Share News

Wedding Season: మాఘమాసమొచ్చె.. పెళ్లికళ తెచ్చె!

ABN , Publish Date - Jan 30 , 2025 | 04:27 AM

పెళ్లి పీటలెక్కి.. మూడు ముళ్లతో ఒక్కటయ్యేందుకు నిశ్చితార్థం జరిగిన జంటలు ఎదురుచూస్తున్న మాఘమాసం వచ్చేసింది. గురువారం నుంచి మార్చి 16వ తేదీ వరకు పెళ్లిళ్లకు, నూతన గృహ ప్రవేశాలకు అన్నీ మంచి ముహూర్తాలే.

Wedding Season: మాఘమాసమొచ్చె.. పెళ్లికళ తెచ్చె!

  • నేటి నుంచి మార్చి 16 దాకా శుభ ముహూర్తాలు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): పెళ్లి పీటలెక్కి.. మూడు ముళ్లతో ఒక్కటయ్యేందుకు నిశ్చితార్థం జరిగిన జంటలు ఎదురుచూస్తున్న మాఘమాసం వచ్చేసింది. గురువారం నుంచి మార్చి 16వ తేదీ వరకు పెళ్లిళ్లకు, నూతన గృహ ప్రవేశాలకు అన్నీ మంచి ముహూర్తాలే. ముఖ్యంగా నిశ్చితార్థం జరిగిన ఇళ్లలో పెళ్లి సందడి నెలకొంది. కల్యాణానికి ముహూర్తాలు నిర్ణయించుకొని ఫంక్షన్‌ హాళ్ల బుకింగ్‌, డెకరేషన్‌, కేటరింగ్‌ తదితర ఏర్పాట్లలో పెద్దలు మునిగిపోయారు. జనవరి 31న గృహప్రవేశాలకు మంచి ముహూర్తం ఉండగా.. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 26 వరకు పెళ్లిళ్లు జరుపుకునేందుకు శుభ ఘడియలున్నట్లు వేద పండితులు చెబుతున్నారు.


ముఖ్యంగా ఫిబ్రవరి 2, 3, 7, 13, 14, 15, 16, 21, 23, 25, మార్చి 2, 6, 7, 12, 14, 15, 16, 22 తేదీలు పెళ్లిళ్లకు ముహూర్తాలని తెలిపారు. ప్రత్యేకించి ఫిబ్రవరి 16, మార్చి 16 తేదీలు మంచి ముహూర్తాలని.. ఈ రెండ్రోజులు ఎక్కువ పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఏడాది జూలై వరకు కొన్ని ముహూర్తాలున్నాయని, నాలుగేళ్ల తర్వాత వరుస నెలల్లో శుభకార్యాలు జరుపుకునే అవకాశం ఈసారే వచ్చిందని వివరించారు. వేడుకల సమయం కావడంతో పురోహితులు, ఫంక్షన్‌ హాళ్లు, డెకరేషన్‌, కేటరింగ్‌, నిర్వాహకులు, పూల వ్యాపారులకు డిమాండ్‌ పెరగనుంది.

Updated Date - Jan 30 , 2025 | 04:27 AM