Share News

NHM Telangana Salary Reduction: వైద్యశాఖలో చిరుద్యోగులకు షాక్‌

ABN , Publish Date - Jul 20 , 2025 | 02:40 AM

ఆయన పేరు గౌరీ శంకర్‌. హైదరాబాద్‌లోని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కార్యాలయంలో

NHM Telangana Salary Reduction: వైద్యశాఖలో చిరుద్యోగులకు షాక్‌
NHM Telangana Salary Reduction

  • ఎన్‌హెచ్‌ఎమ్‌ సిబ్బంది జీతాల్లో భారీ కోత

  • సుమారు 10 వేల మందికి వేతనాలు కట్‌

  • ఒక్కొక్కరికి రూ.7-9 వేల వరకు తగ్గింపు

  • అంతా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందే

హైదరాబాద్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ఆయన పేరు గౌరీ శంకర్‌. హైదరాబాద్‌లోని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కార్యాలయంలో 18 ఏళ్లుగా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారు. కమిషనర్‌ పేషీలో చిరుద్యోగి. జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎమ్‌)లో 2007లో చేరారు. మొన్నటిదాకా ఆయనకు నెలకు రూ.22 వేలు జీతం వచ్చింది. ఉన్నట్టుండి ఆయన వేతనంలో రూ.7వేలు కోత పెట్టారు. ఇది ఒక్క గౌరీ శంకర్‌ సమస్యనే కాదు. రాష్ట్రంలోని జాతీయ ఆరోగ్య మిషన్‌లో పనిచేస్తున్న మెజారిటీ ఉద్యోగుల ఆవేదన. తెలంగాణలో ఎన్‌హెచ్‌మ్‌ కింద 23 రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటిలో 51,451 మంది పనిచేస్తున్నారు. ఇందులో 31 వేల మంది ఆశా కార్యకర్తలు. మిగిలిన 20వేల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులే. వీరిలో రూ.10,400 నుంచి మొదలుకొని రూ.లక్ష వరకు వేతనం పొందేవారున్నారు. ఇందులో మెజారిటీ ఉద్యోగుల వేతనాలు రూ.10,400 నుంచి రూ.25 వేలలోపు ఉన్నాయి. ఎన్‌హెచ్‌ఎమ్‌లో పనిచేసే ఉద్యోగుల సర్వీసును ఏటా పొడిగిస్తూ కొనసాగింపు ఉత్తర్వులను జారీ చేస్తారు. ఇది ఏటా జరిగే తంతే. అయితే ఈ ఏడాది కొనసాగింపు జీవో దాదాపు 3 నెలలు ఆలస్యంగా వచ్చింది. ఏప్రిల్‌లో రావాల్సిన జీవో జూలై 19న విడుదలైంది. ఆ జీవోలో ఆయా ఉద్యోగుల క్యాడర్‌ కింద ఎంత వేతనం చెల్లిస్తున్నారో కూడా సర్కారు పేర్కొంది. అందులో ఆయా క్యాటగిరీల కింద పని చేసే ఉద్యోగులు తమ వేతనాలు ఎంతున్నాయో చూసుకుని కంగుతిన్నారు. అందులో మెజారిటీ ఉద్యోగుల జీతం సుమారు రూ.7-9 వేల మధ్య తగ్గి ఉంది. ఈ స్థాయిలో కోత పడిన వారి సంఖ్య సుమారు 10 వేలు ఉంటుందని వైద్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి ఏటా తదుపరి కొనసాగింపు జీవో ఆర్థిక శాఖ నుంచి విడుదలవుతుంది. అయితే ఇప్పటి వరకు ఉద్యోగాల సంఖ్యతో పాటు కొనసాగింపునకు సంబంధించిన వివరాలే ఉత్తర్వుల్లో ఉండేవి. తొలిసారిగా ఎన్‌హెచ్‌ఎమ్‌ కింద పని చేసే అన్ని క్యాటగిరీలకు సంబంఽధించిన ఉద్యోగులు, వారి హోదా, ఏ కార్యక్రమం కింద పనిచేస్తున్నారు, వారికి ఎంత వేతనం చెల్లించబోతున్నారన్న వివరాలన్నీ ఆ జీవోలో పేర్కొన్నారు. దాంతో తమ వేతనాల్లో కోత పడిన విషయాన్ని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు గుర్తించారు. అలాగే కొన్ని ఉద్యోగాలను తొలగించినట్లు చెబుతున్నారు.ఎన్ని ఉద్యోగాలకు కోత పెట్టారు? ఏ విభాగంలో కట్‌ చేశారు? అన్నది త్వరలోనే బయటకొస్తుందని అంటున్నారు.


ఎందుకిలా అంటే..?

ఎన్‌హెచ్‌ఎమ్‌లో పరిధిలోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల.. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాల మధ్య వ్యత్యాసం ఉంది. ఎన్‌హెచ్‌ఎమ్‌ ఉద్యోగులకు ఏటా 5 శాతం పెంపు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తే అందుకు తగ్గట్లుగానే రాష్ట్రంలోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వేతనాల్లోనూ పెంపు ఉంటుంది. అయితే రాష్ట్ర ఉద్యోగులతో పోలిస్తే ఎన్‌హెచ్‌ఎమ్‌ వారి వేతనాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈసారి ప్రభుత్వ శాఖల్లో పని చేసే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వర్తించే జీవోనే ఎన్‌హెచ్‌ఎమ్‌ ఉద్యోగులకు వర్తింపజేసేలా(ఆన్‌ పార్‌ విత్‌ గవర్నమెంట్‌ జీవో) తాజా ఉత్తర్వులను విడుదల చేశారు. రాష్ట్ర సర్కారీ ఒప్పంద ఉద్యోగుల మాదిరిగానే వీరు కూడా ఆ జాబితాలో చేరిపోయారు. దాంతో ఒక్కసారిగా వారి వేతనాల్లో కోతపడింది.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్

Read Latest Telangana News and National News

Updated Date - Jul 20 , 2025 | 02:40 AM