Share News

Ramachander Rao: బీసీ రిజర్వేషన్లపై తప్పుదారి పట్టిస్తున్న కాంగ్రెస్‌

ABN , Publish Date - Aug 20 , 2025 | 04:35 AM

బీసీ రిజర్వేషన్లను మోదీ అడ్డుకుంటున్నారంటూ.. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆరోపించారు.

Ramachander Rao: బీసీ రిజర్వేషన్లపై తప్పుదారి పట్టిస్తున్న కాంగ్రెస్‌

రాజకీయాల్లో మత పరమైన రిజర్వేషన్లు సరికాదు

  • రాష్ట్రంలో ఈసారి అధికారం బీజేపీదే

  • యూరియా పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కేంద్రంపైకి నెడుతున్నారు

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

వికారాబాద్‌, హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్లను మోదీ అడ్డుకుంటున్నారంటూ.. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేనిది కాంగ్రె్‌సకేనన్నారు. మతం ఆధారంగా రిజర్వేషన్లకు తమ పార్టీ వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం వికారాబాద్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యకర్తల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఇప్పటికే వారు బీసీ-బీ, బీసీ-ఈ, ఈబీసీ కోటాలో విద్యా, ఉద్యోగాల్లో లబ్ధి పొందుతున్నారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరా చేయడం లేదని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం సరఫరా చేసిన యూరియా రైతులకు ఎందుకు అందడం లేదో గుర్తించాల్సిన బాధ్యతను మరిచి... ఆ వైఫల్యాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.


సునామీ వచ్చినా.. ఏ శక్తి అడ్డొచ్చినా రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే.. వికారాబాద్‌ జిల్లా పేరును అనంతగిరిగా మారుస్తామని, జిల్లాను పర్యాటక కేంద్రంగా, దక్షిణ ఊటీగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాల పాలన చూసిన ప్రజలు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఆ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని రామచందర్‌రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని మరో ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సర్కారు రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని... దళారులకు వంత పాడుతోందని దుయ్యబట్టారు. ‘‘రాష్ట్రానికి 9.5 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా, కేంద్రం 12 లక్షల టన్నులు సరఫరా చేసింది. ఐనా ఎందుకు కొరత ఏర్పడిందో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి’’ అని రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు. యూరియా పక్కదారి పట్టిన ఘటనపై ఎందుకు దర్యాప్తు చేయడం లేదని నిలదీశారు.

Updated Date - Aug 20 , 2025 | 04:35 AM