Share News

Hyderabad: అగమ్య ప్రయాణం!

ABN , Publish Date - Feb 13 , 2025 | 04:11 AM

హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో 3-4 రోజులుగా జరుగుతున్న తతంగమిది. రవాణా శాఖ అధికారుల తనిఖీలతో బెంబేలెత్తుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల డ్రైవర్లు.. ప్రయాణికులను మార్గమధ్యంలోనే వదిలేస్తున్నారు.

Hyderabad: అగమ్య ప్రయాణం!

  • ఆర్టీఏ తనిఖీలతో హైదరాబాద్‌ శివార్లలోనే ఆగుతున్న ప్రైవేటు బస్సులు

  • వేళ కాని వేళ నడిరోడ్డుపై దింపేస్తుండటంతో ప్రయాణికులకు ఇక్కట్లు

  • నాలుగు రోజుల్లో 13 బస్సులను సీజ్‌ చేసిన ఆర్టీఏ అధికారులు

వనస్థలిపురం వద్ద తనిఖీలు జరుగుతుండడంతో తెల్లవారు జామున హయత్‌నగర్‌ వద్దనే ఓ బస్సు ప్రయాణికులను దించింది. ఇదేంటని అడిగితే.. ముందుకెళితే బస్సు సీజ్‌ చేస్తారు. కావాలంటే టికెట్‌ బుక్‌ చేసుకున్న దగ్గర మాట్లాడుకోవాలని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.

హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో 3-4 రోజులుగా జరుగుతున్న తతంగమిది. రవాణా శాఖ అధికారుల తనిఖీలతో బెంబేలెత్తుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల డ్రైవర్లు.. ప్రయాణికులను మార్గమధ్యంలోనే వదిలేస్తున్నారు. దీంతో గమ్యం చేరేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రవాణా శాఖ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రవాణా శాఖ సీజనల్‌ తనిఖీల వల్లే ప్రైవేటు ట్రావె ల్స్‌ ఆపరేటర్లు ఇష్టానికి వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతి, దసరా వంటి పండుగలు, పలు ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అధికారులు జోరుగా తనిఖీలు నిర్వహిస్తుంటారు. అనంతరం షరా ‘మామూలే’.. దీనిని అవకాశంగా మార్చుకుంటున్న ప్రైవేటు ట్రావెల్‌ సంస్థలు పర్మిట్‌ లేకుండానే యథేచ్ఛగా బస్సులు తిప్పుతున్నాయి. దీంతో రవాణా శాఖ ఆదాయానికి రూ.కోట్లలో గండి పడుతోంది. అయినా అధికారులు పట్టించుకోరు. కారణం.. వారి ‘లెక్కలు’ వారికుండడమే.. ఉన్నతస్థాయి ఫిర్యాదుల నేపథ్యంలో ఎట్టకేలకు కదిలిన యంత్రాంగం తాజాగా తనిఖీలు మొదలుపెట్టింది.. విజయవాడ, బెంగళూరు, నాగ్‌పూర్‌ మార్గాల్లో అనుమతి లేని 13 బస్సులను సీజ్‌ చేసింది.


15-20 కిలోమీటర్ల దూరంలోనే..

హైదరాబాద్‌ నుంచి ఏపీలోని పలు జిల్లాలు, బెం గళూరు, నాగ్‌పూర్‌, ముంబై, షిర్డీ తదితర ప్రాంతాలకు నిత్యం 400 ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. వారాంతాల్లో వీటి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. నిబంధనల ప్రకారం రవాణా శాఖ పర్మిట్‌ ఉన్న బస్సుల్లోనే ప్రయాణికులను తీసుకెళ్లాలి. కానీ కొన్ని సంస్థలు అనుమతి లేని బస్సుల్లో తరలిస్తున్నాయి. తాజాగా తనిఖీల నేపథ్యంలో హైదరాబాద్‌కు 15-20 కిలోమీటర్ల దూరంలోనే బస్సు ఆపరేటర్లు ప్రయాణికులను వదిలేస్తున్నారు. తెల్లవారుజామున 4-5 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌ ఆవల నడిరోడ్డుపై దింపుతున్నారు. ఆ సమయంలో వాహనాలు అందుబాటులో లేక గమ్యస్థానాలకు చేరేందుకు పిల్లలు, లగేజీతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. హయత్‌నగర్‌, వనస్థలిపురం వద్ద దిగిన ప్రయాణికులు కూకట్‌పల్లికి చేరుకోవాలంటే 40 కి.మీ.ల మేర ప్రయాణించాలి. చందానగర్‌, బీహెచ్‌ఈఎల్‌ వెళ్లే వారు 50-60 కి.మీలు వెళ్లాల్సిందే.. ‘తెల్లవారుజామున వాహనాలు అందుబాటు లో లేక హయత్‌నగర్‌ నుంచి చందానగర్‌కు కుటుంబంతో వచ్చేందుకు రెండున్నర గంటలు పట్టింది. అదనంగా రూ.1,200 చెల్లించాల్సి వచ్చింది’ అని ఇటీవల ఇబ్బందులు పడ్డ చందానగర్‌కు చెందిన ఓ ప్రయాణికుడు వాపోయారు.


అప్పుడప్పుడు హడావుడి..

నిబంధనల ప్రకారం బస్సులు నడుపుతున్నారా..? లేదా..? అన్నది గుర్తించేందుకు రవాణా శాఖ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించాలి. కానీ అప్పుడప్పుడు వారం, పది రోజులు హడావుడి చేసి మిన్నకుంటారు. దీంతో ఆ పది రోజులు వారికి చిక్కకుండా ఉంటే చాలు.. రూ.లక్షలు వెచ్చించి పర్మిట్‌ తీసుకోవడం ఎందుకన్న యోచనలో మెజార్టీ ప్రైవే టు ట్రావెల్స్‌ సంస్థలున్నాయి. సంక్రాంతి సమయంలోనూ విస్తృతంగా అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించడం లేదంటూ 400 కేసులు నమోదు చేశారు. సీజన్‌ ముగిసిందని భా వించిన నిర్వాహకులు పర్మిట్‌ లేని బస్సులను తిప్ప డం ప్రారంభించారు. కొన్ని సంస్థలు పర్మిట్‌ ఉన్న బస్సు నంబర్‌ను రెండు, మూడు వాహనాలకు వినియోగిస్తున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. గతంలో ఔటర్‌ ఆవలికే ట్రావెల్స్‌ బస్సులు పరిమితం కావాలని ఆదేశాలిచ్చారు. అయినా పలు కారణాలతో పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదు. నిబంధనల మే రకు రాత్రి 10 గంటల తర్వాత, ఉదయం 8 గంటల్లోపు ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు హైదరాబాద్‌ రోడ్లపై రాకపోకలు సాగించాలి. కొంతకాలంగా తనిఖీలు లేకపోవడంతో ఎప్పుడు పడితే అప్పుడు బస్సులను రోడ్ల మీదకు తెస్తుండటంతో ట్రాఫిక్‌ సమస్యలతో వాహనదారులు సతమతమవుతున్నారు.

- ఆంధ్రజ్యోతి-హైదరాబాద్‌ సిటీ

Updated Date - Feb 13 , 2025 | 04:11 AM