Share News

మళ్లీ తెరపైకి ఇచ్చంపల్లి!

ABN , Publish Date - Jun 21 , 2025 | 03:06 AM

గోదావరిలో వరద జలాలు ఉన్నాయని ఏపీ నిజంగా భావిస్తే.. పోలవరం - బనకచర్లకు బదులు కేంద్రం నిధులు ఇచ్చే ఇచ్చంపల్లి - నాగార్జున సాగర్‌ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్‌కు నీళ్లు తీసుకెళ్లే విషయమై చర్చకు మేం సిద్ధం’- కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో భేటీ సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్య ఇది.

మళ్లీ తెరపైకి ఇచ్చంపల్లి!

ఇచ్చంపల్లి-సాగర్‌ అనుసంధానానికి సిద్ధమన్న తెలంగాణ

  • గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుకు విరుగుడుగా ప్రతిపాదన

  • ఈనెల 24న ఎన్‌డబ్ల్యూడీఏ భేటీ.. సమావేశంలో ప్రస్తావించే చాన్స్‌

హైదరాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): ‘గోదావరిలో వరద జలాలు ఉన్నాయని ఏపీ నిజంగా భావిస్తే.. పోలవరం - బనకచర్లకు బదులు కేంద్రం నిధులు ఇచ్చే ఇచ్చంపల్లి - నాగార్జున సాగర్‌ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్‌కు నీళ్లు తీసుకెళ్లే విషయమై చర్చకు మేం సిద్ధం’- కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో భేటీ సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్య ఇది. దీంతో, కొన్నేళ్లుగా తెలంగాణ వ్యతిరేకిస్తున్న ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్‌ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. నదుల అనుసంధానంపై జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) సంప్రదింపుల కమిటీ సమావేశం ఈనెల 24న హైదరాబాద్‌లో జరగనుంది. అప్పుడు ఇచ్చంపల్లి రిజర్వాయర్‌ అంశాన్ని ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నిజానికి, కొన్నేళ్ల కిందటే గోదావరి- కావేరి అనుసంధానాన్ని ప్రతిపాదించిన కేంద్రం.. ఇందులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్‌ నిర్మిస్తామని ప్రతిపాదించింది. దీనిపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇచ్చంపల్లి నుంచి కేవలం 24 కిలోమీటర్ల దిగువనే తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజీ ఉందని, ఇచ్చంపల్లి నుంచి ఆకస్మికంగా వరద విడుదల చేయాల్సి వస్తే.. దానిని నియంత్రించే పరిస్థితులు ఉండబోవని తెలిపింది. కేవలం 24 కిలోమీటర్ల దూరమే ఈ బ్యారేజీల మధ్య ఉండటంతో ఫ్లడ్‌ రూటింగ్‌కు ఇబ్బందులు రానున్నాయని వివరిస్తోంది.


ఇచ్చంపల్లికి దిగువన 158 టీఎంసీల (దేవాదులకు 38 టీఎంసీలు, సీతారామకు 70 టీఎంసీలు, తుపాకులగూడెంకు 50 టీఎంసీ) నీటి వినియోగం ఉందని, ఇక్కడ రిజర్వాయర్‌ కట్టి ఏకకాలంలో గోదావరి-కావేరి అనుసంధానంతోపాటు దిగువన ఉన్న ప్రాజెక్టుల అవసరాలు తీర్చడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తోంది. అదే సమయంలో, సమ్మక్క సాగర్‌ (తుపాకులగూడెం) బ్యారేజీ నుంచి గోదావరి-కావేరి అనుసంధానం చేపట్టడానికి గతంలోనే తెలంగాణ అంగీకారం తెలిపింది. 83 మీటర్ల నుంచి 85 మీటర్ల మధ్య నిల్వ చేసిన నీటిని మాత్రమే నదుల అనుసంధానం ద్వారా తరలించాలని తెలిపింది. అయితే, గోదావరి- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు కింద 300 టీఎంసీలను తరలించడానికి ఏపీ ప్రయత్నాలు చేస్తోంది. దీనికితోడు, పూర్వ గుంటూరు జిల్లా బొల్లాపల్లిలో 173 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్‌ నుంచే గోదావరి-కావేరి అనుసంధానం చేపట్టాలని తాజాగా ప్రతిపాదించింది. ఇప్పటిదాకా పోలవరం నుంచి గోదావరి-కావేరి అనుసంధానం చేపట్టాలని పట్టుబడుతూ వచ్చిన ఏపీ.. తాజాగా రూటు మార్చింది. బొల్లాపల్లి నుంచి గోదావరి- కావేరి అనుసంధానం చేపట్టాలని కేంద్రానికి నివేదించడమే కాకుండా ఒత్తిడి పెంచింది. నిజానికి, తెలంగాణ నుంచి ఈ అనుసంధానం చేపడితే.. రాష్ట్రానికి తొలి దశలో 42 టీఎంసీలు లభించనున్నాయి. వీటి వినియోగానికి రెండు రిజర్వాయర్లు నిర్మించాలని కేంద్రాన్ని తెలంగాణ కోరుతోంది కూడా. ఇందుకు కేంద్రం ప్రాథమికంగా అంగీకరించింది. తాజా పరిణామాలతో, అనుసంధాన ప్రాజెక్టు రాష్ట్రాన్ని వీడే అవకాశం ఉండటంతో తెలంగాణ అప్రమత్తమయింది. గోదావరి-బనకచర్ల అనుసంధానానికి చెక్‌ పెట్టేలా ఇచ్చంపల్లి రిజర్వాయర్‌ నిర్మాణానికి సమ్మతి తెలపాలని పావులు కదుపుతోంది.

Updated Date - Jun 21 , 2025 | 03:06 AM