Share News

తేలిన ఎమ్మెల్సీ బరి!

ABN , Publish Date - Feb 14 , 2025 | 04:39 AM

రాష్ట్రంలో ఒక పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ ఎమెల్సీ నియోజకవర్గాల ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం గురువారం ముగిసింది.

తేలిన ఎమ్మెల్సీ బరి!

  • ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

  • కరీంనగర్‌ పట్టభద్రుల స్థానంలో 56 మంది.. ఉపాధ్యాయ నియోజకవర్గంలో 15 మంది

  • నల్లగొండ ఉపాధ్యాయ బరిలో 19 మంది పోటీ

  • ‘కరీంనగర్‌’ను నిలుపుకోవాలన్న పట్టుదలతో

  • కాంగ్రెస్‌... గెలుపు కోసం బీజేపీ ప్రయత్నాలు

  • బరిలో 40 మందికి పైగా ఇండిపెండెంట్లు

  • నల్లగొండలో ఐదుగురి మధ్యే ప్రధాన పోటీ

  • ఉపాధ్యాయ సంఘాల హోరాహోరీ పోరు

కరీంనగర్‌/నల్లగొండ, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలో ఒక పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ ఎమెల్సీ నియోజకవర్గాల ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం గురువారం ముగిసింది. ఉపసంహరణ అనంతరం కరీంనగర్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-మెదక్‌ పట్టభద్రుల స్థానంలో 56 మంది, ఇవే జిల్లా ఉపాధ్యాయ స్థానంలో 15 మంది పోటీలో మిగిలారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 19 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ నెల 27న పోలింగ్‌, మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో వంద నామినేషన్లు దాఖలు కాగా పరిశీలనలో 32 తిరస్కరణకు గురయ్యాయి. గురువారం 12 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఉపాధ్యాయ స్థానానికి 17 నామినేషన్లు రాగా.. ఒకటి తిరస్కరణకు గురైంది. ఒకరు నామినేషన్‌ వెనక్కి తీసుకున్నారు. ఇక నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ముగ్గురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.


సిట్టింగ్‌ స్థానంపై కాంగ్రెస్‌ గురి

కరీంనగర్‌ పట్టభద్రుల స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని కాంగ్రెస్‌ పట్టుదలతో ఉండగా... గెలుపు కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఈ స్థానంలో ఆ పార్టీకి చెందిన టీ జీవన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం కోసం పలువురు పోటీపడ్డా పార్టీ రాష్ట్ర నాయకత్వం వీ నరేందర్‌రెడ్డిని ఎంపిక చేసింది. నరేందర్‌ రెడ్డి అల్ఫోర్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌గా ఉత్తర తెలంగాణలో గుర్తింపు ఉన్న వ్యక్తి కావడంతో బీజేపీ కూడా విద్యాసంస్థల అధినేతనే రంగంలోకి దింపింది. చినమైల్‌ అంజిరెడ్డి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. బీఆర్‌ఎస్‌ పోటీ చేయకూడదని నిర్ణయించుకోవడంతో ఆ పార్టీ టికెట్‌ ఆశించిన కరీంనగర్‌ మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థిగా బరిలోకి దిగారు. బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించిన ట్రస్మా మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు ప్రైవేట్‌ విద్యాసంస్థల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ టికెట్‌ కోసం చివరివరకు ప్రయత్నించిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ప్రసన్న హరికృష్ణ బహుజన సమాజ్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ పార్టీ ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ నామినేషన్‌ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌తో పాటు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావును పంపించింది. బీజేపీ అభ్యర్థి గెలుపు బాధ్యతను కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ తీసుకుని నియోజకవర్గ పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇరు పార్టీలు క్షేత్రస్థాయిలో క్యాడర్‌కు బాధ్యతలు అప్పగించి పట్టభద్రుల మద్దతు కూడగట్టడానికి వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. టికెట్‌ ఆశించి భంగపడి.. వేరే పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగిన రెబల్స్‌ ప్రధాన పార్టీలకు సవాల్‌ విసురుతూ ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. లంటు చంద్రశేఖర్‌ (ఆలిండియా కిసాన్‌ జనతా పార్టీ), దొడ్ల వెంకటేశం (తెలంగాణ ప్రజాశక్తి పార్టీ), బక్క జడ్సన్‌ (విద్యార్థుల రాజకీయ పార్టీ), మంద జ్యోతి (దర్మసమాజ్‌ పార్టీ), బొల్లి సుభాష్‌ (తెలంగాణ ద్రవిడ ప్రజల పార్టీ), సిలివేరు ఇంద్రగౌడ్‌ (నేషనల్‌ నవ క్రాంతి పార్టీ), స్వతంత్ర అభ్యర్థులుగా ముస్తాక్‌ అలీతో పాటు మరో 44 మంది బరిలో ఉన్నారు. కరీంనగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మల్క కొమురయ్య (బీజేపీ), యాటకారి సాయన్న (బహుజన సమాజ్‌ పార్టీ), గవ్వల లక్ష్మి (దళిత బహుజన్‌ పార్టీ), వై అశోక్‌కుమార్‌, కంటె సాయన్న, కూర రఘోత్తంరెడ్డి, చాలిక చంద్రశేఖర్‌, జగ్గు మల్లారెడ్డి, తిరుమల్‌రెడ్డి ఇన్నారెడ్డి, మామిడి సుధాకర్‌రెడ్డి, ముత్తారం నర్సింహస్వామి, వంగ మహేందర్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి వేముల, సిలివేరు శ్రీకాంత్‌, ఎల్‌ సుహాసిని (ఇండిపెండెంట్లు) పోటీలో ఉన్నారు.


పెరిగిన ఓటర్ల సంఖ్య

42 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్న కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో 3,55,159 ఓట్లు, ఉపాధ్యాయ నియోజకవర్గంలో 28,088 ఓట్లు ఉన్నాయి. 2019లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం 1,96,321 ఓట్లు, ఉపాధ్యాయ స్థానంలో 23,214 ఓట్లు ఉన్నాయి. పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఆశావహులు నాలుగు నెలల ముందు నుంచే ఓటర్లను పోటాపోటీగా నమోదు చేయించడంతో ఈసారి ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.

నల్లగొండ టీచర్‌ ఎమ్మెల్సీ బరిలో...

నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానంలో ఉత్కంఠ పోరుకు తెరలేచింది. గురువారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ముగ్గురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈ సీటు దక్కించుకోవడమే లక్ష్యంగా ఉపాధ్యాయ సంఘాలు హోరాహోరీగా తలపడుతుంటే, పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ స్థానంలో ఇప్పటివరకు బీజేపీ మాత్రమే తన అభ్యర్థిని అధికారికంగా ప్రకటించగా.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ప్రత్యక్షంగా ఎవరికీ మద్దతు తెలపకుండా తటస్థంగా ఉన్నాయి. బీసీ నినాదంతో ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న బీసీ అభ్యర్థులకు మొదటి, ద్వితీయ ప్రాధాన్య ఓట్లు వేయాలని సూచించడంతో పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు సిట్టింగ్‌ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి యూటీఎఫ్‌ మద్దతుతో మరోసారి బరిలో దిగితే, పీసీసీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి టీపీఆర్టీయూ మద్దతుతో పోటీ చేస్తున్నారు. పీఆర్టీయూటీఎస్‌ మద్దతుతో పింగిలి శ్రీపాల్‌, బీజేపీ అభ్యర్థిగా పులి సరోత్తంరెడ్డి పోటీ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ బీసీ నినాదంతో ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న మద్దతుతో బరిలో నిలిచారు. ఈ ఐదుగురు అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ కొనసాగనుంది. తనకు అధికారికంగా మద్దతివ్వాలని హర్షవర్ధన్‌ రెడ్డి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, మూడు ఉమ్మడి జిల్లాల మంత్రులకు ఇప్పటికే విన్నవించినా కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం ప్రకటించలేదు. మరోవైపు శ్రీపాల్‌రెడ్డి సైతం కాంగ్రెస్‌ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో అప్పటి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పూల రవీందర్‌కి మద్దతు ఇచ్చిన బీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వబోమని ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ఉపాధ్యాయుల మద్దతు సాధించేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో 24,905 మంది ఓటర్లు ఉండగా 200 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Updated Date - Feb 14 , 2025 | 04:39 AM