RMP: మా సమస్యలపై బీఆర్‌ఎస్‌ది మొసలి కన్నీరు
ABN , Publish Date - Feb 11 , 2025 | 05:18 AM
బీఆర్‌ఎస్ హయాంలో అప్పటి ఆరోగ్యమంత్రి హారీశ్ రావు వల్లే ఆర్‌ఎంపీ, పీఎంపీలకు గుర్తింపు దక్కలేదని తెలంగాణ ఆర్‌ఎంపీ, పీఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక ఆరోపించింది.

అధికారంలో ఉన్నప్పుడు విస్మరించి ఇప్పుడు హరీశ్ డ్రామాలు
ఆర్‌ఎంపీ, పీఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక
నల్లకుంట, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ హయాంలో అప్పటి ఆరోగ్యమంత్రి హారీశ్ రావు వల్లే ఆర్‌ఎంపీ, పీఎంపీలకు గుర్తింపు దక్కలేదని తెలంగాణ ఆర్‌ఎంపీ, పీఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక ఆరోపించింది. కార్పొరేట్ ఆసుపత్రులను వదిలి పిచ్చుకపై బ్రహ్మస్త్రంలా ఆర్‌ఎంపీ, పీఎంపీలపై అక్రమంగా దాడులు చేయించడం శోచనీయమని పేర్కొంది. సోమవారం తెలంగాణ ఆర్‌ఎంపీ, పీఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక నేతలు పులగం మోహన్, బాలకృష్ణారెడ్డి, రమేశ్ ముదిరాజ్ మాట్లాడారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ తమ సమస్యలను విస్మరించి నేడు ప్రతిపక్షంలోకి రాగానే మొసలి కన్నీరు కార్చడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నించారు.
హరీశ్‌రావు తన అనుచర వర్గంతో ధర్నాల పేరిట కొత్త నాటకాలకు తెరలేపారని, ఆర్‌ఎంపీలు, పీఎంపీలు ఆయన మాయలో పడొద్దని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం పట్ల కట్టుబడి ఉందని, ఆ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసిందని తెలిపారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ తమ పట్ల సానుకూలంగా ఉన్నా... మెడికల్ కౌన్సిల్ మాత్రం తమ అసుపత్రులపై అక్రమంగా దాడులకు పాల్పడుతూ తమను రోడ్డు పాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 18న ఇందిరాపార్కు వద్ద నిర్వహించనున్న సభలో 36 వేల మంది ఆర్‌ఎంపీలు పాల్గొని విజయవంతం చేయాలని ఆర్‌ఎంపీ, పీఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక నేతలు కోరారు.