Share News

Osmaniya Hospital: కొత్త జీవితమిచ్చిన ‘ఉస్మానియా’

ABN , Publish Date - Jan 30 , 2025 | 04:21 AM

ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలతో ఒకే నెలలో ఐదుగురికి కొత్త జీవితం ప్రసాదించారు. వీరంతా పేద కుటుంబాలకు చెందినవారు. వీరిలో రెండేళ్లు, ఏడేళ్ల వయసు పిల్లలు ఇద్దరు ఉన్నారు.

Osmaniya Hospital: కొత్త జీవితమిచ్చిన ‘ఉస్మానియా’

  • ఒకే నెలలో ఐదుగురికి కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు

మంగళ్‌హాట్‌, జనవరి 29(ఆంధ్రజ్యోతి): ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలతో ఒకే నెలలో ఐదుగురికి కొత్త జీవితం ప్రసాదించారు. వీరంతా పేద కుటుంబాలకు చెందినవారు. వీరిలో రెండేళ్లు, ఏడేళ్ల వయసు పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఒక్కోదానికి రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు అయ్యే శస్త్రచికిత్సలను ఉస్మానియాలో పూర్తి ఉచితంగా నిర్వహించారు. సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హెచ్‌వోడీ డాక్టర్‌ మధుసూదన్‌ వివరాలు వెల్లడించారు.


ఖమ్మం జిల్లాకు చెందిన అజిత్‌ కుమార్‌(2)కు నానమ్మ, సూర్యాపేట జిల్లాకు చెందిన సాత్విక్‌ గౌడ్‌(7)కు తల్లి కాలేయం దానం చేశారు. బీఎస్సీ విద్యార్థి జీ వెంకటేశ్‌ (జోగులాంబ గద్వాల), ఎం హర్షప్రియ (హనుమకొండ), వెంకటేశ్‌ (40)కు ఎవరూ దాతలు లేకపోవడంతో ఇటీవల బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తి నుంచి సేకరించిన కాలేయాన్ని అమర్చారు. ప్రస్తుతం ఐదుగురూ ఆరోగ్యంగా ఉన్నారని హెచ్‌వోడీ తెలిపారు. శస్త్రచికిత్సలు నిర్వహించిన వైద్య బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాకేశ్‌ సహాయ్‌, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్‌ శ్రీభూషణ్‌ రాజు అభినందించారు.

Updated Date - Jan 30 , 2025 | 04:21 AM