Share News

మే 15న సూర్యోదయం నుంచి.. సరస్వతి పుష్కరాలు

ABN , Publish Date - Mar 02 , 2025 | 03:43 AM

జయశంకర్‌-భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో సరస్వతి పుష్కరాలకు ముహుర్తం ఖరారైంది. మే 15న సూర్యోదయం నుంచి పుష్కరాలను ప్రారంభించేందుకు శృంగేరీ పీఠాధిపతి విధుశేఖర భారతి స్వామి ముహుర్తం నిర్ణయించారు.

మే 15న సూర్యోదయం నుంచి.. సరస్వతి పుష్కరాలు

  • ముహూర్తం ఖరారు చేసిన విధుశేఖర భారతి స్వామీ

హైదరాబాద్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): జయశంకర్‌-భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో సరస్వతి పుష్కరాలకు ముహుర్తం ఖరారైంది. మే 15న సూర్యోదయం నుంచి పుష్కరాలను ప్రారంభించేందుకు శృంగేరీ పీఠాధిపతి విధుశేఖర భారతి స్వామి ముహుర్తం నిర్ణయించారు. మే 26 వరకు.. 12 రోజులపాటు పుష్కరాలు కొనసాగుతాయి. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఇటీవల స్వామీజీని కలిసి, పుష్కరాలు ప్రారంభ సమయం గురించి అడిగి తెలుసుకున్నారు. స్వామీజీ నిర్ణయించిన ముహూర్తం వివరాలతో దేవాదాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి ఓ నివేదికను అందజేశారు. 2013లో చివరిసారి సరస్వతి పుష్కరాలు జరిగాయి.


తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇదే మొదటిసారి. పుష్కరాల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.25 కోట్లు మంజూరు చేసింది. తెలంగాణతోపాటు.. మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా ఘాట్లు, ఇతర ఏర్పాట్లు చేస్తోంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సైతం ఇటీవల ఉన్నతాధికారులతో పుష్కరాలపై సమీక్ష నిర్వహించారు. రోడ్లు, పుష్కర ఘాట్ల నిర్మాణం, మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు.

Updated Date - Mar 02 , 2025 | 03:43 AM