Medchal surrogacy: సరోగసి ద్వారా పిల్లలను కంటే 4 లక్షలు.. వెలుగులోకి సంచలన విషయాలు
ABN , Publish Date - Aug 17 , 2025 | 10:42 AM
మేడ్చల్ జిల్లాలో అక్రమంగా సరోగసీ దందా నిర్వహిస్తున్న ఒక ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలు లక్ష్మి, ఆమె కుమారుడు నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి.
మేడ్చల్ జిల్లాలో అక్రమంగా సరోగసీ (Surrogacy) దందా నిర్వహిస్తున్న ఒక ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలు లక్ష్మి, ఆమె కుమారుడు నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు (Medchal surrogacy). ఈ కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేటకి చెందిన లక్ష్మిరెడ్డి పై 2024లో ముంబైలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు నమోదైంది. జైలు నుంచి విడుదలైన తర్వాత కొడుకు నరేందర్ రెడ్డితో కలిసి ఆమె హైదరాబాద్ చేరుకుంది.
హైదరాబాద్‌లోని మాదాపూర్, అమీర్‌పేట్, ఆర్టీసీ ఎక్స్ రోడ్ ప్రాంతాల్లో ఉన్న ఫర్టిలిటీ సెంటర్ల నిర్వాహకులతో పరిచయాలు పెంచుకుంది. అండాలు కావాలన్నా, సరోగసి కోసం మహిళలు కావాలన్నా ఏర్పాటు చేస్తామని డీల్ కుదుర్చుకుంది. మూడు సార్లు అండాలు ఇస్తే 30 వేల రూపాయలు, సరోగసి ద్వారా పిల్లలను కనిస్తే 4 లక్షలు ఇస్తానని ఆశ చూపిస్తూ మహిళలను ఆకర్షించింది. తన ఇంటి పైన రూమ్‌లను కేవలం బ్యాచిలర్స్ కి మాత్రమే అద్దెకి ఇస్తోంది. అద్దెకి ఉంటున్న యువకుల నుంచి వీర్యం సేకరించడం మొదలుపెట్టింది. ఇప్పటివరకు 50 మంది మహిళలతో సరోగసి చేయించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు.
కర్ణాటక కి చెందిన మహిళ భర్త ఫిర్యాదుతో లక్ష్మిరెడ్డి భాగోతం బయటపడింది. కర్ణాటకకి చెందిన మహిళకు రెండు కిడ్నీలు పాడైన విషయం లక్ష్మిరెడ్డికి తెలిసింది. ఆ మహిళను కలిసి కిడ్నీ ఆపరేషన్‌కి కావాల్సిన డబ్బులు తాను ఇస్తానని, అయితే ఆరోగ్యం కుదుటపడ్డాక సరోగసి ద్వారా తనకు బిడ్డను కని ఇవ్వాలని బేరం కుదుర్చుకుంది. ఆపరేషన్ తర్వాత ఆరోగ్యం కుదుటపడటంతో సరోగసి కోసం సదరు మహిళను లక్ష్మిరెడ్డి సంప్రదించింది. భర్తకు విషయం తెలియడంతో గొడవ మొదలైంది. అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లక్ష్మిరెడ్డి విషయం వెలుగులోకి వచ్చింది.
ఇవి కూడా చదవండి
మీ జీవితాన్ని మార్చే పంట.. తక్కువ పెట్టుబడితో లక్షల లాభం..
ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..