Ponnam Prabhakar: రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి హరీశ్ రావుకు లేదు: పొన్నం
ABN , Publish Date - Oct 27 , 2025 | 04:44 PM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి హరీశ్ రావుకు లేదని హరీశ్ మండిపడ్డారు. ఆటో డ్రైవర్లను ఆదుకునే బాధ్యత తమదని చెప్పారు. కేబినెట్‌పై హరీశ్ రావు చేసిన ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 27: బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి హరీశ్ రావుకు లేదని మండిపడ్డారు. ఆటో డ్రైవర్లను ఆదుకునే బాధ్యత తమదని చెప్పారు. కేబినెట్ పై హరీశ్ రావు చేసిన ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు. డైవర్షన్ పాలిటిక్స్ ను హరీష్ రావు బంద్ చేయాలని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కంటోన్మెంట్ ఫలితాలు రిపీట్ కాబోతున్నాయని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ లో తమ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతుందన్నారు.
అంతకముందు హరీశ్ రావు ఏమన్నారంటే?
హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ నుండి తెలంగాణ భవన్ వరకు హరీశ్ ఆటోలో ప్రయాణించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓడిపోతే కనీసం రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుందని.. ఆటో కార్మికులకు ఇస్తానన్న హామీలు నెరవేరుస్తారని బీఆర్ఎస్ మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 12000 ఇస్తామని మోసం చేసిందని దుయ్యబట్టారు. వెంటనే బాకీ పడ్డ రూ.24 వేలను ప్రతి ఆటో డ్రైవర్‌కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తం ఆటో కార్మికులకు రెండు సంవత్సరాల బాకీ చెల్లించినా రూ. 1500 కోట్లు అవుతుందని చెప్పారు. రూ. 3 లక్షలు ఫీజు పెంచితే మద్యం టెండర్లపై రూ. 3 వేల కోట్లు ప్రభుత్వానికి వచ్చాయన్నారు. అందులో నుంచి రూ. 1500 కోట్లు ఆటో కార్మికులకు ఇచ్చి ఆటో కార్మికులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు 161 ఆటో కార్మికులు చనిపోయారని.. చనిపోయిన ఆటో డ్రైవర్ కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Telangana: విషాదం.. టూత్‌పేస్ట్ అనుకొని ఎలుకల మందు తిని చిన్నారి మృతి
Bandi Sanjay: ఆ మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలి.. బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు