Pending Applications: సాదాబైనామా లెక్క తేలేనా..!
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:41 AM
సాదాబైనామా దరఖాస్తులకు సర్కారు ఎప్పుడు పరిష్కారం చూపుతుందా అని లక్షల మంది దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. 26న సాదాబైనామా కేసు హైకోర్టులో విచారణకు వస్తున్న నేపథ్యంలో..
పెండింగ్‌లో 9.26 లక్షల దరఖాస్తులు
26న హైకోర్టులో కేసు విచారణ..
12 ఏళ్లు అనుభవంలో ఉన్న వారిని ఎలా గుర్తిస్తారనే దానిపై చర్చ
హైదరాబాద్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): సాదాబైనామా దరఖాస్తులకు సర్కారు ఎప్పుడు పరిష్కారం చూపుతుందా అని లక్షల మంది దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. 26న సాదాబైనామా కేసు హైకోర్టులో విచారణకు వస్తున్న నేపథ్యంలో.. దరఖాస్తుల పరిష్కారానికి అనుమతి వస్తే ఎన్ని పరిగణనలోకి తీసుకుంటారు. పరిష్కారానికి ఎలాంటి విధివిధానాలు పాటిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారికంగా 9.26 లక్షల సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 2020 అక్టోబరు 29న పాత ఆర్వోఆర్ చట్టం రద్దయి కొత్త చట్టం (ధరణి) అమల్లోకి వచ్చింది. దీనికి కొద్దిరోజుల ముందే 2020 అక్టోబరు 12న అప్పటి ప్రభుత్వం జీవో నంబరు 122 జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం.. 2014 జూన్ 2కి ముందు జరిగిన సాదాబైనామా ఒప్పందాలను పరిగణనలోకి తీసుకుంటామని.. అలాంటి వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీనిపై నిర్మల్ రైతు షిండే దేవాదాస్ హైకోర్టులోపిల్ దాఖలు చేశారు. దీంతో స్టే విధించడంతో ఎటూ తేలకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూభారతి చట్టాన్ని తెచ్చింది.
ఆ చట్టంలో సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరిస్తామని స్పష్టం చేసింది. భూసమస్యలపై నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో కొత్తగా 2,42,365 దరఖాస్తులు వచ్చాయి. ఇవి గతంలో దరఖాస్తు చేసుకున్న వారివేనా లేక కొత్తగా వచ్చినవా అనే కోణంలో అధికారులు ఇప్పటికే వివరాలు సేకరించారు. కొత్త వాటిని తిరస్కరించి.. ఆన్‌లైన్‌లో ఉన్న వాటినే ఆమోదిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 9.26 లక్షల సాదాబైనామా దరఖాస్తుల్లో ధరణికి ముందున్న పాత చట్టం రద్దయ్యే సమయానికి వచ్చినవి 2.26 లక్షలు. 2020 అక్టోబరు 29న పాత చట్టం రద్దయి ధరణి అమల్లోకి వచ్చాక వచ్చిన దరఖాస్తులే సుమారు 7 లక్షలు. అయితే అక్టోబరు 28 కటాఫ్ తేదీగా ఉన్నందున అప్పటివరకు వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిష్కరించాలని అధికారులు భావిస్తున్నారు. కోర్టు స్టే అడ్డు ఉండటంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో స్టే ఎత్తేయాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వంమధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది..
12 ఏళ్ల పాటు ఆధీనంలో ఉంటే హక్కులు..
భూభారతి చట్టం సెక్షన్ 6 ప్రకారం 2014 జూన్ 2కి ముందు 12 ఏళ్ల పాటు భూమి తమ ఆధీనంలో ఉన్నట్లు ఆధారాలు చూపిన చిన్న, సన్నకారు రైతులకు సాదాబైనామా క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వనున్నారు. రిజిస్ట్రేషన్ చట్టానికి భిన్నంగా సాదాబైనామా దరఖాస్తుల సమస్యను పరిష్కరించాల్సి ఉన్నందున ఈ నియమాన్ని పెట్టాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. అయితే సాగుదారులను గుర్తించేందుకు పహాణీలో సాగు కాలంలో ఉన్న వివరాలతోపాటు క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారుల పంచనామా నివేదిక, భూమిపై తీసుకున్న వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ వంటి వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
లైసెన్సు తీసుకున్న కేబుల్ తప్ప ఏవీ ఉంచొద్దు... హైకోర్టు కీలక ఆదేశాలు
Read Latest Telangana News and National News