Rail Manufacturing: కోచ్ హబ్‌గా కాజీపేట
ABN , Publish Date - Feb 17 , 2025 | 02:43 AM
ఇప్పటికే కాజీపేటకు వ్యాగన్ తయారీ కేంద్రంతో పాటు ఇటీవలే కోచ్ ఫ్యాక్టరీని కూడా రైల్వే శాఖ మంజూరు చేసింది. అయితే బడ్జెట్‌లో కాజీపేట రైల్వే తయారీ పరిశ్రమను బహుళార్థకంగా వాడుకుంటామని కేంద్రం ప్రకటించింది.

వ్యాగన్, ప్యాసింజర్, వందేభారత్ సహా.. ఈఎంయూ కోచ్‌ల తయారీకి రైల్వే ఆసక్తి
రైల్ మల్టిపుల్ మ్యాన్యుఫ్యాక్చర్ పరిశ్రమను.. ఏర్పాటు చేస్తామని బడ్జెట్‌లో కేంద్రం ప్రకటన
ఇప్పటికే శరవేగంగా కోచ్ ఫ్యాక్టరీ పనులు
ఆగస్టులోపు వ్యాగన్, వచ్చే ఏడాది మార్చి.. నాటికి ప్యాసింజర్ కోచ్‌ల తయారీకి కసరత్తు
వరంగల్, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దేశంలో ఎక్కడా లేనివిధంగా రైల్ మల్టిపుల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ పరిశ్రమను కాజీపేటలో ఏర్పాటు చేసేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కాజీపేటకు వ్యాగన్ తయారీ కేంద్రంతో పాటు ఇటీవలే కోచ్ ఫ్యాక్టరీని కూడా రైల్వే శాఖ మంజూరు చేసింది. అయితే బడ్జెట్‌లో కాజీపేట రైల్వే తయారీ పరిశ్రమను బహుళార్థకంగా వాడుకుంటామని కేంద్రం ప్రకటించింది. దీంతో ఇక్కడ వందేభారత్ రైళ్లతో పాటు ఇతర ప్యాసింజర్, గూడ్స్, ఈఎంయూ కోచ్‌లు కూడా సిద్ధం కానున్నాయి. దేశంలో ఇప్పటివరకు ఇలాంటి తయారీ కేంద్రం ఎక్కడా లేదు. ఈ అరుదైన అవకాశం కాజీపేటకు వస్తుండటంతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆశలున్నాయి.
ముందు వ్యాగన్ తర్వాత కోచ్ ఫ్యాక్టరీ
2023 జూలై8న ప్రధాని మోదీ కాజీపేటలో వ్యాగన్ తయారీ పరిశ్రమకు భూమి పూజ చేశారు. 152 ఎకరాల్లో రూ.521కోట్ల అంచనా వ్యయంతో ఏటా 2,400 వ్యాగన్ల తయారీ సామర్థ్యం కలిగిన పరిశ్రమను 2025 మార్చి నాటికి ప్రారంభించాలని నిర్ణయించారు. 60శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఆగస్టు వరకు మిగతా పనులు పూర్తి చేసి, వ్యాగన్ల ఉత్పత్తి మొదలు పెట్టాలని రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీకి బదులు వ్యాగన్ పరిశ్రమను ఇచ్చిన కేంద్రం.. అనూహ్యంగా 2024 సెప్టెంబరు 9న ఆ కర్మాగారాన్ని కోచ్ ఫ్యాక్టరీగా అప్‌గ్రేడ్ చేసింది. ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌ల తయారీకి యూనిట్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ కోచ్ ఫ్యాక్టరీ కోసం రూ.251కోట్ల నిధులను కేటాయించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి కోచ్‌ల తయారీ మొదలయ్యేలా పనులు జరుగుతున్నాయి. వ్యాగన్ల తయారీతో పాటు వందేభారత్ కోచ్‌లను ఇక్కడే తయారు చేస్తారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. అయితే ఇటీవల బడ్జెట్‌లో రైల్వేశాఖ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని మల్టిపుల్‌గా వాడుకుంటామని ప్రకటించింది. దీంతో వ్యాగన్లు, ప్యాసింజర్ బోగీలు, వందేభారత్ కోచ్‌లతో పాటు ఈఎంయూ వంటి ఎలక్ట్రిక్ కోచ్‌లను కూడా ఇక్కడే తయారు చేసేందుకు కేంద్రం ఆసక్తి చూపుతోందని తెలుస్తోంది.
దేశంలోనే ఏకైక మల్టిపుల్ ఫ్యాక్టరీ..
రైల్వేశాఖకు చెన్నై, కపుర్తల, బెంగళూరు, పటియాల, చిత్తరంజన్, వారాణసి, రాయ్‌బరేలిలో మాత్రమే కోచ్ ఫ్యాక్టరీలున్నాయి. మరో 11చోట్ల వ్యాగన్ తయారీ పరిశ్రమలున్నాయి. అయితే దేశంలో ఎక్కడా మల్టిపుల్ రైల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రం లేదని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం తొలివిడతలో కేంద్రం రూ.251కోట్లను కేటాయించింది. వ్యాగన్ పరిశ్రమ కోసం ఏర్పాటు చేస్తున్న షెడ్లు, ట్రాక్‌లతో పాటు బోగీలకు పెయింట్ వేసే షెడ్లను కోచ్ ఫ్యాక్టరీకి కూడా వినియోగించుకోనున్నారు. తొలుత వ్యాగన్ పరిశ్రమ కోసం రూ.521కోట్లతో అంచనాలు రూపొందించినప్పటికీ, ప్రస్తుతం రూ.581కోట్ల వరకు పెరిగినట్లు సమాచారం. ఎలక్ట్రిక్ కోచ్‌లు, వందే భారత్ కోచ్‌లను కూడా ఇక్కడే తయారు చేయాలని రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. వీటికి మరో రూ.300కోట్లకు పైగా ఖర్చు కానుంది. మొత్తంగా రూ.1,200కోట్ల నుంచి రూ.1,500కోట్ల ఖర్చుతో కాజీపేటలో మల్టీపర్పస్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం
ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News