Share News

చిన్నారి ప్రాణం తీసిన పల్లీ గింజ

ABN , Publish Date - Apr 29 , 2025 | 05:21 AM

పల్లీ గింజ ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయి తన్విక అనే నాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. ఈ ఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలో జరిగింది.

చిన్నారి ప్రాణం తీసిన పల్లీ గింజ

  • ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయి మృతి

అబ్దుల్లాపూర్‌మెట్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): పల్లీ గింజ ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయి తన్విక అనే నాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. ఈ ఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలో జరిగింది. లష్కర్‌గూడలో నివాసం ఉంటున్న బండారి శ్యామ్‌సుందర్‌, మహేశ్వరి దంపతులకు తన్విక ఒక్కగానొక్క కూతురు. ఆదివారం సాయంత్రం ఇంట్లో వేయించిన పల్లీలను తల్లిదండ్రులతో కలిసి తిన్నది. ఈ క్రమంలో చిన్నారి తన్విక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడం గమనించిన తల్లి మహేశ్వరి అదే రోజు రాత్రి నీలోఫర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు.


పరీక్షించిన వైద్యులు ఊపిరితిత్తుల్లో పల్లీ గింజ ఇరుక్కుపోయిందని తెలిపారు. ఆపరేషన్‌ చేసి తొలగించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. కాగా సోమవారం ఉదయం చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 29 , 2025 | 05:21 AM