Engineering: ఇంజనీరింగ్‌కు పాత ఫీజులే!
ABN , Publish Date - Jul 01 , 2025 | 05:10 AM
రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఇతర వృత్తివిద్య కోర్సులకు ఈ విద్యాసంవత్సరంలో కూడా పాత ఫీజులే కొనసాగనున్నాయి. నిబంధనల ప్రకారం 2025-28 విద్యా సంవత్సరం ఫీజులను సవరించాల్సి ఉండగా..
ఎంబీఏ, ఫార్మసీ, ఇతర వృత్తి విద్య కోర్సులకూ నిరుటి ఫీజులే కొనసాగింపు
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు
సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా కళాశాలల ఫీజు పెంపు ప్రతిపాదనలు
పరిశీలనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
ఇతర రాష్ట్రాల విధానాలపైనా అధ్యయనం
హైదరాబాద్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఇతర వృత్తివిద్య కోర్సులకు ఈ విద్యాసంవత్సరంలో కూడా పాత ఫీజులే కొనసాగనున్నాయి. నిబంధనల ప్రకారం 2025-28 విద్యా సంవత్సరం ఫీజులను సవరించాల్సి ఉండగా.. దీన్ని మరో ఏడాది వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఇతర వృత్తి విద్య యూజీ, పీజీ కోర్సుల ఫీజులను యథాతథంగా కొనసాగించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఫీజుల సవరణపై ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చిన ప్రతిపాదనలు సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా లేవని తెలిపారు. ఆయా కళాశాలల ప్రతిపాదనలను పరిశీలించేందుకు అధికారులతో ప్రత్యేక కమిటీ వేస్తామన్నారు. ఈ కమిటీ ఫీజుల పెంపు ప్రాతిపదికను పరిశీలిస్తుందని, మరింత మెరుగైన సవరణలు సూచిస్తుందని పేర్కొన్నారు. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలను ఇతర రాష్ట్రాలు ఎలా అమలు చేస్తున్నాయనే అంశాలను కమిటీ పరిశీలిస్తుందని వెల్లడించారు. 2022-25లో పేర్కొన్న ఫీజులనే ఈ ఏడాదీ కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
నిరుడు గరిష్ఠ ఫీజు రూ.1.60 లక్షలు!
దాదాపు అన్ని ఇంజనీరింగ్ కళాశాలలూ ఫీజులను పెంచాలంటూ ప్రతిపాదనలు పంపాయి. హైదరాబాద్, శివార్లలోని అనేక కాలేజీలు ఫీజులను 100 శాతం పెంచాయి. గత ఏడాది ఇంజనీరింగ్‌లో గరిష్ఠ ఫీజు రూ.1.60 లక్షలుగా ఉంది. ఈసారి వచ్చిన ప్రతిపాదనల్లో కొన్ని ప్రముఖ కళాశాలలు వార్షిక ఫీజును రూ.2.50 లక్షలకు పెంచాలని ప్రతిపాదించాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ విద్యా సంవత్సరంలో కూడా పాత ఫీజులే ఉండనున్నాయి. వచ్చే విద్యాసంవత్సరంలో అన్ని ఇంజనీరింగ్ కాలేజీలను తనిఖీ చేసి, అక్కడి వసతులు, బోధనా సిబ్బందికి నిబంధనల ప్రకారం జీతాలు చెల్లిస్తున్నారా? లేదా? వంటి అన్ని విషయాలను పరిశీలించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.