Suicide Case: ప్రత్యూష భర్త, ఆయన ప్రియురాలు, అత్తామామ అరెస్టు
ABN , Publish Date - Jul 16 , 2025 | 03:34 AM
దంతవైద్యురాలు ప్రత్యూష ఆత్మహత్యకు కారకులయ్యారనే ఆరోపణలకు సంబంధించి ఆమె భర్త డాక్టర్ సృజన్‌ను, అత్తామామలు అల్లాడి మధుసూదన్.
ఇన్‌స్టా ఇన్‌ప్లుయెన్సర్‌తో భర్త చనువుగా ఉండటంపై ప్రత్యూష మనస్తాపం
చెప్పినా పట్టించుకోని అత్తామామలు
ప్రత్యూష ఆత్మహత్య కేసులో వివరాలు వెల్లడించిన కాజీపేట ఏసీపీ
హసన్‌పర్తి, జూలై 15 (ఆంధ్రజ్యోతి): దంతవైద్యురాలు ప్రత్యూష ఆత్మహత్యకు కారకులయ్యారనే ఆరోపణలకు సంబంధించి ఆమె భర్త డాక్టర్ సృజన్‌ను, అత్తామామలు అల్లాడి మధుసూదన్, పుణ్యవతి దంపతులను, సృజన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్‌స్ట్రాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ బానోతు శ్రుతిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌లో కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి మంగళవారం మీడియాకు వివరాలను వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. వరంగల్ మట్టెవాడకు చెందిన తంజావూరు పద్మావతి విజయ్‌కుమార్ దంపతుల కూతురు ప్రత్యూష (35)ను హసన్‌పర్తికి చెందిన మధుసూదన్ పుణ్యవతి దంపతుల చిన్నకుమారుడు డాక్టర్ సృజన్‌కు ఇచ్చి 2017లో పెళ్లి జరిపించారు. వివాహ సమయంలో కట్నకానుకల కింద సృజన్‌కు ప్రత్యూష తల్లిదండ్రులు రూ.30 లక్షల నగదు, 30 తులాల బంగారం, కారు ఇచ్చారు. సృజన్-ప్రత్యూషకు జానూష (7), జైస్వీకాస్ (7 నెలలు) కూతుళ్లున్నారు. సృజన్ వరంగల్ కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కార్టియాలజిస్టు, సిటిసర్జన్‌గా పనిచేస్తున్నారు. ప్రత్యూష ఆరెపల్లిలోని ఎన్‌ఎ్‌సఆర్ అపోలో ఆస్పత్రిలో దంతవైద్యురాలిగా చేస్తున్నారు. సృజన్ పనిచేస్తున్న మెడికవర్ ఆస్పత్రి నిర్వాహకులు ఏడాది క్రితం ఆస్పత్రిలో పనిచేస్తున్న స్పెషలిస్టు డాక్టర్లను ఇంటర్వ్యూ చేసేందుకు హనుమకొండ రెవెన్యూ కాలనీకి చెందిన బానోతు శ్రుతిని పిలిపించారు. అప్పటి నుంచి సృజన్-శ్రుతి మధ్య పరిచయం పెరిగింది. ఇద్దరూ చాటింగ్ చేసుకునేవారు. ఈ విషయంలో ప్రత్యూష-సృజన్ మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని ప్రత్యూష తన అత్తామామలకు చెప్పినప్పటికీ పట్టించుకోకపోగా ఆయన్నే సమర్థించడంతో ఆమె మనస్తాపం చెందారు. అంతేకాకుండా బానోతు శ్రుతి తనతో మాట్లాడిన తీరూ ఆమెను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ఈ నెల 12వ తేదీ శ నివారం సృజన్ తల్లిదండ్రులు... జానూష, జైస్వీకా్‌సను తీసుకొని భద్రాచలంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. 13న సృజన్ తన స్నేహితులతో కలిసి బొగత జలపాతానికి వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. ఆయన రాగానే ప్రత్యూష గదిలోకి వెళ్ళి గడియవేసుకున్నారు. భర్త వెళ్లి పిలిచినప్పటికీ ఆమె నుంచి సమాధానం రాలేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా ప్రత్యూష చీరతో ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. సృజన్ వెంటనే తన స్నేహితులైన శివరామ్ దంపతులను పిలిచి తలుపు పగులగొట్టి ప్రత్యూషను ఆరెపల్లిలోని ఎన్‌ఎ్‌్‌సఆర్ ఆపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రత్యూష తల్లి పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హసన్‌పర్తి పోలీసులు భర్త సృజన్, అత్తామామలు మధుసూదన్ పుణ్యవతి, బానోతు శ్రుతిపై కేసు నమోదు చేశారు. మంగళవారం వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.