Pawan Kalyan On Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. జనసేనికులకు ఉపముఖ్యమంత్రి పవన్ దిశానిర్దేశం..
ABN , Publish Date - Sep 27 , 2025 | 10:52 AM
ఎమ్‌జీబీఎస్ బస్టాండ్‌లోకి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది. శుక్రవారం అర్థరాత్రి నుంచి పరిస్థితి దారుణంగా ఉంది. వరద నీరు తగ్గటం లేదు. పక్కనే ఇప్పటికే ఎమ్‌జీబీఎస్ బ్రిడ్జ్ మీద నుంచి వరద నీరు ప్రవహిస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో నిండిపోయాయి. ఇక, హైదరాబాద్ మహా నగరంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మొన్నటి నుంచి ఎడ తెరపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. 30 ఏళ్లలో తొలిసారి మూసీలోకి 38,50 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. మూసీ పరివాహక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. ఎమ్‌జీబీఎస్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అధికారులు బస్టాండ్‌ను ఖాళీ చేయించారు. బస్టాండ్ బయటినుంచి ప్రస్తుతం రాకపోకలు సాగుతున్నాయి.
వరద బాధితులకు అండగా నిలవండి
హైదరాబాద్ వరద పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. హైదరాబాద్ వరద బాధితులకు అండగా నిలవాలంటూ అభిమానులు, జనసేనికులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు డిప్యూటీ సీఎంవో ఆంధ్రప్రదేశ్ ఎక్స్ ఖాతాలో శనివారం ఉదయం ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో.. ‘హైదరాబాద్ నగరంలోనూ, తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో మూసీ వరదతో ఎం.జి. బస్టాండ్, పరిసరాలు నీట మునిగాయని తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు మొదలుపెట్టింది.
ప్రభుత్వ సూచనలను, వాతావరణ హెచ్చరికలను ప్రజలు అనుసరించాలని సూచిస్తున్నాను. వరద బాధితులకు ధైర్యం చెప్పి, వారికి అవసరమైన ఆహారం అందించే సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలంగాణ జనసేన నాయకులు, శ్రేణులకు ఇప్పటికే దిశానిర్దేశం చేయడమైనది’ అని పేర్కొంది. కాగా, పవన్ కల్యాణ్ గత కొద్దిరోజులుగా వైరల్ ఫీవర్‌తో ఇబ్బందిపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే చికిత్స పొందుతున్నారు. గత నాలుగు రోజులుగా బెడ్‌కు పరిమితం అయ్యారు.
ఇవి కూడా చదవండి
మహిళపై ఎద్దు దాడి.. గాల్లోకి ఎత్తి పడేసింది..
ఈ దున్న వెరీ లక్కీ.. సింహాల నుంచి ఎలా తప్పించుకుందో చూస్తే..