KTR: కాంగ్రెస్‌ను ఓడిస్తే 500 రోజుల్లో మళ్లీ సీఎంగా కేసీఆర్: కేటీఆర్
ABN , Publish Date - Nov 01 , 2025 | 10:39 PM
జూబ్లీహిల్స్ ఒక్క సీటు కోసం ముఖ్యమంత్రి, 14 మంది మంత్రులు గల్లీ గల్లీ తిరుగుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ఒక్క మంచిపనైనా చేసిందా? అని ప్రశ్నించారు. గత పదేళ్లలో తాము కూడా ఎన్నో ఎన్నికల్లో పాల్గొన్నామని చెప్పారు.
హైదరాబాద్, నవంబర్ 1: రేవంత్ రెడ్డి పదవి తాత్కాలికమేనని.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా రాకుండా ఓడిస్తే 500 రోజుల్లో మళ్లీ కేసీఆర్ సీఎంగా వస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా నిర్వహించిన రెహమత్‌నగర్ రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు. గత ఎన్నికల్లో గోపినాథ్‌కు ఈ డివిజన్ నుంచే 6 వేల మెజార్టీ వచ్చిందని ఈ డివిజన్ నుంచి ఈసారి 12 వేల మెజార్టీ వస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు. హైదరాబాద్‌లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదన ధీమా వ్యక్తం చేశారు. ఈ డివిజన్‌లో కోట్ల విలువైన భూమిని గోపినాథ్ కాపాడారని గుర్తుచేశారు. గోపినాథ్ ఇక్కడ నీటి సమస్యను తీర్చారని చెప్పారు. సునీతమ్మ ఆమె భర్త గోపినాథ్‌ను గుర్తు చేసుకొని ఏడిస్తే.. దాన్ని కూడా డ్రామా అని మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏడుపును కూడా రాజకీయం చేసిన అరాచక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఒక్క సీటు కోసం ముఖ్యమంత్రి, 14 మంది మంత్రులు గల్లీ గల్లీ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ఒక్క మంచిపనైనా చేసిందా? అని ప్రశ్నించారు. గత పదేళ్లలో తాము కూడా ఎన్నో ఎన్నికల్లో పాల్గొన్నామని చెప్పారు. కానీ.. ఒక్కసారైనా మాకు ఓటేయకపోతే పథకాలు బంద్ చేస్తామని బెదిరించామా? అని అడిగారు. కానీ రేవంత్ రెడ్డి ప్రజలను బెదిరిస్తున్నారని అన్నారు. ఈ చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డికి బుద్ధి చెబుతారని ఆశించారు. ఎంతోమంది నియంతలకు బుద్ది చెప్పిన చరిత్ర తెలంగాణ గడ్డకు ఉందని గుర్తు చేశారు. ఏ ఒక్క పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతామని రేవంత్ రెడ్డికి కూడ అర్థమైందన్నారు. ఈ నెల 11న కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి:
CM Revanth Reddy: తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలి: సీఎం రేవంత్ రెడ్డి
Talasani Srinivas Yadav: రేవంత్ రెడ్డి అలవాట్లు అందరికి ఉండవు: తలసాని ఫైర్