Endowments: దేవాదాయశాఖలో డిప్యూటేషన్ల దుమారం!
ABN , Publish Date - Jun 15 , 2025 | 05:20 AM
దేవాదాయ శాఖలోకి ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి డిప్యూటేషన్లు చేపట్టాలన్న నిర్ణయం దుమారం రేపుతోంది. ఇప్పటికే రెవెన్యూ విభాగం నుంచి కొందరు అధికారులను డిప్యూటేషన్ పై తీసుకురావడాన్ని తప్పుపడుతున్న దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది..
ఈవోల నుంచి డిప్యూటీ కమిషనర్ల వరకు.. ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్లతో భర్తీకి నిర్ణయం
ఆయా విభాగాలకు లేఖ రాసిన దేవాదాయ శాఖ
ఇది సర్వీస్ రూల్స్‌కు విరుద్ధమంటున్న అధికారులు
ఉపసంహరించుకోకుంటే ఆందోళన తప్పదని హెచ్చరిక
సొంతశాఖలో పదోన్నతులతో భర్తీ చేయాలని డిమాండ్
హైదరాబాద్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): దేవాదాయ శాఖలోకి ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి డిప్యూటేషన్లు చేపట్టాలన్న నిర్ణయం దుమారం రేపుతోంది. ఇప్పటికే రెవెన్యూ విభాగం నుంచి కొందరు అధికారులను డిప్యూటేషన్ పై తీసుకురావడాన్ని తప్పుపడుతున్న దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది.. తాజాగా మరికొందరు అధికారులను డిప్యూటేషన్‌పై తీసుకోవాలని నిర్ణయించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలను వెంటనే నిలిపేయాలని, దేవాదాయ శాఖలోనే పదోన్నతులతో పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సర్వీస్ రూల్స్‌కు విరుద్ధమంటూ ఆగ్రహం
ఈవో నుంచి డిప్యూటీ కమిషనర్ స్థాయి పోస్టుల్లోకి.. పట్టణ పరిపాలనతోపాటు ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి అధికారులను డిప్యూటేషన్‌పై తీసుకోవాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అర్హులైన అధికారులను పంపాలంటూ దేవాదాయశాఖ డైరెక్టర్ వెంకటరావు రెండు రోజుల క్రితం ఆయా విభాగాలకు లేఖలు రాశారు. డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఈవో గ్రేడ్-1, గ్రేడ్-2 పోస్టులకు సంబంధించి దేవాదాయశాఖ చెల్లిస్తున్న వేతనాలకు సమాన వేతనం పొందుతున్న, ఈ పోస్టులకు అర్హులైన అధికారులను డిప్యూటేషన్‌పై విధులు నిర్వహించేందుకు పంపించాలని కోరారు. ఖాళీలు భర్తీ అయ్యాక వారిని తిరిగి సొంత విభాగానికి పంపిస్తామని తెలిపారు. అయితే దీనిపై దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది మండిపడుతున్నారు. ఇతర విభాగాల నుంచి సిబ్బందిని దేవాదాయ శాఖలోకి డిప్యూటేషన్‌పై తీసుకోవద్దని సర్వీస్ రూల్స్‌లో స్పష్టంగా ఉందని చెబుతున్నారు. ఇతర విభాగాల నుంచి డిప్యూటేషన్ల ఆలోచనను విరమించుకోవాలని, లేకుంటే ఆందోళన తప్పదని హెచ్చరిస్తున్నారు.
పదోన్నతులిస్తే సమస్య పరిష్కారం
దేవాదాయ శాఖలో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. అర్హులు ఉన్నా కూడా ఏళ్ల తరబడి పదోన్నతులు కల్పించకపోవడంతో ఖాళీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఉద్యోగుల సీనియారిటీని తేల్చి పదోన్నతులు కల్పించాలని హైకోర్టు సుమారు ఏడాదిన్నర క్రితం ఓ కేసు విచారణ సమయంలో ఆదేశించింది కూడా. అయినా ఆ ప్రక్రియను దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటివరకు చేపట్టలేదు. దేవాదాయ శాఖలో డిప్యూటీ కమిషనర్ పోస్టులు ఏడు ఉంటే.. ఇద్దరు రెగ్యులర్, ముగ్గురు తాత్కాలిక (అడ్‌హాక్) పద్ధతిలో కొనసాగుతున్నారు. మిగత రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ కమిషనర్ స్థాయిలో 28 పోస్టులకుగాను 14 ఖాళీగా ఉన్నాయి. ఈ నెలాఖరున మరో ఇద్దరు పదవీ విరమణ చేయనున్నారు. ఇక గ్రేడ్-1, గ్రేడ్-2 ఈవోల పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. సొంత శాఖలో ఏళ్ల తరబడి పదోన్నతులు కల్పించకుండా.. పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ ఇతర శాఖల నుంచి అధికారులను డిప్యూటేషన్‌పై తీసుకురావడం ఏమిటని దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. కేవలం కొందరికి మేలు చేసేందుకే సీనియారిటీ జాబితాను తేల్చడం లేదని.. దీనితో అర్హులకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం, ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించి, పదోన్నతులు చేపడితే సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. 27 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా..
మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
For National News And Telugu News