Share News

WHO Report: 100 కోట్ల మందికి మానసిక రుగ్మతలు

ABN , Publish Date - Sep 04 , 2025 | 05:00 AM

ప్రపంచంలోని 100 కోట్లమందికి పైగా ప్రజలు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) నివేదిక వెల్లడించింది.

WHO Report: 100 కోట్ల మందికి మానసిక రుగ్మతలు

ప్రతి ఏడుగురిలో ఒకరికి మానసిక వ్యాకులత

  • కుంగుబాటు, మానసిక ఆందోళన బాధితులే ఎక్కువ.. ప్రతి 100 మరణాల్లో ఒక ఆత్మహత్య

  • మానసిక ఆరోగ్యంపై వ్యయం 2ు మాత్రమే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ఆందోళన

హైదరాబాద్‌, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోని 100 కోట్లమందికి పైగా ప్రజలు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) నివేదిక వెల్లడించింది. ప్రతి ఏడుగురిలో ఒకరికి మానసిక రుగ్మతలు ఉన్నాయని తెలిపింది. మొత్తం కేసుల్లో మూడింట రెండొంతుల మంది కుంగుబాటు, మానసిక ఆందోళన బాధితులే. మానసిక ఒత్తిడి, వ్యాకులత కారణంగా పెద్ద ఎత్తున ప్రాణ నష్టంతో పాటు ఆర్థికంగా కూడా నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.


యువత మరణాల్లో ఆత్మహత్యలు

2021 సంవత్సరానికి సంబంధించి డబ్ల్యూహెచ్‌ఓ తాజాగా ‘వరల్డ్‌ మెంటల్‌ హెల్త్‌ టుడే’, ‘మెంటల్‌ హెల్త్‌ అట్లాస్‌-2024’ పేర ఓ నివేదికను విడుదల చేసింది. యువత మరణాల్లో ఆత్మహత్యలు ప్రధానంగా ఉంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 100 మరణాల్లో ఒక ఆత్మహత్య ఉంటుందని, 20 ఆత్మహత్యాయత్నాల తర్వాత ఒక మరణం చోటు చేసుకుంటుందని నివేదిక వెల్లడించింది. ప్రతి 200 మందిలో ఒకరు స్కిజోఫ్రెనియాకు, ప్రతి 150 మందిలో ఒకరు బైపోలార్‌ డిజార్డర్‌కు గురవుతున్నారని, ఇది చాలా ఇబ్బందికర పరిణామమని తెలిపింది. నిజానికి స్కిజోఫ్రెనియా మిగతా అనారోగ్య సమస్యలకు హేతువవుతోందని, చాలా ఖరీదైన జబ్బుగా పరిణమిస్తుందని వెల్లడించింది.


వ్యయం అంతంత మాత్రమే

ప్రపంచవ్యాప్తంగా మానసిక రుగ్మతలున్న ప్రతి లక్షమందికి 13 మంది మానసిక ఆరోగ్య సిబ్బంది మాత్రమే ప్రస్తుతం సేవలందించగలు గుతున్నారని, ఈ సంఖ్య చాలా తక్కువ అని నివేదిక తెలిపింది. అనేక దేశాలు ఆరోగ్య రంగంపై పెట్టే వ్యయంలో 2 ు నిధులనే మానసిక ఆరోగ్యంపై వెచ్చిస్తున్నాయని, 2017 నుంచి ఈ ధోరణి మారడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. మానసిక ఆరోగ్యంపై పెడుతున్న వ్యయాన్ని ప్రజలపై పెడుతున్న వ్యయంగా చూడాలని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ డా.టెడ్రోస్‌ అధనామ్‌ సూచించారు. ప్రజల మానసిక ఆరోగ్యంపై ప్రతి దేశం, ప్రతి నాయకుడు దృష్టి పెట్టాలని, నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి

బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికీ కవిత రాజీనామా..

వేరే పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన కల్వకుంట్ల కవిత

Updated Date - Sep 04 , 2025 | 05:00 AM