Share News

CM Revanth Reddy Questions Metro Delay: ఫిరాయింపు ఎక్కడిది

ABN , Publish Date - Sep 20 , 2025 | 05:33 AM

ముఖ్యమంత్రిగా తన వద్దకు పార్టీలకతీతంగా ఎంతో మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం వస్తుంటారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వారికి మర్యాదపూర్వకంగా కండువాలు కప్పుతామని, అందులో తప్పేముందని..

CM Revanth Reddy Questions Metro Delay: ఫిరాయింపు ఎక్కడిది

  • వారి జీతంలో నెలకు 5 వేలు ఇప్పటికీ బీఆర్‌ఎ్‌సకు ఫండ్‌గా వెళ్తోంది

  • బీఆర్‌ఎ్‌సకు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని హరీశ్‌రావే అసెంబ్లీలో స్వయంగా ప్రకటించారు

  • ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చి కలుస్తుంటారు

  • మర్యాదపూర్వకంగా కండువాలు కప్పుతాం

  • మెట్రో రెండో దశకు ఎల్‌ అండ్‌ టీ సహకరించాల్సిందే

  • సీబీఐకేసులో కేసీఆర్‌ను రక్షించేందుకు కిషన్‌రెడ్డి యత్నం

  • నక్సలైట్లు మన అన్నదమ్ములే కదా! ఎందుకు చర్చించరు?

  • 2018లోనే రాష్ట్రంలో ఓటు చోరీ.. రజత్‌ అంగీకారం

  • జీఎస్టీ సంస్కరణలతో తెలంగాణకు 7 వేల కోట్ల నష్టం

  • ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రిగా తన వద్దకు పార్టీలకతీతంగా ఎంతో మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం వస్తుంటారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వారికి మర్యాదపూర్వకంగా కండువాలు కప్పుతామని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. బీఆర్‌ఎ్‌సకు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ ఆ పార్టీ నేత హరీశ్‌ గత అసెంబ్లీ సమావేశాల్లోనే అధికారికంగా చెప్పారని పేర్కొన్నారు. అలాంటప్పుడు ఇంకా ఫిరాయింపు ఎక్కడిదని ప్రశ్నించారు. అయినా.. పార్టీ ఫిరాయించారని ఆరోపిస్తున్న ఎమ్మెల్యేల నెల జీతం నుంచి నేటికీ బీఆర్‌ఎ్‌సకు నెలకు రూ.5 వేల చొప్పున పార్టీ ఫండ్‌ వెళుతోందని చెప్పారు. ఇక వారు పార్టీ ఫిరాయించినట్టు ఎలా అవుతుందన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం స్పీకర్‌ వ్యవహరిస్తారని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సీఎం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాలకు సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయానికి అనుగుణంగానే తాము స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ‘‘బీసీలకు 42ు రిజర్వేషన్లకు సంబంధించి మూడు బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రపతి నిర్ణయం తీసుకునే గడువు అంశం సుప్రీంకోర్టులో ఉంది. దీనిపై సుప్రీంకోర్టు ఏం చెబుతుందో చూస్తాం. ఆ తర్వాత న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మళ్లీ కోర్టుకు వెళ్లాలా? వద్దా? అనేది అప్పుడే నిర్ణయిస్తాం. అవసరమనుకుంటే హైకోర్టులోనే మరికొంత సమయం కోరతాం’’ అని సీఎం వివరించారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని కేసీఆర్‌ విధించారని, ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీల గురించి బీఆర్‌ఎస్‌ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.


మెట్రో పూర్తికావడం కిషన్‌రెడ్డికి ఇష్టంలేదు..

మెట్రో రెండోదశ పూర్తికావడం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి, కేటీఆర్‌కు ఇష్టంలేదని, వాళ్ల స్వార్థ ప్రయోజనాల కోసం దానిని ముందుకు కదలనివ్వడం లేదని సీఎం రేవంత్‌ ఆరోపించారు. మెట్రో బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ఎల్‌అండ్‌టీ చెప్పలేదన్నారు. మొదటి దశలో నష్టం వచ్చిందని ఆ సంస్థ చెబుతోందని, కేసీఆర్‌, ఎల్‌అండ్‌టీ చేసిన తప్పులకు ప్రజలు నష్టపోవాలా? అని ప్రశ్నించారు. 2017లోనే మెట్రో రెండోదశ పూర్తికావాల్సి ఉందని, కానీ.. కేసీఆర్‌ నిర్లక్ష్యంతో అది నేటికీ ముందుకు సాగడం లేదని అన్నారు. మెట్రో రెండోదశ పనుల కోసం ప్రధాని మోదీని కలిసిన ప్రతిసారీ అడుగుతున్నామని, అయినా ఫలితం లేదని చెప్పారు. రెండోదశకు సహకరించాల్సిన బాధ్యత ఎల్‌అండ్‌టీపై ఉందని, అలా కాకుండా వారు చెప్పినట్టే తాము వినాలన్నట్లుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మెట్రో విస్తరణకు అనుమతి కావాలంటే.. ఎల్‌అండ్‌టీతో ఒప్పందం చేసుకుని రావాలని కేంద్రం చెబుతోందని, ఇదంతా.. కేటీఆర్‌, కిషన్‌రెడ్డి ఆడుతున్న డ్రామా అని మండిపడ్డారు. మెట్రోలో రోజుకు సగటున 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, విస్తరణ పూర్తయితే రోజుకు 15 లక్షల మంది ప్రయాణిస్తారని తెలిపారు.

కేసీఆర్‌ను రక్షించేందుకు కిషన్‌రెడ్డి ప్రయత్నం..

కేసీఆర్‌ కుటుంబానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అండగా నిలుస్తున్నారని సీఎం రేవంత్‌ ఆరోపించారు. ‘‘కాళేశ్వరం దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేసినందుకే అప్పగించాం. సీబీఐకి ఇేస్త 48 గంటల్లో విచారణ చేయిస్తామని, అవినీతి లెక్కలేంటో తేలుస్తామని ఆయన మాట్లాడారు. మరి ఇప్పుడు ఏమైందో చెప్పాలి. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తే అన్ని వివరాలు ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’’ అని రేవంత్‌ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగిందనే విషయం మాత్రమే కమిషన్‌ చెబుతుందని, చర్యలు తీసుకునేది దర్యాప్తు సంస్థలేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేస్తే నిజాలన్నీ బయటికి వస్తాయన్నారు. కాళేశ్వరం దర్యాప్తును కేటీఆర్‌ అడ్డుకుంటున్నారని, కేటీఆర్‌ చెప్పినందుకే కిషన్‌రెడ్డి కేంద్రంలో విచారణను తొక్కిపట్టారని ఆరోపించారు. కిషన్‌రెడ్డికి సొంత తెలివి లేదని, కేటీఆర్‌ను అద్దెకు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ ఆలోచనల్నే కిషన్‌రెడ్డి అమలు చేస్తారు తప్ప.. ఆయనకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేదే కిషన్‌రెడ్డి అని, రాష్ర్టానికి ఏ ప్రాజెక్టు రావడమూ ఆయనకు ఇష్టం లేదని అన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు హైకోర్టులో ఉందని, దానిపై మాట్లాడడం సరికాదని పేర్కొన్నారు. ఒకవేళ హైకోర్టు పరిధిలో లేకపోతే.. సీబీఐకి అప్పగించే అంశంపై ఆలోచించేవాళ్లమని చెప్పారు.


యూరియా ఇవ్వకుండా కేంద్రం కుట్రలు..

తెలంగాణకు సకాలంలో యూరియా ఇవ్వకుండా కేంద్రం కుట్రలు చేస్తోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆ కుట్రలకు రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌, బీజేపీ తోడై.. రైతుల్లో గందరగోళం సృష్టించాయన్నారు. కేంద్రం నుంచి యూరియా రావడం ఆలస్యమైతే.. యూరియా కొరత ఉందని, ఇక రాదని అనేక అసత్య ప్రచారాలు చేశారని మండిపడ్డారు. యూరియా ఎక్కడా దొరకదేమోననే ఆందోళనతో కొందరు ఎక్కువగా కొనేశారని, మరికొందరు సరిపడా ఉన్నా లైన్లలో నిలబడుతున్నారని తెలిపారు. దీనంతటికీ బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలే కారణమని, ఆ రెండు పార్టీల వలలో రైతులు చిక్కుకున్నారని అన్నారు. దేశంలో నరమేధం సృష్టించిన, ఎన్నో హింసాత్మక ఘటనలకు పాల్పడిన పాకిస్థాన్‌ సహా ఇతర ఉగ్రవాద సంస్థలతో చర్చలు జరిపినప్పుడు.. మనలో ఒకరైన నక్సలైట్లతో ఎందుకు చర్చలు జరపరని రేవంత్‌ ప్రశ్నించారు. నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పాలసీలు తీసుకొచ్చాయని గుర్తు చేశారు. నక్సలైట్ల విషయంలో కేంద్ర నిర్దయగా వ్యవహరించడం సరికాదని, వారూ మన అన్నదమ్ములేననే విషయాన్ని గ్రహించి శాంతిచర్చలు జరపాలని కోరారు. ఇందుకు కేంద్రం ఒకడుగు ముందుకు వేసి చర్చలకు ఆహ్వానించాలన్నారు. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణల ప్రభావం అన్ని రాష్ర్టాల ఆదాయంపైనా పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వీటితో తెలంగాణకు ఏడాదికి రూ.7 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందన్నారు. ఈ మేరకు ఐదేళ్లపాటు అన్ని రాష్ర్టాలకు కేంద్రం నష్ట పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో డ్రగ్స్‌ పాపం బీఆర్‌ఎ్‌సదే..

తెలంగాణలో డ్రగ్స్‌ పాపం ముమ్మాటికీ బీఆర్‌ఎ్‌సదేనని సీఎం రేవంత్‌ ఆరోపించారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ యథేచ్ఛగా గేట్లు తెరవడం వల్లే ఇప్పుడీ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో పట్టుబడ్డ భారీ డ్రగ్స్‌ తయారీ కేంద్రం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో ఏర్పడిందేనని తెలిపారు. మహారాష్ట్ర పోలీసులు వచ్చేవరకు తెలంగాణ పోలీసులు గుర్తించలేకపోయారనే ప్రచారాన్ని సీఎం కొట్టిపారేశారు. తెలంగాణలో పోలీసులు ముంబై, గోవాలో దాడులు చేసి భారీగా డ్రగ్స్‌ దందాను గుట్టు చేశారని గుర్తు చేశారు. అయినా, ఒక రాష్ట్రంలోని పోలీసుల సహకారం లేకుండా మరో రాష్ర్టానికి చెందిన పోలీసులు ఏమీ చేయలేరని అన్నారు. స్వయంగా కేటీఆర్‌ బావమరిది ఫాంహౌ్‌సలో డ్రగ్స్‌ దొరికాయని, కోర్టుకు వెళ్లి బెయిల్‌ తెచ్చుకున్నారని తెలిపారు. అలాంటి వాళ్లు డ్రగ్స్‌ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు 20 నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, ఈగల్‌ టీం పనితీరును దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాలు మెచ్చుకున్నాయని అన్నారు. డ్రగ్స్‌ మహమ్మారిని మూకుమ్మడిగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, కానీ ఆ విషయంలోనూ రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు.


కవిత వ్యవహారమంతా కుటుంబం, ఆస్తి పంపకాల వివాదమే..

కేసీఆర్‌ కూతురు కవిత వ్యవహారమంతా వారి కుటుంబం, ఆస్తి పంపకాల వివాదమేనని రేవంత్‌రెడ్డి అన్నారు. కవితను కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌, సంతోష్‌ కావాలనే బయటికి వెళ్లగొట్టారని తెలిపారు. కుల పెద్దో, కుటుంబ పెద్దో కూర్చుని మాట్లాడితే నెలకో, రెండు నెలలకో అంతా సద్దుమణుగుతుందని, మళ్లీ అందరూ కలిేస ఉంటారని చెప్పారు. ఏదేమైనా.. ఒక ఆడబిడ్డపై నలుగురు మగాళ్లు దాడి చేస్తున్నారని అన్నారు. వారి కుటుంబ పంచాయితీతో తనకు గానీ, తెలంగాణ ప్రజలకు గానీ ఎటువంటి సంబంధం లేదన్నారు. తానెప్పుడూ కవితకు మద్దతుగా నిలవలేదని, తనకు ఆ అవసరం లేదని స్పష్టం చేశారు. తమ కుమార్తె వివాహ సమయంలో తనను అరెస్టు చేయడం చిన్న విషయమేనని, కానీ.. ఉద్యమం పేరుతో కేసీఆర్‌ వందల మంది అమాయక పిల్లలను బలితీసుకున్నారని ఆరోపించారు. ఆ పాపం ఊరికే పోదు కదా! వ్యాఖ్యానించారు. అందుకే ఆ ఉసురు తగిలిందన్నారు. బీఆర్‌ఎ్‌సను బీజేపీలో విలీనం చేయాలని కేటీఆర్‌, సంతోష్‌ ప్రయత్నించారంటూ కవితే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్‌ మొదటి ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని, కానీ.. కాంగ్రెస్‌ పార్టీ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను పకడ్బందీగా అమలు చేస్తుందని తెలిపారు.

2018లోనే తెలంగాణలో ఓట్‌ చోరీ..

బిహార్‌లోనే కాకుండా.. తెలంగాణలోనూ ఓటు చోరీ జరిగిందని సీఎం రేవంత్‌ తెలిపారు. 2018 ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందని, అప్పుడు ఎన్నికల కమిషనర్‌గా ఉన్న రజత్‌కుమార్‌ రెండుసార్లు ఈ విషయాన్ని అంగీకరించారని పేర్కొన్నారు. 2018 ఎన్నికల్లో తెలంగాణలో 24 లక్షల ఓట్లు తొలగించారని, ఒక్క కొడంగల్‌ నియోజకవర్గంలోనే 50 వేల ఓట్లను తొలగించారని వివరించారు. బిహార్‌లో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత ప్రచారానికి వెళ్తానన్నారు. ప్రశాంత్‌ కిశోర్‌ దక్షిణాది రాష్ర్టాల్లో పనిచేయగా లేనిది తాము ఉత్తరాది రాష్ర్టాలకు వెళ్లకూడదా? అని ప్రశ్నించారు.


మంత్రివర్గంలో మైనారిటీకి చాన్స్‌

ఇండియా కూటమిలో మజ్లిస్‌ కలిసే అంశంపై రాహుల్‌గాంధీ నిర్ణయం తీసుకుంటారని రేవంత్‌రెడ్డి తెలిపారు. మంత్రివర్గంలో మైనారిటీకి చోటు కల్పించాల్సి వస్తే కల్పిస్తామని, అయితే.. ఎవరికి అవకాశం వస్తుందో ఇప్పుడే చెప్పడం సాధ్యంకాదని అన్నారు. మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీగా నియమించే అవకాశాలూ ఉన్నాయన్నారు. ఇక జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అంశం గురించి ప్రస్తావించగా.. కాంగ్రెస్‌ పార్టీలో ేస్వచ్ఛ ఎక్కువ అని వ్యాఖ్యానించారు.

తుమ్మిడిహట్టిపై అన్యాయం చేసిన కేసీఆర్‌..

తుమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలో మాజీ సీఎం కేసీఆర్‌ తీరని అన్యాయం చేశారని రేవంత్‌ అన్నారు. అసలు.. తెలంగాణలో నికర, మిగులు, వరద జలాలు ఎన్నో నేటికీ స్పష్టత లేదన్నారు. కేసీఆర్‌ ఇష్టానుసారంగా ఒక ప్రాజెక్టుకు సంబంధించిన నీటిని మరోచోట చూపించారని, అస్పష్టత వల్ల నీటి వాటాలెంత? అనేది అర్థంకావడం లేదని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న నీటి పంపకాల వివాద పరిష్కారం కోసం ఇటీవల ఇద్దరు సీఎంలు భేటీ అయి.. అధికారులతో కమిటీ వేయాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక ఢిల్లీలో తెలంగాణ భవన్‌ నిర్మాణం పీపీపీ పద్ధతిలో సాధ్యం కాదని, నిబంధనలు అందుకు అంగీకరించడం లేదని రేవంత్‌ అన్నారు. అందుకే ప్రభుత్వమే ఈ భవనాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు.

చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు కేటీఆర్‌ ఏమయ్యారు?

ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ఎవరిని కలిసినా తనకు అభ్యంతరం లేదని రేవంత్‌రెడ్డి అన్నారు. తాను ముఖ్యమంత్రిగా చంద్రబాబును కలిశానని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. పట్టపగలు జరిగిన అధికారిక కార్యక్రమంపైనే కేటీఆర్‌ రాద్ధాంతం చేశారని, మరి చంద్రబాబు కొడుకును రాత్రిపూట కేటీఆర్‌ ఎందుకు కలిశారని తాను ప్రశ్నించానని చెప్పారు. ‘‘లోకేశ్‌ తనకు తమ్ముడిలాంటి వాడని కేటీఆర్‌ అంటున్నారు. కేటీఆర్‌ తనకు అన్నలాంటి వాడని లోకేశ్‌ చెబుతున్నారు. మరి.. తమ్ముడిలాంటి వాడైతే కష్టకాలంలో అన్నలా ఎందుకు అండగా నిలవలేదు? చంద్రబాబును జైలులో పెట్టినప్పుడు హైదరాబాద్‌లో రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన ఆ జనాన్ని కేటీఆర్‌ ఎందుకు కొట్టించారు?’’ అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

Updated Date - Sep 20 , 2025 | 05:33 AM