CM Revanth Reddy criticized BRS: కేసీఆర్ ఓట్లడగలేదేం
ABN , Publish Date - Nov 10 , 2025 | 03:43 AM
బీఆర్‌ఎస్ కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ పార్టీ వ్యాలిడిటీ పీరియడ్ అయిపోయిందన్నారు. ఇదేమీ తాను రాజకీయ విమర్శ కోసం చెబుతున్నది కాదని, ఒకప్పుడు తెలంగాణలో బలంగా ఉన్న టీడీపీ ఇప్పుడు ఇక్కడ లేకుండా పోయిందని గుర్తు చేశారు.....
జూబ్లీహిల్స్ ఓటర్లకు ఎందుకు విజ్ఞప్తి చేయలేదు?
దీన్ని బట్టి కేటీఆర్, హరీశ్‌పై ఆయన ఆలోచనను అర్థం చేసుకోవచ్చు
ధృతరాష్ట్రుడిలా దుర్మార్గాల్ని భరిస్తున్నరు
పార్టీ కూలుతుంటే కుమిలిపోతున్నరు
బీఆర్‌ఎస్ వ్యాలిడిటీ అయిపోయింది
ఈసారి ఎన్నికలు 2029 జూన్‌లో..
2034 వరకూ కాంగ్రెస్సే అధికారంలో..
రానున్న పదేళ్లలో వందేళ్ల అభివృద్ధి చేసి చూపిస్తాం
కేసీఆర్ పెట్టిన ఏ పథకాన్నీ ఆపలే
గుజరాత్‌కు గులాముగా కిషన్‌రెడ్డి
కేటీఆర్‌తో చెడు సావాసాన్ని ఆపాలి
సెంటిమెంటా? డెవల్‌పమెంటా? జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించుకోవాలి
కాలేజీలు నిబంధనల ప్రకారం పోదామంటే మేం సిద్ధం
‘మీట్ ద ప్రెస్’లో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ పార్టీ వ్యాలిడిటీ పీరియడ్ అయిపోయిందన్నారు. ఇదేమీ తాను రాజకీయ విమర్శ కోసం చెబుతున్నది కాదని, ఒకప్పుడు తెలంగాణలో బలంగా ఉన్న టీడీపీ ఇప్పుడు ఇక్కడ లేకుండా పోయిందని గుర్తు చేశారు. కేసీఆర్‌తోనే ఆ పార్టీ పని అయిపోతుందన్నారు. కేసీఆర్‌కు గతమే తప్ప.. భవిష్యత్తు లేదని, ఆ బాధతోనే ఆయన బయటికి రావడంలేదని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థికి ఓటేయాలని నియోజకవర్గ ప్రజలకు ఈనాటి వరకూ కేసీఆర్ విజ్ఞప్తి చేయకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ‘‘బయటికి వచ్చి ప్రచారం చేయడానికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. కానీ, పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కూడా విజ్ఞప్తి చేయడంలేదంటే కేటీఆర్, హరీశ్‌రావుపై ఆయనకున్న ఆలోచనేంటో అర్థం చేసుకోవచ్చు’’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన కళ్లముందు పార్టీ కూలిపోతుంటే కుమిలిపోతున్నారని, దుఃఖం, ఆవేదనతో కాలక్షేపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను ప్రత్యర్థిగా కాకుండా సానుభూతితో చూడాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఆత్మహత్య చేసుకుని మరీ బీజేపీకి అవయవదానం చేసిందని ఆరోపించారు. దాంతో బీజేపీ గెలుచుకున్న 8 సీట్లే మోదీ మూడోసారి ప్రధాని కావడానికి ఉపయోగపడ్డాయన్నారు. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీన ప్రక్రియ మొదలైందంటూ కేసీఆర్ కూతురు కవితే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు.
సీబీఐ కాళ్లకు బంధం వేసిందెవరు?
కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించి మూడు నెలలు గడిచినా ఇంతవరకు విచారణ ప్రారంభం కాలేదని, సీబీఐ కాళ్లకు బంధం వేస్తున్నది ఎవరని ప్రశ్నించారు. అలాగే ఫార్ములా ఈ-రేసు కేసులో కేటీఆర్ అరెస్టుకూ గవర్నర్ నుంచి అనుమతి రాలేదన్నారు. సొంత చెల్లిని, మాగంటి తల్లిని కేటీఆర్ అవమానించారని ఆరోపించారు. మహిళలకు రక్షణ కల్పించలేని కేటీఆర్.. ప్రజల అభిమానం ఎలా చూరగొంటారని ప్రశ్నించారు. కేసీఆర్ ధృతరాష్ట్రుడిలాగా పిల్లల దుర్మార్గాలను భరిస్తున్నారని వ్యాఖ్యానించారు. తనది కార్యకర్త మనస్తత్వమని, హుజూరాబాద్, హుజూర్‌నగర్, సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ కంటే ఎక్కువగా ప్రచారం చేశానని తెలిపారు. 2034 జూన్ వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని, దీనిని రాసిపెట్టుకోవచ్చని ప్రకటించారు. రాబోయేవి జమిలి ఎన్నికలు అని, 2028 డిసెంబరుకు బదులుగా.. 2029 జూన్‌లో జరుగుతాయని అన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించి 2034 జూన్ వరకూ అధికారంలో కొనసాగుతుందని జోస్యం చెప్పారు. ఈ పదేళ్లలో.. వందేళ్ల అభివృద్ధి చేస్తామన్నారు.
చరిత్ర కేసీఆర్ చెరిపేస్తే చెరగదు..
2004 నుంచి 2014 వరకు కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. రైతుల సంక్షేమం కోసం కృషి చేసిందని సీఎం రేవంత్ తెలిపారు. హైదరాబాద్ నగరానికి గోదావరి నీళ్లు రావడానికి సీఎల్పీ నేతగా పీజేఆర్ నడిపిన పోరాటమే కారణమన్నారు. ఐటీ, ఫార్మా, నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్ మారిందంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రత్యేక పాలసీల వల్లనేనని పేర్కొన్నారు. జంటనగరాలకు నిరంతర విద్యుత్తు ఇవ్వాలని విధాన పరమైన నిర్ణయం తీసుకోవడంతో దిగ్గజ ఐటీ సంస్థలు తరలి వచ్చాయన్నారు. దేశానికి సరఫరా అవుతున్న బల్క్ డ్రగ్స్‌లో 40 శాతం హైదరాబాద్‌లో ఉత్పత్తి అవుతున్నవేనని చెప్పారు. పదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ప్రణాళికలు, విధానపరమైన నిర్ణయాల కారణంగా వచ్చిన ప్రపంచ దిగ్గజ సంస్థలు.. హైదరాబాద్‌కు గ్రోత్ ఇంజన్లుగా మారాయన్నారు. తెలంగాణలో 65 శాతం ఆదాయం హైదరాబాద్ నగరం నుంచే వస్తోందని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు తదితర సంక్షేమ కార్యక్రమాలను తీసుకువచ్చి అభివృద్ధి, సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాలెన్స్ చేసిందన్నారు. ఈ చరిత్ర కేసీఆర్ చెరిపేస్తే చెరిగేది కాదన్నారు. ఆనాటి పదేళ్ల కాంగ్రెస్ పాలన, ఆ తర్వాత కేసీఆర్ పదేళ్ల పాలనతో పోల్చి చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
గుజరాత్‌కు గులాం.. కిషన్‌రెడ్డి!
సబర్మతీ, గంగా, యుమునా రివర్ ఫ్రంట్‌లను అద్బుతమంటూ ఓవైపు బీజేపీ ప్రచారం చేసుకుంటుంటే.. మూసీ రివర్ ఫ్రంట్‌ను మాత్రం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. ఇక్కడి పెట్టుబడులు గుజరాత్‌కు తరలి పోవాలన్నదే కిషన్‌రెడ్డి ప్రణాళిక అని, ఆయన గుజరాత్‌కు గులాంగిరీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణకు వచ్చిన సెమీకండక్టర్లు, పెట్టుబడులను ప్రధాని కార్యాలయం నుంచే బెదిరించి గుజరాత్‌కు పట్టుకుపోతే కిషన్‌రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నా రు. ఆయన తనపై ఒంటి కాలిమీద లేస్తే ఏమొస్తుందని, చేతనైతే ప్రధాని మోదీ వద్దకు వెళ్లి నిలదీయాలని అన్నారు. లేదంటే మోదీ కాళ్లు పట్టుకుని కొన్ని ప్రాజెక్టులను తెలంగాణకు వదిలేయాలంటూ కోరాలన్నారు. కేటీఆర్‌తో చెడు సావాసాన్ని కిషన్‌రెడ్డి వదులుకోవాలని సూచించారు. బ్యాడ్ బ్రదర్స్ కేటీఆర్, కిషన్‌రెడ్డి అడ్డుకోని అంశాల్లో కేంద్రం ప్రభుత్వం తన వంతు సహకారం అందిస్తోందని ఒక ప్రశ్నకు సమాధానంగా సీఎం చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి, బీజేపీ డిపాజిట్లు జప్తు కావడం ఖాయమన్నారు. బీఆర్‌ఎ్‌సను వ్యతిరేకించే ఏ ఎంపీనీ కిషన్‌రెడ్డి ప్రచారానికి రానివ్వడంలేదని ఆరోపించారు.
డ్రగ్ కల్చర్ ఎవరిదో ఆలోచించండి
ఎవరిది పబ్ కల్చర్, ఎవరిది డ్రగ్ కల్చర్, గల్లీ గల్లీల్లో గంజాయి, డ్రగ్స్‌కు కారణం ఎవరు అన్నది జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించాలని సీఎం రేవంత్ సూచించారు. వచ్చే పదేళ్లూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని, సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తుందని చెప్పారు. నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తమపై ఉందన్నారు. సెంటిమెంటా? డెవల్‌పమెంటా? అన్నది జూబ్లీహిల్స్ ప్రజలే తేల్చుకోవాలన్నారు. ఆర్కిటెక్చర్ చదువుకున్న యువకుడిని రౌడీ అనడం బీఆర్‌ఎస్ ఆలోచనా ధోరణికి అద్దం పడుతుందని మండిపడ్డారు. ‘‘మా నాన్నను చూపించి నన్ను రౌడీ అంటున్నరు. పాస్‌పోర్టు బ్రోకర్ కొడుకును ఏమనాలి? అని నవీన్ యాదవ్ అందుకే ప్రశ్నించారు’’ అని రేవంత్ అన్నారు.
కేసీఆర్ ప్రారంభించిన ఏ పథకాన్నీ ఆపలేదు..
బీఆర్‌ఎస్ హయాంలో కొత్తగా ఒక్క యూనివర్సిటీ కూడా తేలేదని, కనీసం వీసీలను కూడా నియమించలేదని సీఎం రేవంత్ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 వేలకు పైగా స్కూళ్లను మూసేశారని, రైతులకు వ్యవసాయాన్ని, మహిళలకు రాజ్యాధికారాన్ని దూరం చేశారని ఆరోపించారు. కొత్తగా ఆస్పత్రులనూ నిర్మించలేదన్నారు. కేసీఆర్ హయాంలో నగరంలో చేపట్టిన ఏ ఒక్క ప్రాజెక్టయినా పూర్తయిందా? అని ప్రశ్నించారు. తన రెండేళ్ల ప్రజా ప్రభుత్వంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాకుండా ఆర్టీసీని లాభాల బాట పట్టించామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని, రూ.3 వేల కోట్లతో ఉస్మానియా ఆస్పత్రిని, వందెకరాల్లో హైకోర్టునూ నిర్మిస్తున్నామన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా సన్నబియ్యం ఇస్తున్నామని, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, రూ.21 వేల కోట్ల రుణమాఫీ అమలు చేశామన్నారు. కేసీఆర్ ప్రారంభించిన ఏ ఒక్క పథకాన్నీ ఆపకుండా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ, కులగణన చేసి దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. ఏడాదిన్నరలో రాష్ట్రానికి 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల గోదావరి జలాలు తెచ్చేందుకు ప్రణాళికలు తయారు చేశామని, వచ్చే బడ్జెట్ సమావేశాల్లో బెస్ట్ ఫైనాన్షియల్ పాలసీని తీసుకువస్తామని ప్రకటించారు.
కాలేజీలు రూల్ ప్రకారం పోదామంటే సిద్ధం: సీఎం రేవంత్
కాలేజీల నిర్వహణలో నిక్కచ్ఛిగా రూల్ ప్రకారం పోదామంటే తాను వంద శాతం సిద్ధంగా ఉన్నానని యాజమాన్యాలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. యాజమాన్యాలు రూపాయి కూడా డొనేషన్ తీసుకోవద్దని, మెరిట్ లేకుండా సీట్లు ఇవ్వవద్దని అన్నారు. విజిలెన్స్ డిపార్ట్‌మెంట్, కాలేజీ మేనేజ్‌మెంట్‌లతో నిజనిర్ధారణ కమిటీ వేసి ఒక్కో కాలేజీని పరిశీలించి ప్రక్షాళన చేద్దామన్నారు. ఆయా కాలేజీల్లో నిబంధనల ప్రకారం బోధనా సిబ్బంది, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయా, లేదా అని పరిశీలిద్దామన్నారు. కొన్ని కాలేజీలైతే ఆయా కాలేజీల నుంచి వెళ్లిపోయిన విద్యార్థుల పేరుమీద కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ వసూలు చేయడం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అర్బన్ ఇంజనీరింగ్ కాలేజీ అయితే కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సులకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు డొనేషన్లు వసూలు చేస్తున్నారని, మెడికల్ కాలేజీల్లోనైతే ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఆయా సీట్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ కేవలం రూ.35 వేల చొప్పున మాత్రమేనన్నారు. ‘‘డొనేషన్లు లేని డిగ్రీ కాలేజీలకు మొదట చెల్లించి.. డొనేషన్లు తీసుకుంటున్న ఇంజనీరింగ్ కాలేజీలకు విడతల వారీగా చెల్లిస్తామంటే.. ‘లేదు ఒకేసారి కట్టాలి.. లేకుంటే బంద్ పెడతాం’ అంటున్నారు. కాలేజీలు బంద్ పెట్టినా ఆరు నెలల తర్వాత వారి ఫీజు రీయింబర్స్‌మెంట్ వారికి వస్తుంది. విద్యాసంవత్సరం కోల్పోయిన విద్యార్థికి ఎవరు జవాబుదారీ? విద్యను రాజ్యాంగం సేవగానే గుర్తించింది కానీ.. వ్యాపారంగా కాదు. కాలేజీలు బంద్ పెట్టడం వల్ల సమస్యకు పరిష్కారం దొరకదు. పిల్లల కోణంలో ఈ సమస్యను చూడాలి’’ అని సీఎం రేవంత్ అన్నారు.