Seethakka: పట్టణ రోడ్లకు దీటుగా పల్లెరోడ్లు
ABN , Publish Date - Jun 18 , 2025 | 04:56 AM
పట్టణ రోడ్లకు దీటుగా ప్రజలకు సౌకర్యంగా ఉండేలా.. హ్యామ్(హైబ్రిడ్ యాన్యుటీ మోడల్)విధానంలో పల్లెరోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు.
హ్యామ్ విధానంలో 18,472 కి.మీ రోడ్ల ఆధునికీకరణ
రెండు రోజుల్లో మార్గదర్శకాలు: మంత్రి సీతక్క
హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి) : పట్టణ రోడ్లకు దీటుగా ప్రజలకు సౌకర్యంగా ఉండేలా.. హ్యామ్(హైబ్రిడ్ యాన్యుటీ మోడల్)విధానంలో పల్లెరోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. సచివాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హ్యామ్ విధానంలో గ్రామీణ ప్రాంతాల రోడ్ల నిర్మాణానికి ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించిందని, ఈ ప్రాజెక్టుకు సంబంధించి మార్గదర్శకాలతో రెండు రోజుల్లో జీవో విడుదల చేస్తామన్నారు.
ఈ విధానం ద్వారా రాష్ట్రంలో 18,472 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులను ఆధునికీకరిస్తామని తెలిపారు. అదేవిధంగా ఎంపీడీవోల బదిలీల ఫైలు సీఎం వద్ద ఉందని, వారికి సంబంధించిన వాహనాల భత్యం ఫైల్ ఆర్థిక శాఖ వద్దకు చేరిందని, ఈ రెండు ఫైళ్లకు కొద్దిరోజుల్లో అనుమతి రానుందని మంత్రి సీతక్క వెల్లడించారు.