Share News

Caste Census: తెలంగాణ సర్కార్‌ విజయం

ABN , Publish Date - May 01 , 2025 | 04:04 AM

జనాభా లెక్కలతో పాటే కులగణన చేపడతామని కేంద్రం ప్రకటించడంపై పలువురు రాజకీయ నేతలు, బీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.

Caste Census: తెలంగాణ సర్కార్‌ విజయం

  • కేంద్రం కులగణనపై మంత్రి పొన్నం

  • ముస్లింల వెనుకబాటుతనం స్పష్టమవుతుంది: ఒవైసీ

  • ప్రతిపక్షాల విజయం: కూనంనేని

  • కులగణన నిర్ణయం బీసీల పోరాట ఫలితమే: జాజుల

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): జనాభా లెక్కలతో పాటే కులగణన చేపడతామని కేంద్రం ప్రకటించడంపై పలువురు రాజకీయ నేతలు, బీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టడం ద్వారా సామాజిక, ఆర్థిక, విద్య రంగాల్లో ముస్లింల వెనుకబాటుతనం స్పష్టమవుతుందని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. 2021 నుంచి మజ్లిస్‌ కులగణన చేపట్టాలని డిమాండ్‌ చేస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో కులగణనను అమలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి బుధవారం ఎక్స్‌ వేదికగా ఒవైసీ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం కులగణన చేపడతామని నిర్ణయించడం తెలంగాణ ప్రభుత్వ విజయమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కులగణన చేసి దేశానికి దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. బీసీ సంఘాల పోరాట ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.


జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయించడం ప్రతిపక్షాల విజయం అని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇప్పటికే కులగణన సర్వే చేపట్టి తెలంగాణ దేశానికి మార్గదర్శిగా నిలిచిందని జనగణనలో కులగణన చేయాలని కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైందని రాజ్యసభ సభ్యుడు ఆర్‌ కృష్ణయ్య అన్నారు. జనాభా లెక్కల ప్రక్రియలో కులగణన చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ బీసీ కమిషన్‌ స్వాగతిస్తుందని కమిషన్‌ చైర్మన్‌ జి.నిరంజన్‌ పేర్కొన్నారు. జనాభా లెక్కల్లో కులగణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకమని రాష్ట్ర బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. కులగణనతో భవిష్యత్‌లో రాజకీయ ముఖ చిత్రం మారుతుందని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసుసురేశ్‌ అన్నారు.


ఇది మా విజయం:మహేశ్‌గౌడ్‌

కులగణనపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం.. తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయం అని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ అన్నారు. జనగణనతో పాటు కులగణన నిర్వహిస్తామంటూ కేంద్రం ప్రకటించడం హర్షణీయమన్నారు. కాగా.. రాహుల్‌ గాంధీ ఒత్తిడికి తలొగ్గి.. జనగణనతో పాటు కులగణననూ చేపట్టాలని కేంద్రం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ అన్నారు.


Also Read:

BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్‌ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ

Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..

Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..

Updated Date - May 01 , 2025 | 04:04 AM