Oil palm prices: ఆయిల్‌పామ్ గెలల ధర పైపైకి!
ABN , Publish Date - Mar 02 , 2025 | 03:41 AM
ఆయిల్‌పామ్ గెలల ధర ఆశించిన దాని కన్నా ఎక్కువ పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఆయిల్‌పామ్ ఓఈఆర్(ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేటు) తగ్గకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవడం,
రెండేళ్లలోనే రూ.8వేల దాకా పెరుగుదల.. ప్రస్తుతం టన్ను ధర రూ.20,814కు చేరిక
ఓఈఆర్ తగ్గకుండా పటిష్ఠమైన చర్యలు.. మంత్రి తుమ్మల కృషితో సత్ఫలితాలు
సత్తుపల్లి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్ గెలల ధర ఆశించిన దాని కన్నా ఎక్కువ పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఆయిల్‌పామ్ ఓఈఆర్(ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేటు) తగ్గకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవడం, మద్దతు ధరపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ఆయిల్‌పామ్ రైతులకు మేలు జరుగుతోంది. గత నెలలో ఆయిల్ పామ్ గెలల ధర టన్నుకు రూ.20,487 ఉండగా.. ప్రస్తుతం రూ.20,814కు పెరిగింది.
20లక్షల ఎకరాలకు పెంచాలని లక్ష్యం
రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును 20 లక్షల ఎకరాలకు పెంచాలని గతంలోనే వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి తుమ్మల దిశానిర్దేశం చేశారు. ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించే చర్యల్లో భాగంగా మొదటి మూడేళ్లపాటు సబ్సిడీని అందిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో ఆయిల్‌పామ్ సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టి.. అన్ని స్థాయిల్లో స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయిల్‌పామ్ గెలల ధర రైతులకు గిట్టుబాటు అయ్యేలా చర్యలు తీసుకున్నారు. గతంలో కొన్ని ప్రైవేటు కంపెనీలు భారీగా పైరవీలు చేసి.. ఆయిల్ రికవరీ శాతాన్ని తగ్గించడంతో రైతులకు సరైన ధర లభించేది కాదు. కానీ.. తుమ్మల వ్యవసాయశాఖ మంత్రి అయినప్పటి నుంచి ఓఈఆర్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆయిల్‌ఫెడ్‌పై ప్రైవేటు కంపెనీల పెత్తనం పడకుండా చర్యలు తీసుకున్నారు. ఆయిల్‌పామ్‌కు కనీస మద్దతు ధర ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు. దీంతో ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు భరోసా ఏర్పడింది. తుమ్మల మంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి టన్ను ధర రూ.12,300 ఉండగా..గత ఏడాది నవంబరులో రూ.20,043కు, గత నెలలో రూ.20,487కు, తాజాగా రూ.20,871కు చేరింది. ప్రతి జిల్లాలో ఒక ఆయిల్‌పామ్ కర్మాగారాన్ని నిర్మిస్తామని తుమ్మల ఇప్పటికే ప్రకటించారు. సిద్దిపేటలో కర్మాగార నిర్మాణం పూర్తికాగా, బాచుపల్లిలో ఇంకా కొనసాగుతోంది. పెరిగిన ధరతో రాష్ట్రంలోని వేలాది మంది రైతులకు ప్రయోజనం చేకూరినట్లయింది.