బీటెక్.. హైటెక్!
ABN , Publish Date - Feb 22 , 2025 | 04:11 AM
ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకే పరిమితమైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులు.. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ విద్యార్థులు కూడా చేయొచ్చు..
‘కోర్’ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏఐ,
డేటా సైన్స్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీ కోర్సులు
20 క్రెడిట్స్‌తో కొత్తగా మైనర్ డిగ్రీ, ఆనర్స్ డిగ్రీ
నాలుగేళ్ల 160 క్రెడిట్స్.. 3 ఏళ్లలోనే పూర్తి
7, 8 సెమిస్టర్లంతా ఫుల్‌టైం ఇంటర్న్‌షి్‌పకు చాన్స్
ఇకపై 2 ఇంటర్న్‌షిప్స్, 4 పారిశ్రామిక సందర్శనలు
‘ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీ్‌స’గా ఐటీ నిపుణులు
ప్రతీ విద్యార్థికి ఉద్యోగావకాశాలే లక్ష్యంగా
ఇంజనీరింగ్ విద్యలో కీలక మార్పులు నిపుణుల కమిటీ సిఫారసులు
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకే పరిమితమైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులు.. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ విద్యార్థులు కూడా చేయొచ్చు.. అలాగే సీఎస్ విద్యార్థులూ ఇతర కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్టులను ఎంచుకోవచ్చు.. నాలుగేళ్లలో పూర్తి చేయాల్సిన 160 క్రెడిట్స్ మూడేళ్లలోనే పూర్తి చేసేసి చివరి సంవత్సరం కాలేజీకి రాకుండా పూర్తిగా ఇంటర్న్‌షిప్ ఉద్యోగం చేసుకోవచ్చు. ఐటీ నిపుణులు కూడా యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా సేవలందించవచ్చు.. ఇలా ఇంజనీరింగ్ విద్యలో సమూల మార్పులు రాబోతున్నాయి. బీటెక్ పూర్తి చేసిన ప్రతీ విద్యార్థికి ఉద్యోగం కల్పించాలన్న సీఎం రేవంత్ ఆదేశాలకునుగుణంగా బీటెక్ విద్యా విధానం వచ్చే విద్యా సంవత్సరం నుంచి మారబోతోంది. ఈ దిశగా ఇప్పటికే తెలంగాణ ఉన్నత విద్యామండలి వివిధ రంగాల నిపుణులతో నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ తన నివేదిక శుక్రవారం సమర్పించింది. వీటిని వచ్చే విద్యా సంవత్సరం నుంచి యథాతథంగా అమలు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.
మైనర్, ఆనర్స్ డిగ్రీ ప్రోగ్రాం..
బీటెక్‌లో ప్రతీ సెమిస్టర్‌కు 20 క్రెడిట్స్ చొప్పున ప్రస్తుతం నాలుగేళ్ల కాలానికి 160 క్రెడిట్స్ ఉన్నాయి. ఇక నుంచి అదనంగా మరో 20 క్రెడిట్స్ కేటాయించనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులకు ‘మైనర్ డిగ్రీ, ఆనర్స్ డిగ్రీ’ ప్రోగ్రాంను అమలు చేస్తారు. ఒక బ్రాంచ్ విద్యార్థులు ఇతర బ్రాంచ్‌ల సబ్జెక్టులను కూడా నేర్చుకునే అవకాశం కల్పించడం దీని ఉద్దేశం. ఉదాహరణకు.. కోర్ ఇంజనీరింగ్ కోర్సులుగా పేర్కొనబడే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు.. సీఎస్ విద్యార్థులు చదివే ఎమర్జింగ్ టెక్నాలజీ (ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్.. వంటి)లో మైనర్ డిగ్రీ చేయడం తప్పనిసరి. వారంతా ఇందులోనూ అర్హత సాధించాల్సిందే. దీంతో కోర్ ఇంజనీరింగ్ విద్యార్థులకూ.. సీఎ్‌సతో సమానంగా ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దీని ద్వారా ప్రతీ ఏటా తగ్గిపోతున్న కోర్ ఇంజనీరింగ్ సీట్లను కాపాడుకోవడంతో పాటు.. సీఎ్‌సతో పోలిస్తే తమకు ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయన్న ఆత్మన్యూనతా భావం విద్యార్థుల్లో దూరం అవుతుందని నిపుణుల కమిటీ తెలిపింది. అలాగే సీఎస్ చదువుతున్న వారు ఇతర సబ్జెక్టులు ఎంచుకోవచ్చు. విద్యార్థుల ఆసక్తి ఆధారంగా ఇతర కోర్సులను ఎంచుకునే స్వేచ్ఛ కూడా విద్యార్థులకు మైనర్ డిగ్రీతో లభించనుంది.
వేగంగా నేర్చుకునే వారి కోసం..
ప్రస్తుత ఇంజనీరింగ్‌లో ఉన్న 160 క్రెడిట్స్‌ను సెమిస్టర్ ప్రకారమే పూర్తిచేయాల్సి ఉంటుంది. అయితే దీనిని మూడేళ్లలోనే పూర్తి చేసే అవకాశం కూడా కొత్త విధానంలో ఉంది. వేగంగా నేర్చుకునే విద్యార్థులు ప్రతీ సెమిస్టర్‌లో మరుసటి సెమిస్టర్‌కు సంబంధించి ఒకటి లేదా రెండు సబ్జెక్టులు ముందుగానే పూర్తి చేసే అవకాశముంటుంది. ఇలా నాలుగేళ్లలో 8 సెమిస్టర్ల 160 క్రెడిట్స్, కొత్తగా ప్రవేశపెట్టనున్న మైనర్ డిగ్రీ 20 క్రెడిట్స్ మూడేళ్లలో 6 సెమిస్టర్లలోనే పూర్తి చేసుకోవచ్చు. చివరి సంవత్సరం అంతా కాలేజీకి రావాల్సిన అవసరం లేకుండా పూర్తిస్థాయి ఇంటర్న్‌షి్‌పలో భాగంగా ఉద్యోగం చేసుకోవచ్చు. ప్రస్తుతం బీటెక్ చివరి సంవత్సరంలో విద్యార్థులు ఇంటర్న్‌షిప్ కోసం కొంత సమయం మాత్రమే కేటాయిస్తున్నారు. కనీసం ఏడాది పాటు పూర్తిస్థాయి ఇంటర్న్‌షిప్ చేయాలని కంపెనీలు కోరుతున్నాయి. నూతన విధానంతో వేగంగా నేర్చుకునే విద్యార్థులు మూడేళ్లలోనే డిగ్రీ పూర్తి చేసుకుని కంపెనీల్లో పూర్తిస్థాయి ఇంటర్న్‌షిప్ ఉద్యోగిగా చేరే అవకాశం లభించనుంది.
అన్ని వర్సిటీల్లో ‘ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్..’
వర్సిటీల్లో బోధించే వారే కాకుండా.. కనీసం పదేళ్ల అనుభవమున్న వివిధ పారిశ్రామిక రంగాల నిపుణులనూ ప్రొఫెసర్లుగా నియమించుకోవచ్చని యూజీసీ చెబుతోంది. వీరిని ‘ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీ్‌స’గా అంటారు. అయితే ఈ దిశగా ఉస్మానియాతోపాటు పలు ప్రైవేటు వర్సిటీల్లోనే ఇతర రంగాల నిపుణులున్నారు. ఇక నుంచి అన్ని వర్సిటీల్లో ఇది తప్పనిసరి కానుంది. ఉదాహరణకు.. ఏఐ, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, రోబోటిక్స్ రంగాల్లోలో నిపుణుడిగా ఉన్న ఐటీ ఉద్యోగులను వర్సిటీలు ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీ్‌సగా నియమించుకోవచ్చు. ఇంతవరకు బీటెక్ చివరి ఏడాదిలో రెండు పారిశ్రామిక సందర్శన (ఇండస్ట్రియల్ విజిట్)లు తప్పనిసరిగా ఉండగా.. దీనిని నాలుగుకు పెంచారు. అలాగే ఒక కంపెనీ ఇంటర్న్‌షి్‌పను రెండుకు పెంచారు. థియరీతో పాటు ప్రాక్టికల్ అనుభవం అధికంగా ఉండాలన్న లక్ష్యంగా కొత్త విధానం అమలుచేయనున్నారు. అలాగే ద్వితీయ, తృతీయ సంవత్సరంలో ఇండస్ట్రియల్ ప్రాజెక్టుల క్రెడిట్స్ తప్పనిసరి చేశారు. జాతీయ, అంతర్జాతీయ మార్పులను గమనించేందుకు యూనివర్సిటీలు, కాలేజీలు ఇతర రాష్ట్రాలతోపాటు విదేశీ వర్సిటీలతో ఒప్పందాలు, విద్యార్థుల మార్పుల కార్యక్రమాలు (స్టూడెంట్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రాం) చేసుకునేలా ఉన్నత విద్యామండలి మరింత ప్రోత్సాహం అందించనుంది.
అందరికీ ఉద్యోగావకాశాలే లక్ష్యం..
ఇంజనీరింగ్ కేవలం పట్టాల కోసమే కాకుండా.. ఉద్యోగాలు కల్పించేలా ఉండాలన్న సీఎం రేవంత్ ఆదేశాలకునుగుణంగా కొత్త విధానం తెస్తున్నామని నిపుణుల కమిటీకి నేతృత్వం వహించిన ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్ చెప్పారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ప్రతీ విద్యార్థికి ఉద్యోగావకాశాలు కల్పించడమే కొత్త విధానం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కాగా, ఐదుగురు సభ్యుల ఈ కమిటీలో ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీ డీన్ ఎ.కృష్ణయ్య, జేఎన్‌టీయూ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి కె.భాస్కర్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ఉపాధ్యక్షుడు సి.శేఖర్ రెడ్డి, నాస్కామ్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ సీఈఓ శ్రీరాం బిరుదవోలు ఉన్నారు.