Share News

CM Revanth Reddy accused BRS: బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్యరహస్య ఒప్పందం

ABN , Publish Date - Nov 02 , 2025 | 05:06 AM

బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో బీఆర్‌ఎ్‌సకు ఓట్లు వేయించడమే...

CM Revanth Reddy accused BRS: బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్యరహస్య ఒప్పందం

  • డిపాజిట్‌ పోగొట్టుకునైనా బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని బీజేపీ యత్నం

  • కేసీఆర్‌-మోదీ ఓవైపు.. రాహుల్‌-రేవంత్‌ మరోవైపు

  • జూబ్లీహిల్స్‌లో సమస్యలకు కారణం బీఆర్‌ఎస్సే

  • మైనారిటీల గురించి మాట్లాడే హక్కు కేటీఆర్‌కు లేదు

  • జూబ్లీహిల్స్‌కు కిషన్‌రెడ్డి ఎన్ని నిధులు తెచ్చారు?

  • కాంగ్రె్‌సకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి

  • మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది

  • బోరబండ చౌరస్తాకు పీజేఆర్‌ పేరు.. విగ్రహం

  • జూబ్లీహిల్స్‌ ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి

  • బోరబండ, ఎర్రగడ్డలో రోడ్‌షో.. కార్నర్‌ మీటింగ్‌

హైదరాబాద్‌ సిటీ/బోరబండ/ఎర్రగడ్డ, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో బీఆర్‌ఎ్‌సకు ఓట్లు వేయించడమే ఆ ఒప్పందమన్నారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్‌లో బీజేపీ తమ డిపాజిట్‌ పోగొట్టుకొని బీఆర్‌ఎ్‌సను గెలిపించే ప్రయత్నం చేస్తోందన్నారు. మొదటి రోజు కేటీఆర్‌, రెండోరోజు కిషన్‌రెడ్డి మాట్లాడతారని, వీరిద్దరికీ ఫామ్‌హౌజ్‌లో కూర్చున్నాయన నీతులు చెబుతున్నారని తెలిపారు. వీరి కుమ్మక్కు రాజకీయాలపై ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌యాదవ్‌తో కలిసి నగరంలోని బోరబండ, ఎర్రగడ్డలో సీఎం రేవంత్‌రెడ్డి రోడ్‌ షో నిర్వహించారు. బోరబండ చౌరస్తా, ఎర్రగడ్డలోని బీశంకలాల్‌నగర్‌లో కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. ప్రస్తుత పోటీ మాగంటి సునీత, నవీన్‌యాదవ్‌ల మధ్య కాదని, కేసీఆర్‌, మోదీ ఒకవైపు, రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి మరోవైపుగా జరుగుతున్న పోటీ అని తెలిపారు. ‘‘మూడుసార్లు బీఆర్‌ఎస్‌ వాళ్లకు అవకాశమిచ్చారు. మూడుసార్లు పార్లమెంట్‌లో బీజేపీ వాళ్లకు అవకాశమిచ్చారు. ఈ ఒక్కసారి నన్ను నమ్మండి.. ఒక్క అవకాశమివ్వండి. నవీన్‌యాదవ్‌కు ఓటు వేయండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత, మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. నగరంలో ఏ పని చేయాలన్నా నా వెంట ఉండి.. నాతోపాటు పరుగెత్తేటోడు రావాలి’’ అని ఓటర్లనుద్దేశించి రేవంత్‌ అన్నారు.


అన్ని సమస్యలకు వారే కారణం..

జూబ్లీహిల్స్‌లో గతంలో ఎప్పుడూ సమస్యలు లేవన్నట్లుగా, ఇప్పుడే సమస్యలు వచ్చినట్లుగా బీఆర్‌ఎస్‌ నేతలు ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్‌ మండిపడ్డారు. ఈ ప్రాంతంతో సీసీ రోడ్లు లేకపోవడానికి, తాగునీరు రాకపోవడానికి, ఇళ్లపై ఎక్స్‌టెన్షన్‌ వైర్లు ఉండడానికి పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ కారణం కాదా? అని ప్రశ్నించారు. వాళ్లు చెప్పే అబద్ధాలు, లేవనెత్తుతున్న సమస్యలకు వారే కారణమన్నారు. పదేళ్లు అధికారంలో వాళ్లుంటే.. తాము వచ్చి రెండేళ్లు కూడా కాలేదని గుర్తు చేశారు. ఈ కొద్ది సమయంలోనే ఈ ప్రాంతంలో 14,159 రేషన్‌కార్డులు ఇచ్చామని తెలిపారు. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే ఎక్కడో పోయేవని, ఇప్పుడు సన్నబియ్యం ఇస్తుంటే పేదోళ్లు తింటున్నారని అన్నారు. పేదల బస్తీలో ఇళ్లకు ఉచిత కరెంటు ఇస్తున్నామని, 67 లక్షల మహిళా సంఘాలకు పెత్తనం ఇచ్చామని, వెయ్యి ఆర్టీసీ బస్సులు, జిల్లాల్లో పెట్రోల్‌ బంకులు నడిపే బాధ్యతలు ఇచ్చామని వివరించారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులను అమ్మడానికి హైటెక్‌ సిటీలో ఇందిరా బజార్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఉచిత బస్సుతో ఆడబిడ్డలకు రెండు, మూడు వేలు మిగులుతున్నాయని తెలిపారు. మెట్రోరైలు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ఎయిర్‌పోర్టు, హైటెక్‌ సిటీని కాంగ్రెస్‌ తీసుకొచ్చిందని, హైదరాబాద్‌లో వైఎస్సార్‌, చంద్రబాబు చేసిన అభివృద్ధి తప్ప.. కేసీఆర్‌ ఏమి చేశారో చెప్పాలని అన్నారు. మైనారిటీల గురించి మాట్లాడే హక్కు కేటీఆర్‌కు ఉందా? అని ప్రశ్నించారు. ‘‘వారికి అన్యాయం చేసినది నువ్వు కాదా? మైనారిటీలకు 4శాతం రిజర్వేషన్‌ కాంగ్రెస్‌ కల్పిస్తే.. మోదీతో జత కట్టి ట్రిపుల్‌ తలాక్‌కు, 370 ఆర్టికల్‌కు, పౌరసత్వ సవరణ చట్టానికి రాజ్యసభ, లోక్‌సభలో మీ పార్టీ ఓట్లేసి మద్దతిచ్చింది నిజం కాదా?’’ అని రేవంత్‌ నిలదీశారు.


ఆడబిడ్డను మంచిగా చూసుకోలేనోడు..

చెల్లెలు సునీతమ్మను గెలిపించి కన్నీళ్లు తుడవాలంటూ కేటీఆర్‌ మాట్లాడుతున్నారని, ఆయన తీరు సొంత చెల్లెలికి అన్నం పెట్టలేదుగానీ.. చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేపిస్తా అన్నట్లుగా ఉందని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తోడబుట్టిన చెల్లెలికి ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లో నుంచి బయటకు పంపించారని ఆరోపించారు. ‘‘నాన్న సంపాదించిన వేల కోట్ల అక్రమ ఆస్తుల్లో వాటా ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లో నుంచి వెళ్లగొట్టావు. అలాంటి నువ్వు.. మాగంటి సునీతమ్మను మంచిగా చూసుకుంటావా.? సునీతమ్మను ముందర నిలబెట్టి ఓట్లు వేయించుకొని గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. సిగ్గుంటే మీ చెల్లెలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు’’ అని రేవంత్‌ అన్నారు. ఇక్కడ మట్టి ఉంది, బురద ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అంటున్నారని, మరి రెండుసార్లు కేంద్ర మంత్రి అయ్యి మట్టితీసి సీసీ రోడ్డు వేసేందుకు నిధులేమైనా తెచ్చారా? అని రేవంత్‌ ప్రశ్నించారు. పోలింగ్‌కు ఇంకా పది రోజుల సమయం ఉందని, ప్రధాని మోదీ దగ్గరికెళ్లి ఏమి తెస్తారో తీసుకురావాలని సవాల్‌ విసిరారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే కిషన్‌రెడ్డి బట్టలు చించుకుంటున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆయనకేం బాధ? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అని ప్రశ్నించారు. మంత్రి పదవేమన్నా కిషన్‌రెడ్డి బాబు జాగీరా? అని ధ్వజమెత్తారు.

బోరబండ చౌరస్తాకు పీజేఆర్‌ పేరు..

బోరబండ చౌరస్తాకు దివంగత నేత పి.జనార్దన్‌రెడ్డి పేరు పెట్టాల్సిందిగా ఇక్కడి వారు సూచించారని సీఎం రేవంత్‌ తెలిపారు. విజయోత్సవ ర్యాలీకి వచ్చి ఈ చౌరస్తాకు పీజేఆర్‌ బోరబండ చౌరస్తా అని పేరు పెట్టడంతోపాటు పీజేఆర్‌ విగ్రహాన్ని కూడా పెట్టిస్తానని ప్రకటించారు. ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించడానికి మళ్లీ వస్తానని చెప్పారు. అవసరమైన నిధులు ఇస్తానని, పట్టాలున్నవారికి ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేలా అవకాశమిస్తానని హామీ ఇచ్చారు. అవతలి పార్టీవారు మాత్రం ఏం చేసినా, ఎన్ని ఓట్లేసినా రారని, దొంగల్లా దొరక్కుండా పోతారని ఆరోపించారు. ఇప్పుడు ఓట్లున్నాయని వచ్చారే తప్ప.. 20 నెలల్లో వారి ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చారా? ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అజారుద్దీన్‌, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2025 | 06:20 AM