Ponguleti: పేదలందరికీ ఇళ్లు కట్టించాకే ఓట్లడుగుతాం
ABN , Publish Date - Jun 22 , 2025 | 04:37 AM
రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టించాకే తాము ఓట్లడుగుతామని, అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.
బీఆర్‌ఎస్ పదేళ్లలో చేయలేనివి 10 నెలల్లో చేసి చూపాం
రాబోయే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను దీవించండి
భూ సమస్యలపై 8.58 లక్షల దరఖాస్తులు: పొంగులేటి
గుండాల/హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టించాకే తాము ఓట్లడుగుతామని, అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. శనివారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తొలుత జగ్గుతండా గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. తర్వాత గుండాలలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో, హైదరాబాద్‌లోని సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగానూ ఆయన మాట్లాడారు. పేదల కలలను సాకారం చేసే దిశగా ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేనివి తమ ప్రభుత్వం పది నెలల్లో చేసి చూపిందన్నారు.
రెండో విడత ఇళ్ల మంజూరును త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. పోడు రైతులను అటవీ అధికారులు ఇబ్బందులు పెడితే సహించబోమన్నారు. రాబోయే రోజుల్లో జరిగే ప్రతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను దీవించాలని ప్రజలను కోరారు. దశాబ్దకాలంపాటు విధ్వంసమైన రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. పదేళ్లలో రైతులు ఎదుర్కొన్న సమస్యలు చెప్పుకోవడానికి రెవెన్యూ సదస్సులు దోహదపడ్డాయని చెప్పారు. జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు 561 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని తెలిపారు. మొత్తంగా మూడు విడతల్లో 593 మండలాల్లో 10,725 రెవెన్యూ సదస్సులు నిర్వహించగా 8.58 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 67 వేలు, భద్రాది కొత్తగూడెంలో 61 వేలు, వరంగల్‌లో 54 వేలు, జయశంకర్ భూపాలపల్లిలో 48 వేలు, నల్లగొండ జిల్లాలో 42 వేల దరఖాస్తులు వచ్చాయని వివరించారు. వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటి వరకు 3.27 లక్షలు ఆన్‌లైన్‌లో నమోదు చేశామన్నారు. సాదాబైనామా తప్ప మిగిలిన అన్ని సమస్యలకు సంబంధించి 60 శాతం దరఖాస్తులకు పరిష్కారం చూపినట్లు ఆయన చెప్పారు.