Rahul Gandhi: సామాజిక న్యాయానికి నమూనాగా తెలంగాణ
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:08 AM
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సామాజిక న్యాయాన్ని అమలు చేసేందుకు తెలంగాణ ఒక నమూనాగా ఉపయోగపడాలని ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ కులగణన జరిపించిన తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూనే.. ఇందులో వచ్చిన నిర్ధారణల ఆధారంగా సామాజిక న్యాయం జరగాలన్నారు.

దేశంలో కాంగ్రెస్‌కు ఊపునివ్వాలి: రాహుల్
మధు యాష్కీతో కాంగ్రెస్ అగ్రనేత చర్చలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సామాజిక న్యాయాన్ని అమలు చేసేందుకు తెలంగాణ ఒక నమూనాగా ఉపయోగపడాలని ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ కులగణన జరిపించిన తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూనే.. ఇందులో వచ్చిన నిర్ధారణల ఆధారంగా సామాజిక న్యాయం జరగాలన్నారు. ఇది దేశంలో కాంగ్రె్‌సకు ఊపునివ్వాలని.. కేంద్రం తెలంగాణ చట్టాన్ని గౌరవించినా, గౌరవించకపోయినా ఈ విషయంలో వెనుకంజ వేయకూడదని పేర్కొన్నారు. శనివారం మాజీ ఎంపీ మధు యాష్కీగౌడ్‌ను ఢిల్లీకి పిలిపించి కులగణన గురించి రాహుల్ చర్చించారు. కులగణన ఆధారంగా సామాజిక న్యాయాన్ని ఆచరణలో పెట్టేందుకు తగిన చర్యలు ఏ విధంగా తీసుకోవాలన్న దానిపై మేధావులు, జర్నలిస్టులు, ఇతర వర్గాలతో చర్చించి ఓ నివేదిక ఇవ్వాల్సిందిగా మధు యాష్కీని కోరారు.
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడం గురించి యాష్కీ ప్రస్తావించగా.. అది ప్రభుత్వం చూసుకుంటుందని, అయితే అన్ని వర్గాలను ఏ విధంగా సంతృప్తి పరిచి కాంగ్రెస్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఎలా నిలవాలో నిర్ణయించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.కాగా, ఢిల్లీలో పార్టీ నేతలను పక్క దోవ పట్టించేలా, వాస్తవాలను కప్పిపుచ్చి తప్పుడు విషయాలను ప్రచారం చేయడం కూడా అధిష్ఠానం దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇటీవల రేవంత్‌కు సూచనలివ్వడంతో పాటు దీపాదాస్ మున్షీ స్థానంలో రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌ను నియమించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మీనాక్షి రావడం ఒక రకంగా రేవంత్‌కు మంచిదేనని, ఆమె జరుగుతున్న విషయాలపై సరైన నివేదిక ఇస్తారని, రాహుల్ ఆలోచనలను ఎప్పటికప్పుడు రేవంత్‌కు తెలియజేసేందుకు వీలుంటుందని వెల్లడించాయి.