Share News

Anna Lezinova: తిరుమలలో పవన్‌ భార్య తలనీలాల సమర్పణ

ABN , Publish Date - Apr 14 , 2025 | 03:42 AM

డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. ఇటీవల వీరి కుమారుడు మార్క్‌ శంకర్‌ అగ్నిప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన విషయం తెలిసిందే.

Anna Lezinova: తిరుమలలో పవన్‌ భార్య తలనీలాల సమర్పణ

  • డిక్లరేషన్‌పై డిప్యూటీ సీఎం పవన్‌ సతీమణి సంతకం

  • మార్క్‌ శంకర్‌తో హైదరాబాద్‌ చేరుకున్న పవన్‌

తిరుమల/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. ఇటీవల వీరి కుమారుడు మార్క్‌ శంకర్‌ అగ్నిప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అన్నా లెజినోవా తిరుమల వచ్చారు. గాయత్రి అతిథిగృహానికి చేరుకున్న ఆమెకు టీటీడీ రిసెప్షన్‌ అధికారులు స్వాగతం పలికారు. ఇతర మతానికి చెందిన వ్యక్తి కావడంతో నిబంధనల ప్రకారం హిందూ మతాన్ని గౌరవిస్తున్నానని, తనకు పూర్తి విశ్వాసాలు ఉన్నాయని పేర్కొంటూ డిక్లరేషన్‌పై ఆమె సంతకం చేశారు. అనంతరం క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ వరాహస్వామిని దర్శించుకున్నారు.


అక్కడినుంచి నేరుగా పద్మావతి కల్యాణకట్టకు వెళ్లి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అన్నా లెజినోవా సోమవారం వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని, శ్రీవారిని దర్శించుకోనున్నారు. కాగా, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ తన కుటుంబసభ్యులతో కలసి శనివారం రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన తనయుడు మార్క్‌ శంకర్‌ ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉందని పవన్‌ ‘ఎక్స్‌’వేదికగా తెలిపారు. ప్రమాదం నుంచి తన తనయుడు కోలుకోవాలని ఆకాంక్షించిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Apr 14 , 2025 | 03:42 AM