Share News

Rahul Gandhi: రాహుల్‌ గాంధీ వరంగల్‌ పర్యటన ఖరారు.. రద్దు

ABN , Publish Date - Feb 12 , 2025 | 04:22 AM

లోకసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వరంగల్‌ పర్యటన రద్దు అయింది. మంగళవారం జరగాల్సిన ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైన కాసేపటికే పర్యటన రద్దవ్వడం కాంగ్రెస్‌ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

Rahul Gandhi: రాహుల్‌ గాంధీ వరంగల్‌ పర్యటన ఖరారు.. రద్దు

  • ఆకస్మిక నిర్ణయంపై కాంగ్రెస్‌ శ్రేణుల్లో అయోమయం

  • పార్లమెంట్‌ సమావేశాలా? పార్టీ అంతర్గత పరిణామాలా ? అని చర్చ

వరంగల్‌, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): లోకసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వరంగల్‌ పర్యటన రద్దు అయింది. మంగళవారం జరగాల్సిన ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైన కాసేపటికే పర్యటన రద్దవ్వడం కాంగ్రెస్‌ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. రాహుల్‌ గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్‌పై మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు ప్రకటన వచ్చింది. దాని ప్రకారం.. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్న రాహుల్‌.. ఆరు గంటలకు హెలికాప్టర్‌లో వరంగల్‌ వెళ్లాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణనపై సంబంధిత వర్గాలతోనూ, తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై పార్టీ నేతలతో ఆయన మాట్లాడతారని పేర్కొన్నారు. అనంతరం రాత్రి 7.50గంటలకు వరంగల్‌ నుంచి తమిళనాడు ఎక్స్‌ప్రె్‌స(12622)లో చెన్నై వెళ్లాల్సి ఉంది.


రాహుల్‌ గాంధీ వరంగల్‌ వస్తున్నారని తెలియడంతో స్థానిక కాంగ్రెస్‌ శ్రేణులు ఏర్పాట్లు కూడా చేశారు. కానీ, మధ్యాహ్నం 1.30 గంటలప్పుడు పర్యటన రద్దయిందని ప్రకటన వచ్చింది. ఈ పర్యటన రద్దుకు పలు కారణాలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్‌లో బుధవారం కీలకమైన అంశాలపై చర్చ ఉండటంతో రాహూల్‌ గాంధీ తన పర్యటనను రద్దు చేసుకున్నారని పలువురు నేతలు చెప్పారు. ఛత్తీ్‌సగఢ్‌లో 31మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో తమిళనాడు ఎక్స్‌ప్రె్‌సలో రాహుల్‌ ప్రయాణానికి భద్రతా వర్గాలు అంగీకరించకపోవడంతో పర్యటన రద్దయిందనే మరికొందరు అంటున్నారు. ఇక, పార్టీలో అంతర్గత విభేదాల మూలంగా రాహూల్‌ తన పర్యటనను రద్దు చేసుకున్నారనే ప్రచారం కూడా ఉంది. టీపీసీసీ అధ్యక్షుడు మినహా ముఖ్యనేతలెవ్వరూ ఈ పర్యటనలో తనతో ఉండకూడదని రాహుల్‌ గాంధీ స్పష్టం చేసినట్లుగా తెలిసింది. అయితే, దీనివల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని రాష్ట్ర కమిటీ నుంచి వెళ్లిన నివేదికలతో రాహుల్‌ పర్యటన రద్దు చేసుకున్నారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతుంది.

Updated Date - Feb 12 , 2025 | 04:22 AM