Share News

Revanth Reddy: మహిళా సమాఖ్యలకు బస్సులు

ABN , Publish Date - Mar 05 , 2025 | 03:38 AM

మహిళా స్వయం సహాయక సంఘాలకు.. స్వయం ఉపాధి కల్పనలో భాగంగా ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించాలని నిర్ణయించింది. మహిళలతోనే బస్సులు కొనుగోలు చేయించి.. వారి ఆధ్వర్యంలోనే ఆర్టీసీలో అద్దె నడపనుంది.

 Revanth Reddy: మహిళా సమాఖ్యలకు బస్సులు

ప్రతి మండల సమాఖ్యకు ఒక బస్సు కేటాయింపు

ఆపై అద్దెకు ఆర్టీసీకి.. బస్సుపై నెలకు రూ.77,220 రాబడి

కొనుగోలుకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వనున్న ప్రభుత్వం

ఈ నెల 8న తొలి విడతగా 150 బస్సుల ప్రారంభం

హైదరాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మహిళలకు ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. తాజాగా వారికి మరో శుభవార్త చెప్పింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు.. స్వయం ఉపాధి కల్పనలో భాగంగా ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించాలని నిర్ణయించింది. మహిళలతోనే బస్సులు కొనుగోలు చేయించి.. వారి ఆధ్వర్యంలోనే ఆర్టీసీలో అద్దె నడపనుంది. బస్సుల కొనుగోలు కోసం మహిళా సమాఖ్యలకు ప్రభుత్వమే బ్యాంకు గ్యారంటీ ఇస్తుంది. ఈ మేరకు మార్గదర్శకాలను వివరిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి మండల మహిళా సమాఖ్యకు ఒక బస్సు చొప్పున కేటాయించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొలి విడత గా 150 మండల సమాఖ్యలకు బస్సులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో బస్సు విలువ రూ.38 లక్షలు అని, బస్సుకు ప్రతి నెలా అద్దె కింద ఆర్టీసీ రూ.77,220 చెల్లిస్తుందని పేర్కొన్నారు. దీంతో దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులను నడపనున్నాయి. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్‌ తదితరులు ఈ అద్దె బస్సులను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మిగిలిన మండల సమాఖ్యలకు 450 ఆర్టీసీ అద్దె బస్సులను ప్రభుత్వం కేటాయించనుంది.


మహిళలకు మంచిరోజులు: మంత్రి సీతక్క

కాంగ్రెస్‌ ప్రజాపాలనలో మహిళలకు మంచిరోజులు వచ్చాయని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అనుసూయ సీతక్క అన్నారు. ఇప్పటివరకు దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసి అద్దెబస్సులను నడపనున్నట్లు చెప్పారు. దీంతోపాటు మరిన్ని వ్యాపారాల్లో మహిళలను ప్రోత్సహించేలా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణను ఈ నెల 8న పరేడ్‌ గ్రౌండ్‌లో ఇందిరా మహిళా శక్తి-2025 కార్యక్రమం ద్వారా ప్రకటిస్తామని తెలిపారు.


ఇవి కూడా చదవండి

PM Modi: సింహం పిల్లలకు మోదీ ఫీడింగ్.. వీడియో వైరల్

Aurangazeb Row: ఔరంగజేబు వ్యాఖ్యల వివాదంపై అబూ అజ్మి క్షమాపణ

Bihar: అసెంబ్లీ ఎన్నికల వేళ.. మళ్లీ ఆయనకే బీజేపీ అధ్యక్ష పగ్గాలు

Bird flu: బర్డ్‌ఫ్లూపై కలెక్టర్ ఏమన్నారంటే..

Akhilesh Yadav: మనుషులా? మరబొమ్మలా?.. వారానికి 90 గంటల పనిపై అఖిలేష్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 05 , 2025 | 03:38 AM