Local Body Elections: కోవర్టుల కలకలం
ABN , Publish Date - Dec 08 , 2025 | 07:33 AM
బాన్సువాడ మండలంలో పంచాయతీ ఎన్నికల వేడి పెరిగింది. గుప్త రాజకీయ కదలికలు, కోవర్టు కార్యకర్తల వ్యూహాలతో సర్పంచ్ అభ్యర్థులు ఆందోళనలో పడుతున్నారు. బలం, బలహీనతల సమాచార సేకరణ, రహస్య మీటింగ్స్ గ్రామాల్లో చర్చనీయాంశంగా మారాయి.
బాన్సువాడ మండలంలో సర్పంచ్ అభ్యర్థులకు గుబులు
ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మొద్దో తెలియని పరిస్థితి
బాన్సువాడ రూరల్, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): బాన్సువాడ మండంలో పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంది. కోనాపూర్, దేశాయిపేట్, సంగోజీవాడి, కొల్లూరు, నాగారం, బుడిమి, బోర్లం, కొత్తబాద్ గ్రామాల్లో రాజకీయ పరిస్థితులు పూర్తిగా హీటెక్కాయి. ప్రచార బాణాలు వెలుపల కనిపిస్తే గుప్త రాజకీయ కదలికలు లోపల అభ్యర్థులను కలవరపడుతున్నాయి. ఆయా గ్రామాల్లో సర్పంచ్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థులకు తామే అన్ని రకాలుగా అండగా ఉంటున్నామని పైకి చెబుతున్నప్పటికీ ప్రత్యర్థి పార్టీ బలపర్చిన అభ్యర్ధులకు మాత్రం లోలోపల మద్దతు కూడబెడుతున్నారు. ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులకు బలం, బలహీనతల కోసం తమకు చెందిన కొంత మంది కార్యకర్తలను ఇతర వర్గంలోకి చేర్పించి వారి సమాచారాన్ని రాబట్టేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. కోవర్టు కార్యకర్తలు గ్రామాల్లో ప్రస్తుతం కీలకపాత్ర పోషిస్తున్నారు. పగలు ఓ అభ్యర్థికి రాత్రివేళ వాట్సప్ కాల్స్, సీక్రెట్ మీటింగ్స్ ద్వారా ప్రత్యర్థుల వ్యూహాలకు బలం చేకూరుస్తున్నారని సమాచారం.
వారు బలం చేకూర్చేనా?
గ్రామ పంచాయతీ సర్పంచ్‌కు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆయా గ్రామాల్లో కుల సంఘాల నాయకులు, యువకులతో సమావేశమై వారికి కావాల్సిన ముడుపులు అందిస్తామని వారికి ప్రలోభాలకు గురి చేస్తూ ఎన్నికల్లో తమకు మద్దతు పలకడమే కాకుండా ఓట్లు వేయించాలని వారితో ప్రమాణాలు చేయిస్తున్నారు. స్థానికంగా పేరున్న కొందరు యువత, కుల సంఘాల కీలక సభ్యులు గుట్టు చప్పుడు కాకుండా సమీకరణాలు మార్చడం, ఓటర్లపై ప్రభావం చూపడం గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి
పాకిస్థాన్ ఆర్మీపై జైశంకర్ విమర్శలు.. పాక్ యంత్రాంగం ఆగ్రహం..
పంచాయతీలకు గూడు కరువు.. కాబోయే సర్పంచ్‌లకు పరీక్షే..