati Case: దొరకని తల.. కనిపించని కాళ్లు చేతులు

ABN , Publish Date - Aug 26 , 2025 | 04:12 AM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 5 నెలల గర్భిణి స్వాతి హత్య కేసులో మేడిపల్లి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నెల 23న స్వాతిని హత్య చేసిన ఆమె భర్త మహేందర్‌రెడ్డి..

Pregnant Woman Swati Case: దొరకని తల.. కనిపించని కాళ్లు చేతులు

  • 5 నెలల గర్భిణి స్వాతి శరీరభాగాల కోసం

  • విస్తృతంగా గాలిస్తున్న డీఆర్‌ఎఫ్‌ బృందాలు

  • రెండు రోజులుగా తగ్గని వరద నీటి ప్రవాహం

  • జైల్లో మౌనంగా ఉన్న ఆమె భర్త మహేందర్‌

  • అంత్యక్రియలపై కామారెడ్డిగూడలో ఉద్రిక్తత

హైదరాబాద్‌ సిటీ, వికారాబాద్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 5 నెలల గర్భిణి స్వాతి హత్య కేసులో మేడిపల్లి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నెల 23న స్వాతిని హత్య చేసిన ఆమె భర్త మహేందర్‌రెడ్డి.. ఆమె శవాన్ని ముక్కలు చేసి తల, కాళ్లు, చేతులను మూసీలో పడేసిన సంగతి తెలిసిందే. అతణ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు.. స్వాతి శరీరభాగాల కోసం మూసీలో వలలు, గేలాలతో విస్తృతంగా గాలిస్తున్నారు. కానీ, వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రెండు రోజులుగా గాలిస్తున్నా ఫలితం లేకపోయింది. వరద ప్రవాహం తగ్గితే ఎక్కడో ఒక చోట శరీరభాగాలను పెట్టిన ప్లాస్టిక్‌ కవర్‌ గానీ, హంతకుడు విసిరేసిన బ్యాగు కానీ దొరుకుతుందని భావిస్తున్నారు. ఒకవేళ మృతురాలి శరీర భాగాలు దొరక్కపోతే ఏం చేయాలి? అనే దానిపై ఉన్నతాధికారులు, న్యాయనిపుణుల సలహా తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మరోవైపు.. ఇంట్లో మిగిలిపోయిన స్వాతి మొండేన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమె మొండేనికి ఆదివారమే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఆ మొండేన్ని తీసుకోవడానికి స్వాతి తల్లిదండ్రులు, అత్తింటివారు నిరాకరించడంతో గాంధీలోనే భద్రపరిచారు. సోమవారం మరోసారి వారితో మాట్లాడగా.. తొలుత ఇద్దరూ తమకు వద్దన్నారు. ఇదే విషయాన్ని లేఖ రూపంలో రాసిస్తే ఆమె మొండేన్ని మునిసిపాలిటీ వారికి అప్పగిస్తామని చెప్పడంతో.. స్వాతి తల్లిదండ్రులు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. భార్యను ఇంత దారుణంగా చంపి శరీరభాగాలను మూసీలో పడేసిన మహేందర్‌ రెడ్డిని మరింత లోతుగా విచారించడానికిగాను అతణ్ని తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసినట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు. కాగా.. చర్లపల్లి జైల్లో రిమాండ్‌లో ఉన్న మహేందర్‌ రెడ్డిని సోమవారం ఉదయం జైలు సూపరింటెండెంట్‌ పిలిచి.. ‘ఏం నేరం?’ చేశావు అని ప్రశ్నించగా.. అతడు మౌనంగా ఉన్నట్లు తెలిసింది. జైలర్‌ మరోసారి గట్టిగా అడగడంతో ‘భార్యను హత్య చేశాను’ అని సమాధానం చెప్పినట్లు సమాచారం.


అంత్యక్రియలపై ఉద్రిక్తత

స్వాతి కుటుంబ సభ్యులు సోమవారం.. వికారాబాద్‌ జిల్లా కామారెడ్డిగూడలో హంతకుడి ఇంటి ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని.. హంతకుడి కుటుంబ సభ్యులే అంత్యక్రియలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఇరువర్గాలకు సంబంధించిన పెద్దలు సుదీర్ఘంగా చర్చించారు. చివరకు అంత్యక్రియలను స్వాతి కుటుంబ సభ్యులే జరుపుకొంటామని తెలపడంతో ఆందోళన సద్దుమణిగింది. కాగా.. హంతకుడి నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని మృతురాలి సోదరి శ్వేత విలపించింది. తన అక్కను చంపినట్లుగానే తమ అమ్మనాన్నను సైతం మహేందర్‌రెడ్డి చంపుతాడని ఆమె ఆందోళనవ్యక్తం చేసింది. మ హేందర్‌ రెడ్డికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్‌ చేసింది.


ఇవి కూడా చదవండి..

ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ

ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం

For More National News

Updated Date - Aug 26 , 2025 | 04:12 AM