Secretariat: సచివాలయంలో ప్రొటోకాల్ భోజనం మారింది!
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:38 AM
రాష్ట్ర సచివాలయంలోని ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర అధికారుల కార్యాలయాలకు ప్రొటోకాల్ విభాగం ఆధ్వర్యంలో అందించే భోజనం మారింది.

భోజన నాణ్యతపై సీఎం ఆరా.. మార్చాలని అధికారులకు ఆదేశం
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
హైదరాబాద్/కరీంనగర్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సచివాలయంలోని ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర అధికారుల కార్యాలయాలకు ప్రొటోకాల్ విభాగం ఆధ్వర్యంలో అందించే భోజనం మారింది. ఆయా పేషీల అధికారులు, ఉద్యోగులకు అందుతున్న భోజనం నాసిరకంగా ఉందంటూ అసంతృప్తులు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ‘ఆ భోజనం మాకొద్దు బాబోయ్!’ శీర్షికన ఈనెల 19న ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి.. సచివాలయంలో ప్రోటోకాల్ విభాగం పర్యవేక్షణలో అందిస్తున్న భోజనం, దాని నాణ్యతపై ఆరా తీశారు. దీనిపై విచారణ చేపట్టాలని సాధారణ పరిపాలన శాఖ అఽధికారులను ఆదేశించారు. ఆ విచారణలో పలు పేషీల్లో భోజనం నాసిరకంగా వస్తుందన్న విషయాన్ని గుర్తించిన అధికారులు.. అదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించారు.
ఈ నేపథ్యంలో నాణ్యమైన భోజనాన్ని అందించాలని సీఎం అధికారులకు సూచించినట్టు తెలిసింది. ఆయన సూచనలతో సాయంత్రం అందించే చిరుతిళ్లులోనూ మార్పులు జరిగాయి. దీంతో ఆయా పేషీల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కాలిన గాయాలతో లేవలేని స్థితిలో మంచానికే పరిమితమైన సలీమాను ఆదుకోవాలని సీఎం అఽధికారులను ఆదేశించారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం గుండ్ల సింగారం గ్రామానికి చెందిన సలీమా దీన స్థితిలో ఉండటం.. ఆమెకు పదేళ్ల కూతురు రిజ్వాన అన్ని సపర్యలు చేస్తుండటం తెలిసి చలించిపోయారు. తక్షణమే సలీమాకు తగిన వైద్యసాయాన్ని అందించడంతో పాటు దివ్యాంగుల పింఛన్, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కాగా 24న సీఎం రేవంత్ కరీంనగర్ జిల్లాలో పర్యటించబోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.