Human shaped sculptures: అరుదైన మెగాలిథిక్ యుగం నాటి మానవ ఆకారపు శిల్పాలు.. ఎక్కడంటే?
ABN , Publish Date - Nov 10 , 2025 | 06:39 PM
అరుదైన మెగాలిథిక్ యుగం నాటి మానవ ఆకారపు శిల్పాలు సూర్యాపేట జిల్లాలో లభ్యమయ్యాయి. నేరేడుచర్ల మండలం మేడారం గ్రామంలోని రెక్కల స్తంభం గండి వద్ద మెగాలిథిక్ యుగం నాటి మానవ ఆకారపు శిల్పాన్ని కేయూ చరిత్ర విభాగం పరిశోధక విభాగం విద్యార్థి సంగు వెంకటరెడ్డి గుర్తించారు.
సూర్యాపేట, నవంబర్ 10: తెలంగాణలో అరుదైన మెగాలిథిక్ యుగం నాటి మానవ ఆకారపు శిల్పాలు లభ్యమయ్యాయి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం మేడారం గ్రామంలోని రెక్కల స్తంభం గండి వద్ద మెగాలిథిక్ యుగం నాటి మానవ ఆకారపు శిల్పాన్ని కాకతీయ యూనివర్సిటీ చరిత్ర విభాగానికి చెందిన పీహెచ్‌డీ విద్యార్థి సంగు వెంకటరెడ్డి గుర్తించారు. ఈ మేరకు వెంకటరెడ్డి పలు వివరాలు వెల్లడించారు. ఈ శిల్పాలు క్రీ.పూ. 1200-క్రీ.పూ. 300 మధ్య కాలానికి చెందినవిగా తెలిపారు. ఇవి మెగాలిథిక్ కాలం నాటి సమాధులకు అనుబంధంగా ఉంటాయని చెప్పారు. ఈ విగ్రహాలు వారి నాయకుడు లేదా దేవుడిగా పరిగణించవచ్చని అభిప్రాయపడ్డారు.
ఇలాంటి మానవ ఆకార శిల్పాలు ఉమ్మడి వరంగల్ జిల్లా లోని కొత్తూరు మొట్లగూడెం, భూపతిపురం, బొమ్మైగూడెం, మంగపేట, మల్లూరు, కోడాకండ్లలలో ఉన్నాయని చెప్పారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గలబ, పడగొని గూడెం, దొంగతోగు, కచనపల్లి గ్రామాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని కేసారం గ్రామంలోనూ ఈ శిల్పాలు ఉన్నాయని తెలిపారు. నేటికి ఇలాంటి సమాధి ఆచారాలను గోండులు, మరియాలు, కదంబలు వంటి గిరిజన సమాజాలలో నేటికి పాటిస్తున్నారని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
అందెశ్రీ మృతి మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు: ప్రధాని
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. సీఎం రేవంత్‌పై హరీష్ సంచలన కామెంట్స్