Share News

RERA law: రెరా చట్టంతో రియల్టీపై ప్రజల్లో పెరిగిన విశ్వాసం

ABN , Publish Date - Aug 18 , 2025 | 05:05 AM

రెరా చట్టం వల్ల రియల్‌ ఎస్టేట్‌ రంగంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. పారదర్శకత, బాధ్యతాయుత పాలన రియల్‌ ఎస్టేట్‌ రంగానికి బలమైన పునాది అని తెలిపారు.

RERA law: రెరా చట్టంతో రియల్టీపై ప్రజల్లో పెరిగిన విశ్వాసం

  • కేంద్రం నుంచి రాష్ట్ర మౌలిక వసతుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

  • ముసిగిన క్రెడాయ్‌ ప్రాపర్టీ షో

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): రెరా చట్టం వల్ల రియల్‌ ఎస్టేట్‌ రంగంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. పారదర్శకత, బాధ్యతాయుత పాలన రియల్‌ ఎస్టేట్‌ రంగానికి బలమైన పునాది అని తెలిపారు. హైదరాబాద్‌లో మూడు రోజులు జరిగిన క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రాపర్టీ షో ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడారు. హైదరాబాద్‌ను వ్యాక్సిన్‌ రాజధానిగా ఎదగడమేకాకుండా ఫార్మా, ఐటీ, హెల్త్‌కేర్‌, సీడ్‌ ఎగుమతుల్లో నగరం అగ్రగామిగా నిలిచిందన్నారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌), రీజినల్‌ రింగ్‌ రైలు, మెట్రో విస్తరణ వంటి మెగా ప్రాజెక్టులు నగర కనెక్టివిటీని పెంచి కొత్త అభివృద్ధి అవకాశాలను కలిగిస్తాయని తెలిపారు.


వరంగల్‌ విమానాశ్రయం పునరుద్ధరణ, ఆదిలాబాద్‌ ఎయిర్‌బేస్‌ను కమర్షియల్‌గా మార్చే ప్రయత్నాలు రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుస్తాయన్నారు. కేంద్రం నుంచి తెలంగాణ మౌలిక వసతుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను గ్లోబల్‌ టెక్నాలజీ, పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దే దిశగా కృషి జరుగుతోందని చెప్పారు. ప్రజలు దేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలన్న ప్రధాని పిలుపునకు స్పందించాలని కిషన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. క్రెడాయ్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు ఎన్‌.జయదీ్‌ప రెడ్డి మాట్లాడుతూ మూడు రోజుల ప్రదర్శనలో 70కి పైగా డెవలపర్లు, 300కి పైగా రెరా అనుమతి ఉన్న ప్రాజెక్టులు పాలుపంచుకోగా.. డెవలపర్లకు సుమారు రూ.400కోట్ల వ్యాపారావకాశాలు వచ్చినట్టు తెలిపారు. ఈ ప్రదర్శనకు 50వేల మందికి పైగా సందర్శకులు వచ్చారు. కార్యక్రమంలో క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రతినిధులు బి.జగన్నాథరావు, కాంతి కిరణ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏయూ మాజీ రిజిస్ట్రార్ల అరెస్ట్‌కు వారెంట్ జారీ

బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ

Updated Date - Aug 18 , 2025 | 05:05 AM