RERA: అడ్డగోలు చెల్లదు
ABN , Publish Date - Jan 25 , 2025 | 03:24 AM
రియల్టర్ల అడ్డగోలు ప్రకటనలపై రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) ప్రత్యేకంగా దృష్టి సారించింది. తమ అనుమతుల్లేని ప్రాజెక్టులపై రియల్ ఎస్టేట్ కంపెనీలు చేస్తున్న ప్రచారంపై తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని నాలుగు బృందాలను నియమించింది.

రియల్టర్ల ప్రచారంపై రెరా డేగకన్ను
ప్రకటనలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల తనిఖీ
హైదరాబాద్‌లో నాలుగు ప్రత్యేక బృందాలు
నిబంధనలు ఉల్లంఘిస్తే నోటీసులు, జరిమానా
హైదరాబాద్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): రియల్టర్ల అడ్డగోలు ప్రకటనలపై రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) ప్రత్యేకంగా దృష్టి సారించింది. తమ అనుమతుల్లేని ప్రాజెక్టులపై రియల్ ఎస్టేట్ కంపెనీలు చేస్తున్న ప్రచారంపై తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని నాలుగు బృందాలను నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. రియల్ ఎస్టేట్ సంస్థలు తమ ప్రాజెక్టు గురించిన ప్రకటనలు ఇవ్వాలంటే తప్పనిసరిగా రెరా ఇచ్చిన రిజిస్ట్రేషన్ నంబర్ ఉండాలి. కానీ, కొన్ని సంస్థలు పురపాలక శాఖ అనుమతులు పొందకుండా, రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ప్రీ లాంచింగ్ పేరుతో ప్రకటనలు ఇస్తూ అమ్మకాలు చేస్తున్నాయి.
సంవత్సరాల పాటు నిర్మాణాలు చేయకుండా కొనుగోలుదారులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ లేకుండానే హోర్డింగ్స్ పెట్టడం, ప్రకటనలపై ప్రాజెక్టు పేరు, వెబ్‌సైట్, చిరునామా ముద్రించకపోవడం, అనుమతుల్లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడం తదితర అంశాలపై హైదరాబాద్ నగర నలువైపులా తనిఖీలు చేసి.. రిజిస్ట్రేషన్ లేకుండా బ్యానర్లు ఏర్పాటు చేసి ఉంటే షోకాజ్ నోటీసులు ఇవ్వాలని, జరిమానాలు విధించాలని రెరా ఆదేశించింది.
శ్రీశైలం హైవే, దక్షిణ హైదరాబాద్, ఎయిర్‌పోర్టు, బెంగళూరు జాతీయ రహదారి మార్గాల్లో తనిఖీలు చేసేందుకు జాయింట్ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి, కె.ప్రభాకర్ నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.
హైటెక్ సిటీ, నాగపూర్ జాతీయ రహదారి, వరంగల్ హైవే, పశ్చిమ హైదరాబాద్ వైపు పరిశీలన చేసేందుకు అదనపు రిజిస్టార్ డి.రవీందర్, జగదీశ్ నేత్వంలో కమిటీని వేశారు.
విజయవాడ జాతీయ రహదారి, వరంగల్ జాతీయ రహదారి, తూర్పు హైదరాబాద్ వైపు తనిఖీలు చేయడానికి రెరా సాంకేతిక అధికారులు కె.అంజయ్య, ఎన్. తిరుపతయ్య నేతృత్వంలో కమిటీని నియమించారు.
ముంబయి జాతీయ రహదారి, ఉత్తర హైదరాబాద్ , నాగార్జున సాగర్ రహదారి వైపు లీగల్ సెల్ ఏడీ శ్రీమతి హెచ్.చంద్రవదన, కె.నిరంజన్ రావు నేతృత్వంలో కమిటీని వేశారు.