Share News

నల్లమల సంపదపై రేవంత్‌ కన్ను: బీఆర్‌ఎస్‌

ABN , Publish Date - May 21 , 2025 | 06:44 AM

నల్లమల ఖనిజ సంపదపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆశలు పెట్టుకున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం యురేనియం తవ్వకాలను అడ్డుకుందని, ఇప్పుడా సంపదపై కుట్ర జరుగుతోందని విమర్శలు గుప్పించారు.

నల్లమల సంపదపై రేవంత్‌ కన్ను: బీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): నల్లమల ప్రాంతంలోని ఖనిజ సంపదపై సీఎం రేవంత్‌ రెడ్డి కన్ను పడిందని, అందుకే అక్కడ పుట్టకపోయినా తాను నల్లమల బిడ్డనంటూ నక్కజిత్తుల మాటలు మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్‌ గత ప్రభుత్వంలో ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా సంస్థకు నల్లమలలోని ఖనిజ సంపదను తాకట్టుపెడితే... దాన్ని కాపాడుకున్నామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు గువ్వల బాలరాజు, కోవా లక్ష్మి, రేగా కాంతారావు, భూక్యా జాన్సన్‌ నాయక్‌ మంగళవారం మీడియాతో మాట్లాడారు. నల్లమల్ల ప్రాంతంలో యురేనియం తవ్వకాలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అడ్డుకుందని, ఇపుడు ఆ సంపదపై రేవంత్‌ రెడ్డి కన్నువేశారని, అందుకే గిరిజన ఆదివాసీలకు మోసపూరిత డిక్లరేషన్‌ ప్రకటించారని ఆరోపించారు. కాగా, ప్రపంచ సుందరి పోటీదారులకు రాష్ట్రంలోని సందర్శనీయ స్థలాలను చూపిస్తున్న ప్రభుత్వం.. వారిని హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు ఎందుకు తీసుకెళ్లలేదని మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ ప్రశ్నించారు. సీఎం తన తప్పిదాన్ని సరిచేసుకోవాలని, జూన్‌ 2న మిస్‌ వరల్డ్‌ విజేతలు, పోటీదారులను గవర్నర్‌ వద్దకు తీసుకువెళ్లే ముందు అంబేడ్కర్‌ విగ్రహాన్ని, అమరజ్యోతిని చూపించాలని సూచించారు.

Updated Date - May 21 , 2025 | 06:45 AM